Giorgia Meloni - Narendra Modi: ఇటలీ ప్రధానితో మోదీ చర్చలు
మార్చి 2వ తేదీ ఢిల్లీకి చేరుకున్న ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీతో వివిధ అంశాలపై ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం మెలోనీతో కలిసి మోదీ మీడియాతో మాట్లాడారు. సంయుక్త భాగస్వామ్యం, సంయుక్త అభివృద్ధి రంగాల్లో భారత్‌లో నూతన అవకాశాలకు దారులు తెరుచుకున్నాయన్నారు. ఈ బంధం ఉభయతారకమని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.
ఏకాభిప్రాయం సాధిద్దాం
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జి–20లో సహకారంపై ప్రభావం చూపనీయరాదని, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయానికి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభంపై దేశాల మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో మార్చి 2న జి–20 దేశాల విదేశాంగ మంత్రులకు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ‘మహాత్మాగాంధీ, గౌతమబుద్ధుడి నేలపై కలుసుకున్న మీరు, భారతదేశ నాగరికత, తాత్వికతల నుంచి ప్రేరణ పొందాలని, మనల్ని విభజించే వాటిపై కాకుండా, మనల్ని ఐక్యంగా ఉంచే అంశాలపై దృష్టి పెట్టాలి’అని సూచించారు. ‘అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాజాతీయ నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత’వంటి అంశాల్లో పరిష్కారం కోసం ప్రపంచం జి–20 వైపు చూస్తోంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించి, ఫలితాలను రాబట్టే సామర్థ్యం జి–20కి ఉంది’అని ఆయన చెప్పారు.