Skip to main content

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన

అగ్రరాజ్యం అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ జాన్ ట్రంప్ తొలిసారి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పర్యటించారు.

Current Affairs


అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి భారత్‌లో రెండు రోజులపాటు ఆయన పర్యటించారు. ఫిబ్రవరి 24, 25 తేదీలలో జరిగిన ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ బృందం పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఫిబ్రవరి 26న అమెరికా చేరుకున్న ట్రంప్ ‘భారత్ చాలా గొప్ప దేశం. నా పర్యటన విజయవంతమైంది’అని ట్వీట్ చేశారు.

అహ్మదాబాద్‌లో స్వాగతం, సబర్మతి సందర్శన
ట్రంప్, ఆయన బృందం వచ్చిన ‘ఎయిర్‌ఫోర్స్ 1’ విమానం ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఇక్కడ వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. దాదాపు పావుగంట పాటు గడిపిన అనంతరం, మొతెరా స్టేడియానికి బయల్దేరారు.

మొతెరాలో నమస్తే ట్రంప్ కార్యక్రమం
హౌడీ మోదీ కార్యక్రమం తరహాలోనే అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం మొతెరాలో ఫిబ్రవరి 24న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహించారు. వేదికపైకి మోదీ, ట్రంప్‌తో పాటు మెలానియా వచ్చారు. కార్యక్రమంలో భాగంగా 1.25 లక్షల మంది హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ట్రంప్, మోదీ ప్రసంగించారు. ‘నమస్తే.. నమస్తే.. హలో ఇండియా’ అంటూ తన ప్రసంగాన్ని ట్రంప్ ప్రారంభించారు. భారత సాంస్కృతిక వైభవం, భారత్ సాధించిన విజయాలు, భారత్ పాటిస్తున్న గొప్ప విలువలు, భాంగ్రా నృత్యం, హోళీ, దీపావళి పండగలు, స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయి పటేల్, షోలే, డీడీఎల్‌జీ వంటి బాలీవుడ్ సినిమాలు, క్రికెటర్లు సచిన్, కోహ్లీలను ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు భారత్, అమెరికాలు కృషి చేస్తున్నాయన్నారు. పాకిస్తాన్‌తో సానుకూలంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు.

మోదీ ప్రసంగిస్తూ.. ‘21వ శతాబ్దంలో ప్రపంచ గతిని మార్చడంలో భారత్, అమెరికా సంబంధాలు, వాటి మధ్య నెలకొన్న సహకారం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు దేశాలు సహజసిద్ధ భాగస్వాములు’ అని వ్యాఖ్యానించారు.

ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు
Current Affairs ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 25న ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో కీలక ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో మోదీ, ట్రంప్ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య ముఖ్యమైన రక్షణ ఒప్పందంతో పాటు ఇంధన, ఆరోగ్య రంగాల్లో మూడు ఒప్పందాలు కుదిరాయి.

ఒప్పందం: 1
మోదీతో చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. 300 కోట్ల డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, 260 కోట్ల డాలర్ల విలువైన 24 ఎంహెచ్ -60 రోమియో హెలికాప్టర్లను భారతీయ నౌకాదళం కోసం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. అలాగే, 80 కోట్ల డాలర్ల విలువైన ఆరు ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను ఆర్మీ అవసరాల కోసం ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది.

చదవండి: రోమియో, అపాచీ హెలికాప్టర్ల విశేషాలు, వివరాలు

ఒప్పందం: 2
మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఇరు దేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. భారత్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్‌‌స స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మధ్య వైద్య ఉత్పత్తుల రక్షణకి సంబంధించి ఎంఓయూపై సంతకాలు జరిగాయి.

ఒప్పందం: 3
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎగ్జాన్ మొబిల్ ఇండియా ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్, చార్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌ల మధ్య సహకారానికి సంబంధించి ఒక లెటర్ ఆఫ్ కోఆపరేషన్‌పై సంతకాలు జరిగాయి.

