Skip to main content

అశోక చక్ర పురస్కారానికి ఎంపికైన అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌?

దేశ అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రనుజమ్మూకశ్మీర్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబూరామ్‌కు, అలాగే, రెండో అత్యున్నత శౌర్యపతకం కీర్తి చక్రను కానిస్టేబుల్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌ భట్‌లకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరులో ధైర్య సాహసాలు ప్రదర్శించివీరమరణం పొందారని కొనియాడింది.75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సాయుధ బలగాలకు 144 శౌర్య పతకాలను ప్రకటించారు. ఇందులో 15 శౌర్య చక్ర, 120 సేనా పతకాలు, అశోక చక్ర, కీర్తి చక్ర ఒక్కోటి చొప్పున ఉన్నాయి.

జమ్మూలోని పూంఛ్‌ జిల్లాకు చెందిన బాబూ రామ్‌ 1999లో పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. 2002 శ్రీనగర్‌లో స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌లో బాధ్యతలు చేపట్టి, 14 ఎన్‌కౌంటర్లలో పాల్గొని 28 మంది ఉగ్రవాదులను అంతమొందించడంలో కీలకంగా ఉన్నారు. 2020, ఆగస్టులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన వీరమరణం పొందారు. శ్రీనగర్‌లోని రత్‌పొరాకు చెందిన కానిస్టేబుల్‌ భట్‌ 2020, అక్టోబర్‌ 6వ తేదీన గండేర్‌బల్‌లో విధుల్లో ఉండగా ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందారు.

15మందికి శౌర్యచక్ర
మూడో అత్యున్నత సాహస పురస్కారం శౌర్యచక్రను ఆర్మీకి చెందిన ఆరుగురికి, వైమానిక దళానికి చెందిన ఇద్దరికి, ఒక నేవీ అధికారికి, ఆరుగురు పోలీస్‌ పారా మిలటరీ సిబ్బందికి కేంద్రం ప్రకటించింది. మొత్తం 15 పతకాల్లో నాలుగు మరణానంతరం ప్రకటించారు. 2020 ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మేజర్‌ అరుణ్‌ కుమార్‌ పాండే, రవి కుమార్‌ చౌధరి, కెప్టెన్‌ అశుతోష్‌ కుమార్‌ (మరణానంతరం), కెప్టెన్‌ వికాస్‌ ఖత్రి, రైఫిల్‌ మ్యాన్‌ ముకేశ్‌ కుమార్, సిపాయి నీరజ్‌ అహ్లావత్‌లకు శౌర్యచక్ర ప్రకటించారు. అదేవిధంగా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో 2019 ఎన్నికల సమయంలో నలుగురు మావోయిస్టులను చంపిన సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ముగ్గురు కోబ్రా కమాండోలకు శౌర్యచక్ర లభించింది.201వ బెటాలియన్‌కు చెందిన వీరు డిప్యూటీ కమాండెంట్‌ చితేశ్‌ కుమార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మంజీందర్‌ సింగ్, కానిస్టేబుల్‌ సునీల్‌ చౌధరి. వీరితోపాటు, నేవీలో కెప్టెన్‌ సచిన్‌ రుబెన్‌ సెకిరాకు, వైమానిక దళంలో గ్రూప్‌ కెప్టెన్‌ పర్మిందర్‌ అంటిల్, వింగ్‌ కమాండర్‌ వరుణ్‌ సింగ్‌లకు శౌర్య చక్రను ప్రకటించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అశోక చక్ర పురస్కారానికి ఎంపికైన అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌?
ఎప్పుడు : ఆగస్టు14
ఎవరు : జమ్మూకశ్మీర్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబూరామ్‌
ఎందుకు :జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరులో ధైర్య సాహసాలు ప్రదర్శించివీరమరణం పొందినందున...
Published date : 16 Aug 2021 06:42PM

Photo Stories