Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత.. సంచలన నిర్ణయాలతో.. చరిత్రను..
సాయుధుడైన దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ అబేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. కాపాడేందుకు వైద్యులు శాయశక్తుల ప్రయత్నించారని జపాన్ ప్రధాని ప్రకటించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి పోవడంతో ఆయన్ని కాపాడడం వీలు కాలేదని అధికారులు ప్రకటించారు. జూలై 8వ తేదీన ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా.. దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటనాస్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరోవైపు షింజోను కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
భారత్ అంటే ఆయనకు..
భవిష్యత్తును ఎంతో ముందుగానే ఊహించగలిగే నేతగా షింజో అబెకు మంచి పేరుంది. భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలు కలిస్తే చైనాకు పగ్గాలు వేయవచ్చని ఆయన ఎంతో ముందుగానే ఊహించారు. భారత్ అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ.. దీనికి చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత జపాన్ ఆర్థికంగా దెబ్బతిని అవమాన భారంతో ఉంది. ఈ క్రమంలో 1957లో ఆ దేశ ప్రధాని, షింజో తాత నొబుసుకె కిషి భారత్ పర్యటనకు వచ్చారు. ఆయనకు నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. ‘నేను ఎంతో గౌరవించే జపాన్ ప్రధాని’ అని ప్రజలకు పరిచయం చేశారు. ఈ ఘటన కిషి మనసును తాకింది. ఆయన తన దేశానికి వెళ్లిన తర్వాత మనవడికి భారత పర్యటన విశేషాలు.. ఆత్మీయ ఆతిథ్యాన్ని వివరించారు. ఆ విషయాలు చిన్నారి మనసులో నాటుకు పోయాయి.
అప్పట్లో సంచలనమైంది..
కాల చక్రం వేగంగా తిరిగింది.. 2006లో ఆ మనవడే జపాన్ ప్రధాని అయ్యారు. ఆయనే షింజో అబె. తాత పర్యటన జరిగిన 50 ఏళ్లకు ఆయన భారత్‌కు వచ్చారు.. ఇక్కడి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ‘రెండు సముద్రాల సంగమ’ వ్యూహంపై ప్రసంగించారు. అప్పట్లో ఆ ప్రతిపాదన సంచలనమైంది. ఆయన ప్రస్తావించిన అంశమే ‘ఇండో-పసిఫిక్ వ్యూహం’గా రూపాంతరం చెంది చైనాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అదే అమెరికాను భారత్‌కు దగ్గర చేసింది.
అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతగా..
అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేత షింజో అబె. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తికి రాజకీయ స్థిరత్వాన్ని తీసుకొచ్చింది ఆయనే. అబె 2006లోనే ప్రధాని అయినా.. పెద్దపేగు సమస్యతో ఏడాదికే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తర్వాత ఆరేళ్లలో ఆరుగురు ప్రధానులు మారారంటే అక్కడి రాజకీయ అస్థిరతను అర్థం చేసుకోవచ్చు.
అడుగడుగునా సవాళ్లే.. కానీ
దీంతో 2012లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏకధాటిగా ఎనిమిదేళ్లపాటు కొనసాగారు. తాత స్థాపించిన ‘లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ’ నుంచి ఈ పదవి చేపట్టిన అబెకు అడుగడుగునా సవాళ్లే ఎదురయ్యాయి. 2012లో అధికారం చేపట్టే నాటికి జపాన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించింది. కరెన్సీ యెన్ విలువ విపరీతంగా పెరగడంతో.. పారిశ్రామిక రంగంపై ఆధారపడిన జపాన్‌కు ఎగుమతుల్లో లాభాదాయకత తగ్గిపోయింది. ఈ క్రమంలో అబె చేపట్టిన ఆర్థిక విధానాలు జపాన్ వృద్ధిరేటును పట్టాలెక్కించాయి. బ్యాంకింగ్ పరపతి విధానంలో చేసిన మార్పులు ఆర్థిక వ్యవస్థపై ఔషధంలా పనిచేశాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఛైర్మన్‌గా హరుహికో నియామకం ఫలితాన్నిచ్చింది. ఆయన.. వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని భారీగా పెంచారు. షింజో ఆర్థిక విధానాలు జపాన్‌లో ‘అబెనామిక్స్’గా ప్రసిద్ధి చెందాయి.