ఐదు రంగాల్లో చర్చలు
మోదీ, ట్రంప్ చర్చల అనంతరం, వాటి వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ‘అంతర్గత భద్రత, రక్షణ, ఇంధనం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు’ అనే ఐదు ప్రధాన రంగాల్లో సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాలు సంయుక్తంగా వర్కింగ్ గ్రూప్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయన్నారు. చర్చల సందర్భంగా హెచ్1 బీ వీసాల విషయం, మత సామరస్యం, భిన్నత్వం, బహుళత్వం, ఉగ్రవాదం, పాకిస్తాన్ భూభాగంపై ఉగ్ర స్థావరాలు, సీమాంతర ఉగ్రవాదం వంటి అంశాలు పస్తావనకు వచ్చాయన్నారు.

త్రివిధ బలగాల గౌరవ వందనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఫిబ్రవరి 25న రాష్ట్రపతి భవన్‌కి వచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవిత కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారికి స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ ఫోర్ కోర్టులో అధ్యక్షుడు ట్రంప్‌కి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి.

కోవింద్ పసందైన విందు
ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 25న రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన ట్రంప్ దంపతులకు కోవింద్ దంపతులు ఆహ్వానం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో దర్బార్ హాలులోకి ట్రంప్ దంపతుల్ని తీసుకువెళ్లి అంతా చూపించారు. ఆ హాలులో 5వ శతాబ్దం నాటి గౌతమ బుద్ధుడి విగ్రహం, భారతీయ నాయకులు చిత్రపటాలు ఉన్నాయి. ఆ తర్వాత ట్రంప్, కోవింద్ కాసేపు మాట్లాడుకున్నారు. అమెరికా తమకు అత్యంత విలువైన మిత్ర దేశమని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని కోవింద్ అన్నారు. ఇండియా, యూఎస్ మధ్య వాణిజ్య, రక్షణ ఒప్పందాల్లో ముందడుగులు పడ్డాయని ట్రంప్ చెప్పారు.

రాష్ట్రపతి విందుకు ట్రంప్ దంపతులతో పాటు, ట్రంప్ బృందం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. అలాగే నలుగురు ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు(తెలంగాణ), బీఎస్ యడియూరప్ప(కర్ణాటక), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా),శర్బానంద సోనోవాల్(అస్సాం)..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ, బ్యాంకర్ ఉదయ్ కొటక్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. విందు అనంతరం ట్రంప్ బృందం తిరుగు పయనమైంది.

ట్రంప్ భారత పర్యటన-విశేషాలు
  • ట్రంప్ దంపతులు అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని, ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలాన్ని సందర్శించారు.
  • చెడు వినకు , చెడు కనకు, చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనని చాటి చెప్పే మూడు కోతుల బొమ్మల్ని సబర్మతిలో ట్రంప్, మెలానియాలకు మోదీ కానుకగా ఇచ్చారు.
  • మోతెరా స్టేడియం సామర్త్యం 1.10 లక్షలు కాగా ఫిబ్రవరి 24న అంతకు మించి 1.25 లక్షల మంది చేరారు.
  • మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించిన తాజ్‌మహల్‌ను ట్రంప్ దంపతులు సందర్శించారు. తాజ్ చరిత్ర, గొప్పదనం గురించి ట్రంప్ దంపతులకు నితిన్ కుమార్ అనే స్థానిక గైడ్ వివరించారు.
  • ఫిబ్రవరి 25న భారత దిగ్గజ సంస్థల సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు.
  • బ్లాక్ లిమోజిన్ ‘ది బీస్ట్’లో ప్రయాణిస్తూ అహ్మదాబాద్ నిర్వహించిన రోడ్ షోలో ట్రంప్ పాల్గొన్నారు. దారి పొడవునా దాదాపు 22 కిమీ మేర వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రత్యేకతలను వివరించేలా దాదాపు 50 వేదికలను ఏర్పాటు చేశారు. ఆ వేదికలపై ఆయా రాష్ట్రాల కళాకారులు తమ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు.
  • అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ఫిబ్రవరి 25న ఢిల్లీలోని మోతీబాగ్‌లో సర్వోదయ బాలబాలికల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదిలో కూర్చొని హ్యాపీనెస్‌ క్లాసుల్ని విన్నారు.

Published date : 28 Feb 2020 01:46PM

Photo Stories