Skip to main content

Prime Minister Narendra Modi: నరేంద్రమోదీకి రెండు అత్యున్నత పౌర పురస్కారాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యున్నత గౌరవం లభించింది. పసిఫిక్‌ సముద్ర ద్వీప దేశాలైన పపువా న్యూ గినియా, ఫిజి తమ అత్యున్నత పురస్కారాలను ఆయనకు ప్రదానం చేశాయి.
Prime Minister Narendra Modi

ఆయా దేశాలు మరో దేశ ప్రధానిని ఇలాంటి పురస్కారాలతో గౌరవించడం అరుదైన సంఘటన కావడం విశేషం. మే 22న‌ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పపువా న్యూ గినియా గవర్నర్‌ జనరల్‌ సర్‌ బాబ్‌ డొడాయి ప్రధాని మోదీకి ‘గ్రాండ్‌ కంపానియన్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ లొగోహు(జీసీఎల్‌)’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత్‌లో భారతరత్న తరహాలో పపువా న్యూగినియాలో ఇదే అత్యున్నత పౌర పురస్కారం. పసిఫిక్‌ ద్వీప దేశాల ఐక్యతకు చేసిన కృషికి గాను మోదీకి ఈ పురస్కారం అందించినట్లు పపువా న్యూ గినియా ప్రభుత్వం వెల్లడించింది. జీసీఎల్‌ పురస్కారం పొందిన వారిని ‘చీఫ్‌’ అనే టైటిల్‌తో సంబోధిస్తారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు ఈ అవార్డు లభించింది.   

G7 Summit 2023: రైతులందరికీ డిజిటల్‌ పరిజ్ఞానం.. జీ–7 సదస్సు వేదికగా మోదీ పిలుపు

ఫిజి ప్రధానమంత్రి సితివేణి రాబుకా భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజి’ని ప్రదానం చేశారు. మోదీ గ్లోబల్‌ లీడర్‌షిప్‌నకు గుర్తింపుగా ఫిజి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలియజేసింది. ఇది భారత్‌కు లభించిన అరుదైన గౌరవమని వివరించింది. ఈ గౌరవాన్ని మోదీ భారతదేశ ప్రజలకు, ఫిజి–ఇండియన్‌ సమాజానికి అంకితం చేశారని పేర్కొంది.  

దేశ ప్రజలు సాధించిన విజయాలకు గుర్తింపు  
­‘గ్రాండ్‌ కంపానియన్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ లొగోహు’, ‘కంపానియన్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజి’ గౌరవాలు తనకు దక్కడం పట్ల ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. పపువా న్యూగినియా, ఫిజి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారాలు భారత్‌కు, భారతదేశ ప్రజలు సాధించిన విజయాలకు ఒక గొప్ప గుర్తింపు అంటూ ట్వీట్‌ చేశారు. సౌదీ అరేబియా, అఫ్గానిస్తాన్, పాలస్తీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, రష్యా, మాల్దీవ్స్, బహ్రెయిన్‌ తదితర దేశాలు గతంలో తమ అత్యున్నత పౌర పురస్కారాలతో ప్రధాని మోదీని సత్కరించాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)

Published date : 23 May 2023 07:44PM

Photo Stories