Skip to main content

127వ రాజ్యాంగ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశం?

జనాభాలో ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు లోక్‌సభ ఆగస్టు 10న ఆమోదం తెలిపింది.
సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా... సభకు హాజరైన మొత్తం 385 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు పలికారు. ఇది రాజ్యాంగసవరణ బిల్లు కావడంతో పార్లమెంట్‌ రెండు సభల్లో ప్రత్యేక మెజార్టీతో (హాజరైన వారిలో మూడింట రెండొంతల మంది ఆమోదం) ఆమోదం పొందాల్సి ఉంటుంది.

ఎందుకీ బిల్లు...
జాతీయ బీసీ కమిషన్‌ విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342ఏ, 366 (26సి) అధికరణలను చేర్చింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2021, ఏడాది మే 5న కీలకమైన తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్‌ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342ఏ చెబుతోందని, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. ఈ తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది. ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది.

671 కులాలకు ప్రయోజనం...
127వ రాజ్యాంగ సవరణ బిల్లు... 671 కులాలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక చట్టంగా మంత్రి వీరేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ పరిధిలోని ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించటం ద్వారా ఎన్నో కులాలకు సామాజిక, ఆర్థిక న్యాయం కలిగించవచ్చన్నారు. ఇందుకోసం అధికరణ 342ఏతో పాటు 338బీ, 366ను కూడా సవరించాల్సి ఉందని వీరేంద్రకుమార్‌ తెలిపారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : జనాభాలో ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టేందుకు...
Published date : 11 Aug 2021 06:11PM

Photo Stories