Skip to main content

క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఎన్‌సీసీ (నేషనల్‌ క్యాడెట్‌ కార్‌ప్స్‌) ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది.
NCC
క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ

పాఠశాల స్థాయిలో ప్రారంభమైన ఎన్‌సీసీ శిక్షణ డిగ్రీ వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో వారికి అనేక దశల్లో శిక్షణ ఇస్తారు. ఈ క్రమంలో ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. ఈనెల 1 నుంచి 10వ తేదీ వరకు కొనసాగుతున్నది. శిక్షణలో భాగంగా విద్యార్థులు పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో శిక్షణ 1973లో ప్రారంభం కాగా, ప్రతి ఏడాది విద్యాసంస్థల్లో విద్యార్థులు పెరుగుతున్నారు. శిక్షణ పూర్తయ్యాక క్యాడెట్‌ సీనియార్టీ ఆధారంగా పరీక్ష నిర్వహించి ఏ, బీ, సీ వంటి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఈ సర్టిఫికెట్ల ఆధారంగా అడ్మీషన్లు, ఉద్యోగాలలో ప్రధాన్యత కల్పిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీసీలో చేరేందుకు విద్యార్థులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు.

వివిధ అంశాలపై శిక్షణ..

10 రోజుల పాటు జరిగే క్యాంపులో విద్యార్థులకు పలు అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తారు. ఎన్‌సీసీలో ప్రధానమైన డ్రిల్‌, వెపన్‌ ట్రైనింగ్‌, ఫారెస్ట్‌లో మ్యాప్‌రీడింగ్‌, వివిధ క్రీడలపై శిక్షణ ఉంటుంది. వెపన్‌ ట్రైనింగ్‌లో భాగంగా జైభవాని సాగర్‌ అడవుల్లో క్యాడెట్‌లకు శిక్షణ కొనసాగుతోంది.

ప్రత్యేక రిజర్వేషన్లు..

ఎన్‌సీసీలో శిక్షణ పొంది సీ సర్టిఫికెట్‌ ఉన్న క్యాడెట్లకు ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో 100 సీట్లు రిజర్వు చేసి ఉంటాయి. ఆఫీసర్స్‌ అకాడమీ చైన్నెలో 64 సీట్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో క్యాడెట్లకు పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల్లో నియమించేందుకు అవకాశం ఉంది. ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే పరీక్ష లేకుండానే శారీరక పరీక్ష ద్వారా నేరుగా ఉద్యోగం ఇస్తారు. పోటీ పరీక్షల్లో ఏ సర్టిఫికెట్‌ ఉన్న వారికి 2 మార్కులు, బీ సర్టిఫికెట్‌ ఉన్న వారికి 5 మార్కులు, సీ ఉన్న వారికి 10 మార్కులు అదనంగా ఇస్తారు. దీంతో ఎన్‌సీసీకి డిమాండ్‌ ఏర్పడింది.

విద్యార్థులకు మంచి భవిష్యత్‌..

శిక్షణలో భాగంగా విద్యార్థులకు డ్రిల్‌, ఫైరింగ్‌, తదితర శిక్షణతో పాటు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్యాంపులో 10 రోజుల వసతి కల్పిస్తాం. ఎన్‌సీసీలో చేరిన విద్యార్థులకు అన్ని విధాలుగా మంచి భవిష్యత్‌ ఉంటుంది. ఇందులో ఏ, బీ, సీ సర్టిఫికెట్లు పొందిన వారికి పలు రకాల రిజర్వేషన్లు లభిస్తాయి.– విజయ్‌కుమార్‌, ఎన్‌సీసీ కమాండింగ్‌ ఆఫీసర్‌

చాలా విషయాలు నేర్చుకున్నా..

క్యాంప్‌ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలపై సార్‌ వాళ్లు అవగాహన కల్పించారు. క్యాంప్‌లో డ్రిల్‌, ఫైరింగ్‌ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు స్పోర్ట్స్‌, వ్యక్తిత్వ వికాస తరగతులు, సర్టిఫికెట్‌ ఎగ్జామ్‌పై అవగాహన కల్పించారు. నాకు ఇదో గొప్ప అనుభూతినిచ్చింది.– నిఖిత, ఎన్టీఆర్‌ డిగ్రీ కళాశాల

ఫైరింగ్‌ నేర్చుకున్నా..

ఎన్‌సీసీలో ప్రధానంగా క్యాడెట్‌కు ఓపిక, సహనం నేర్పిస్తుంది. క్రమశిక్షణ, జాతీయతా భావాన్ని పెంపొందిస్తుంది. మొదటి సారిగా నేను వెపన్‌ ట్రైనింగ్‌లో శిక్షణ తీసుకున్నా. 10రోజుల పాటు మరిన్ని అంశాలు నేర్చుకుంటా. సివిల్స్‌ రాయాలనే కళకోసం ఎన్‌సీసీలో చేరాను.– సుగుణ, టీటీడబ్ల్యూఆర్‌డీసీ కళాశాల,

 

600 మంది హాజరు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 విద్యాసంస్థల నుంచి 600 మంది విద్యార్థులు శిక్షణకు హాజరయ్యారు. ఇందులో 8 కళాశాలల నుంచి 250 మంది హాజరుకాగా, మరో 13 పాఠశాలల నుంచి 350 మంది హాజరయ్యారు. 21 విద్యాసంస్థల్లో 3200 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఉండగా వారిలో సీనియార్టీ ప్రకారం ఎంపిక చేసి శిక్షణకు పిలుస్తారు. 10 రోజుల పాటు క్యాడెట్లకు ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో వసతి, శిక్షణ ఏర్పాటు చేశారు.

Published date : 07 Aug 2023 04:08PM

Photo Stories