Skip to main content

యూసీడ్, సీడ్ - 2020

మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఉపయోగించే ప్రతి వస్తువును అందంగా రూపొందించే వృత్తి డిజైనింగ్. ఆసక్తితోపాటు క్రియేటివిటీ ఉంటే చాలు... నేడు డిజైనింగ్ రంగం పిలిచి రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇంతకీ అసలు డిజైనింగ్ అంటే ఏమిటి.. డిజైనింగ్ కెరీర్ ఎలా ఉంటుంది.. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు,ఐఐఎస్సీ అందించే యూజీ, పీజీ స్థాయి డిజైనింగ్ కోర్సులు ఏంటి? ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే యూసీడ్ 2020, సీడ్ 2020కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. సమగ్ర సమాచారం...
డిజైనింగ్ ఎవర్ గ్రీన్ రంగంగా మారుతోంది. నేటి మార్కెటింగ్ పోటీ ప్రపంచంలో.. వినియోగదారుడిని ఆకట్టుకునేలా ప్రొడక్ట్స్‌ను రూపొందించడం కంపెనీల సక్సెస్‌లో చాలా కీలకం. మనం రాసే పెన్ను దగ్గరి నుంచి వేసుకునే ఆభరణాల వరకూ.. ధరించే దుస్తుల నుంచి అంతరీక్షంలోకి ప్రయోగించే రాకెట్ల దాకా.. ప్రతీ వస్తువును చక్కగా రూపొందించే వారే డిజైనర్‌లు. ఇది పూర్తిగా సృజనాత్మకతతో కూడిన వృత్తి. నిరంతరం వస్తువుల రూపకల్పనలో కొత్తదనం చూపించడమే డిజైనింగ్ ప్రత్యేకత. ఊహా శక్తి, సృజనాత్మకత ఉన్న విద్యార్థులకు ఉత్తమ కెరీర్‌గా డిజైనింగ్ నిలుస్తుందంటున్నారు నిపుణులు.

కెరీర్:
ఇంటర్, డిగ్రీ తర్వాత ఏం చేయాలి. కామర్స్, ఆర్ట్స్, సైన్స్ విద్యార్థుల్లో నెలకొనే ప్రశ్నలు ఇవి. చాలామందికి ఉన్నత విద్యను అభ్యసించాలని, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవాలని ఉంటుంది. కానీ వారు ఇంటర్, డిగ్రీలల్లో ఆర్‌‌ట్స, కామర్‌‌స చదవడం వల్ల ఆయా ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశం లభించదని భావిస్తారు. కానీ ఎలాంటి కోర్సు చదివినా.. డిజైనింగ్‌పై ఆసక్తి ఉంటే చాలు ఐఐటీల్లో, ఐఐఎస్సీలో చదివే అవకాశం డిజైనింగ్ కోర్సుల ద్వారా లభిస్తుంది. యూజీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డీఈఎస్).. పీజీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండీఎస్)తోపాటు పీహెచ్‌డీ కోర్సుల్లోనూ చేరే వీలుంది.

యూసీడ్-2020:
యూసీడ్.. అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డిజైన్) కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే యూసీడ్ 2020 ను ఐఐటీ-బాంబే నిర్వహిస్తొంది. ఈ పరీక్షలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులు ఐఐటీ-బాంబే, ఐఐటీ గువాహటి, ఐఐటీ
హైదరాబాద్, ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌లలో నాలుగేళ్ల బీ.డిజైన్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హతలు :
  • ఇంటర్ (10+2)లో ఆర్ట్స్, మ్యాథ్స్, సైన్స్, కామర్స్
  • హ్యుమనిటీస్ అభ్యర్థులు యూసీడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • 2019లో ఇంటర్ (10+2)లో ఉత్తీర్ణులైనవారు.. అలాగే 2020 పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
  • మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, హెచ్‌ఎస్‌సీ వొకేషనల్ ఎగ్జామ్ చేసిన వారు కూడా పరీక్షకు అర్హులు అవుతారు.
  • యూసీడ్‌ను గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రాసేందుకు అనుమతి ఉంటుంది.
  • వచ్చిన స్కోర్ ఒక ఏడాది మాత్రమే పరిగణనలో ఉంటుంది.
వయసు :
జనరల్, ఓబీసీ కేటగిరి వారైతే అక్టోబర్ 1, 1995 తర్వాత జన్మించిన వారై ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అయితే అక్టోబర్ 1, 1990 తర్వాత జన్మించిన వారై ఉండాలి.

పరీక్ష విధానం
  • యూసీడ్ పరీక్ష 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
  • ప్రశ్న పత్రంలో రెండు విభాగాలు పార్ట్ ఏ, పార్ట్ బీ ఉంటాయి.
  • పార్ట్ ఏ 240 మార్కులకు రెండున్నర గంటల పాటు జరుగుతుంది. పార్ట్ ