Kendra Sahitya Akademi Award: పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు
2021లో ఆయన ప్రచురించిన అభ్యుదయ సాహితీ వ్యాసాల సంపుటి 'దీపిక'కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. మొత్తం 14 రచనలను జ్యూరీ తెలుగు నుంచి సిఫారసు చేసింది. వాటిలో ‘దీపిక’కు అవార్డు దక్కింది.
2025 మార్చి 25న అవార్డుతోపాటు రూ.లక్ష నగదు పురస్కారంతో లక్ష్మీనారాయణను సత్కరించనున్నారు. దేశవ్యాప్తంగా 21 భాషల్లో సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు డిసెంబర్ 18వ తేదీ ప్రకటించింది.
లక్ష్మీనారాయణ జీవితం
లక్ష్మీనారాయణ 1954 అక్టోబర్ 24వ తేదీన పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలంలోని పాత చెరుకుంపాలెం లో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు లింగమ్మ, గోవిందరెడ్డి. గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ, బీఎల్ చదివారు. 1987లో గుంటూరు బార్ అసోసియేషన్లో న్యాయ వాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.
సాహిత్యప్రస్థానం:
1972లో 'సమిధ' అనే కవితా సంకలనం ద్వారా సాహిత్యప్రస్థానం ప్రారంభించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ వివిధ రచనలు, వ్యాసాలు, కవితా సంకలనాలు, సాహిత్య విమర్శలు రచించారు. 2004లో 'అనేక' అనే వ్యాస సంపుటి, 2014లో 'విదిత' అనే వ్యాస సంపుటి ప్రచురించారు. 'విదిత' కు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం కూడా లభించింది.
Jamsetji Tata award: కిరణ్ మజుందార్ షాకు జెంషెడ్‌జీ టాటా అవార్డు
సాహిత్య కృషి:
తన సాహిత్యప్రస్థానంలో 90కు పైగా సాహిత్య పుస్తకాలకు సంకలనకర్తగా, సంపాదకునిగా పనిచేశారు. ఆయన రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. "గుంటూరు సీమ సాహిత్య చరిత్ర" (2020, 2022) అనే గ్రంథం కూడా ఆయన రచన.
ప్రతిష్ఠాత్మక పురస్కారాలు:
పెనుగొండ లక్ష్మీనారాయణ అనేక సాహిత్య పురస్కారాలను అందుకున్నారు, వాటిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, కవిసంధ్య పురస్కారం, సుంకర పురస్కారం, గుత్తికొండ సుబ్బారావు సాహిత్య పురస్కారం తదితరాలు ఉన్నాయి. అజో విభో కందాళం ఫౌండేషన్ నుండి విశిష్ట సాహితీమూర్తి పురస్కారం కూడా ఆయనకు అందింది.
సాహిత్య కార్యాలు:
అతని సాహిత్యకృషి పాఠ్య గ్రంథాల రూపంలో కూడా ప్రసిద్ధి చెందింది. 'కవితా ఓ కవితా' అనే సంకలనం, 'ఈతరం కోసం గేయకవిత', 'ఈతరం కోసం వచన కవిత' వంటి రచనలతో ఆయన సాహిత్యప్రపంచంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు.