Skip to main content

2020 ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న సంస్థ?

ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమానికి(డబ్ల్యూఎఫ్‌పీ) 2020 ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది.
Current Affairs

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి డబ్ల్యూఎఫ్‌పీ చేస్తున్న విశేష కృషికి ఈ అవార్డు దక్కింది. యుద్ధం, అంతర్గతపోరుకు ఆకలిని ఆయుధంగా చేసుకోకుండా డబ్ల్యూఎఫ్‌పీ అడ్డుకుందని నోబెల్ కమిటీ తెలిపింది. నార్వే రాజధాని ఓస్లోలో అక్టోబర్ 9న జరిగిన కార్యక్రమంలో నార్వే నోబెల్ ఇన్‌స్టిస్ట్యూట్ 101వ నోబెల్ శాంతి పురస్కార విజేతను ప్రకటించింది. ఈ బహుమానం కింద డబ్ల్యూఎఫ్‌పీకు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేస్తారు.

ప్రపంచం దృష్టి పడేందుకు...
‘ఆకలి బాధలు ఎదుర్కొంటున్న కోటానుకోట్ల మంది కష్టాలపై ప్రపంచం దృష్టి పడేందుకు ఈ అవార్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అవార్డు కమిటీ అధ్యక్షులు బెరిట్ రీస్ ఆండర్సన్ వ్యాఖ్యానించారు. 2019లో సుమారు 13.5 కోట్ల మంది ఆకలితో అలమటించారని, ఇటీవలి కాలంలో కరోనా కారణంగా ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందని కమిటీ పేర్కొంది. యెమెన్, కాంగో, నైజీరియా, సౌత్ సూడాన్ వంటి దేశాల్లో కోట్లాది మందికి ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.

రోమ్ కేంద్రంగా...
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉన్నచోట సాయమందించే డబ్ల్యూఎఫ్‌పీ ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేస్తోంది. గత ఏడాది ప్రపంచ ఆహార కార్యక్రమం దాదాపు 88 దేశాల్లోని పది కోట్ల మందికి ఆసరా కల్పించింది. ప్రస్తుతం డబ్ల్యూఎఫ్‌పీ అధ్యక్షుడిగా అమెరికాకి చెందిన డేవిడ్ బీస్లీ ఉన్నారు.

ప్రపంచ ఆహార కార్యక్రమం ఇదీ...

  • 2030 నాటికల్లా భూమ్మీద ఆకలిబాధలను సమూలంగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లేదా ప్రపంచ ఆహార కార్యక్రమం.
  • కరువు కాటకాలొచ్చినా.. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు చెలరేగినా నిరాశ్రయులకు, బాధితులకు ఆహారం అందివ్వడం ఈ సంస్థ ప్రథమ కర్తవ్యం. దీనికి మాత్రమే పరిమితం కాకుండా.. సుస్థిర అభివృద్ధికి వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది.
  • సిరియా, యెమెన్ వంటి దేశాల్లో లక్షల మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థకు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న మరో సవాలు వాతావరణ వైపరీత్యాలు.
  • గత ఏడాది ఇడాయి తుపాను కారణంగా ముజాంబీక్‌లో సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో పంట నీటమునిగిపోయింది. తిండిగింజల్లేని పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణం రంగలోకి దిగింది ఈ సంస్థ. ఆహారంతోపాటు నిరాశ్రయులకు మళ్లీ ఇళ్లు కట్టించడం వరకూ అనేక కార్యక్రమాలను చేపట్టింది.
  • భూసార పరిరక్షణ, పెంపు, సాగునీటి కల్పన, విద్య, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాల్లోనూ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తనవంతు సాయం అందిస్తుంది.


ప్రపంచ ఆహార కార్యక్రమం స్వరూపం ఇది..

  • ప్రపంచవ్యాప్త సిబ్బంది: 17,000
  • 2018లో ప్రపంచ దేశాల నుంచి సేకరించిన విరాళాలు: 720 కోట్ల డాలర్లు
  • 88 దేశాల్లో మంది లబ్ధిదారులు: 8.67 కోట్లు
  • అరవై దేశాల్లో మధ్యాహ్న భోజనం అందుకుంటున్న విద్యార్థుల సంఖ్య: 1.64 కోట్లు
  • ఆహారం, సాయం అందుకుంటున్న వారిలో మహిళలు, బాలికల శాతం: 52 శాతం
  • ప్రత్యక్షపంపిణీ ద్వారా అందించిన మొత్తం: 176 కోట్ల డాలర్లు
  • ఆహార పదార్థాల రవాణా: 20 నౌకలు, 5,600 ట్రక్కులు, 92 విమానాలతో
  • భారత్‌తోపాటు అనేక ఇతర దేశాల్లో పోషణ
  • లేక బాధపడుతున్న జనాభా: 5 -14.9 శాతం
  • 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడే వారి సంఖ్య (ప్రస్తుత గణాంకాల ప్రకారం): 84 కోట్లు

క్విక్ రివ్యూ :

ఏమిటి : నోబెల్ శాంతి బహుమతి-2020 విజేత
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ)
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి విశేష కృషి చేస్తున్నందుకు
Published date : 10 Oct 2020 04:41PM

Photo Stories