73వ స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం జగన్
Sakshi Education
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- అన్ని విధాలా వెనుకబాటు తనం, అవినీతి, దళారీలు, సామాజిక-ఆర్థిక- రాజకీయ వెనకబాటుతనంతో కునారిల్లుతున్న వ్యవస్థను మార్చుకోవాలన్న కృత నిశ్చయంతోనే తమ ప్రభుత్వం నవరత్నాలు ప్రకటించింది.
- శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన మొట్ట మొదటి ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను.
- ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింప జేస్తూ చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనదే.
- అక్టోబర్ 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్నాం.
- పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా, స్థానికుల నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టేలా తొలిసారిగా చట్టం చేస్తున్నాం.
- పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌లను ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రభుత్వ శాఖల్లో రూ.కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్‌లైన్‌లో పెడతాం.
- జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా టెండరు పనులను ఖరారు చేసే ప్రక్రియను హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తున్నాం.
- రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున ఈ అక్టోబర్ 15వ తేదీ నుంచే అందించబోతున్నాం. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు.
- తుపాను, కరువు వచ్చినప్పుడు రైతన్నలను ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశాం.
- గోదావరి జలాలను సాగర్, శ్రీశైలంకు తరలించటం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు అందించే కార్యక్రమం ప్రారంభించటానికి ప్రణాళికలు వేస్తున్నాం.
- 972 కిలోమీటర్ల సముద్ర తీరం, సీ పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్-రోడ్డు కనెక్టివిటీతో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం.
Published date : 16 Aug 2019 04:26PM