Skip to main content

SCO Summit: ‘షాంఘై సహకార సంఘం’ సదస్సులో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన అక్టోబ‌ర్ 16వ తేదీ జరిగిన షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సభ్యదేశాల కౌన్సిల్‌ ఆఫ్‌ ద హెడ్స్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌(సీహెచ్‌జీ) 32వ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ పాల్గొన్నారు.
EAM Jaishankar flags concerns over terrorism, extremism at SCO  Summit in  Islamabad

జైశంకర్‌ పాకిస్తాన్‌ గడ్డపై పాకిస్తాన్‌ ప్రభుత్వానికి చురకలు అంటించారు. పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. పాక్‌ పట్ల భారత్‌కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేషించాలని సూచించారు. విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చిచెప్పారు. 

ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలు అని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు భారత్‌–పాకిస్తాన్‌ మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. 

ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమతాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం కొనసాగుతాయని స్పష్టంచేశారు. పరస్పరం గౌరవించుకోవడంపైనే పరస్పర సహకారం అధారపడి ఉంటుందన్నారు. పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్సీఓ సభ్యదేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించారు. 

ASEAN-India Summit: 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు

3 భూతాలపై రాజీలేని పోరాటం చేయాలి  
ఎస్సీఓ చార్టర్‌కు సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉండాలని జైశంకర్‌ స్పష్టంచేశారు. చార్టర్‌ పట్ల మన అంకితభావం స్థిరంగా ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు సాధించగలమని అన్నారు. ప్రాంతీయంగా అభివృద్ధి జరగాలంటే శాంతి, స్థిరత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదంపై అందరూ రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను జైశంకర్‌ మరోసారి నొక్కిచెప్పారు. భద్రతా మండలిని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చాలంటే సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిందేనని వెల్లడించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితిపై ఎస్సీఓ ఒత్తిడి పెంచాలని కోరారు.  వచ్చే ఏడాది ఎస్‌సీవో సభ్యదేశాల ప్రభుత్వాధినేతల తదుపరి సదస్సు రష్యాలో జరగనుంది.

RuPay Card: మాల్దీవుల్లో రూపే కార్డు సేవల ప్రారంభం.. మోదీతో ముయిజ్జు ద్వైపాక్షిక భేటీ

Published date : 18 Oct 2024 09:45AM

Photo Stories