Skip to main content

2020 ఏడాదికి ఆర్థిక నోబెల్ పురస్కారం గెలుచుకున్న ఆర్థిక వేత్తలు?

వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచిన అమెరికన్ ఆర్థికవేత్తలు, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్‌గ్రూమ్, రాబర్ట్ బి విల్సన్‌లకు 2020 ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కారం లభించింది.
Edu newsఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ సెక్రటరీ జనరల్ గొరాన్ హాన్సన్ అక్టోబర్ 12న విజేతలను ప్రకటించారు. ఆర్థిక శాస్త్ర నోబెల్ అవార్డు కింద రూ.8.32 కోట్ల నగదు, బంగారు పతకం లభిస్తాయి.

అమ్మడం వీలుకాని వాటిని విక్రయిచేందుకు...
వేలం పాటలు ఎలా పనిచేస్తా అన్న విషయాన్ని పరిశీలించిన అవార్డు గ్రహీతలు సంప్రదాయ పద్ధతుల్లో అమ్మడం వీలుకాని (రేడియో తరంగాలు, విమానాల ల్యాండింగ్ స్లాట్స్ వంటివి) వస్తు, సేవలను విక్రయించేందుకు కొత్త వేలం పద్ధతులను ఆవిష్కరించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు, ఇటు వినియోగదారులతోపాటు పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందారని నోబెల్ అవార్డుల కమిటీ తెలిపింది.

తుదిఫలితాలను అర్థం చేసుకునేందుకు...
రాబర్ట్ విల్సన్, రాబర్ట్ విల్సన్ పూర్వ విద్యార్థి అయిన మిల్‌గ్రూమ్‌లు... వేలంపాట సిద్ధాంతం ఆధారంగా వేలంపాట జరిగే తీరు, తుది ధరలు, వేలంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసే నిబంధనలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తుదిఫలితాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు.

రాబర్ట్ విల్సన్..
  • సాధారణ విలువగల వస్తువుల వేలానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. రేడియో తరంగాల భవిష్యత్తు ధరలు, నిర్దిష్ట ప్రాంతంలోని ఖనిజాల పరిమాణం వంటివన్నమాట.
  • ఇలాంటి అంశాల్లో సాధారణ విలువ కంటే తక్కువగా ఎందుకు బిడ్లు వేస్తారన్నది విల్సన్ తన సిద్ధాంతం ద్వారా తెలుసుకోగలిగారు. మరీ ఎక్కువగా చెల్లిస్తున్నామేమో అన్న బెంగ వీరికి ఉంటుందని 83 ఏళ్ల విల్సన్ అంటారు.

    పాల్ మిల్‌గ్రూమ్...
  • వేలంపాటలకు సంబంధించి ఓ సాధారణీకరించిన సిద్ధాంతాన్ని 72 ఏళ్ల మిల్‌గ్రూమ్ సిద్ధం చేశారు. ఇందులో సాధారణ విలువతోపాటు ఇతర విలువలూ ఉంటాయి. ఇవి ఒక్కో బిడ్డర్‌ను బట్టి మారిపోతూంటాయి.
  • వివిధ రకాల వేలం పద్ధతులను పరిశీలించిన మిల్‌గ్రూమ్ ఒకరకమైన పద్ధతి అమ్మేవాడికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇది కూడా బిడ్డర్లు ఇతరుల అంచనా విలువలను తెలుసుకోగలిగినప్పుడు వీలవుతుందని చెబుతున్నారు.
  • 1994లో అమెరికా అధికారులు తొలిసారి రేడియో తరంగాల వేలానికి మిల్‌గ్రూమ్ సిద్ధం చేసిన సరికొత్త విధానాన్ని ఉపయోగించగా ఆ తరువాత చాలా దేశాలు అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి.
    క్విక్ రివ్యూ :
    ఏమిటి
    : ఆర్థిక నోబెల్ పురస్కారం-2020 విజేతలు
    ఎప్పుడు : అక్టోబర్ 12
    ఎవరు : పాల్ ఆర్ మిల్‌గ్రూమ్, రాబర్ట్ బి విల్సన్
    ఎందుకు : వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచినందుకు
Published date : 13 Oct 2020 07:25PM

Photo Stories