AP Job mela: రెండు రోజుల్లో 22,217 మందికి ఉద్యోగాలు
- సామాజిక బాధ్యతగా జాబ్‌మేళా నిర్వహించాం: విజయసాయిరెడ్డి
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): వైఎస్సార్‌సీపీ సామాజిక బాధ్యతగా మెగా జాబ్‌మేళాలు నిర్వహిస్తోందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఏయూలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ముగింపు సమావేశంలో ఉద్యోగాలు పొందిన యువతకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంలో జ్ఞానజ్యోతులు వెలిగించే విధంగా సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అక్షరాంధ్రగా నిలిపే సంక్షేమ పథకాలుగా జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన నిలుస్తున్నాయన్నారు. 2 రోజులపాటు నిర్వహించిన జాబ్‌మేళా సరికొత్త రికార్డులను సృష్టించిందన్నారు. తొలి రోజు యువత 13,663 ఉద్యోగాలు పొందగా, రెండో రోజైన ఆదివారం 8,554 మంది ఉద్యోగాలు సాధించగా రెండ్రోజుల్లో మొత్తం 22,217 మంది ఉద్యోగాలు సాధించారన్నారు. శనివారం అత్యధికంగా రూ.10 లక్షలు, రూ.12 లక్షల వార్షిక వేతనాలతో ఉద్యోగాలు సాధించి కొత్త చరిత్రను లిఖించారన్నారు. ఆదివారం పల్సస్ గ్రూప్‌కు చెందిన ఒమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థలో 12.5 లక్షల వేతనంతో ఒకరు, 12 లక్షల వేతనంతో ఇద్దరు ఉద్యోగాలు సాధించడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. జాబ్ మేళాను నిరంతర ప్రక్రియగా వైఎస్సార్‌సీపీ కొనసాగిస్తుందన్నారు.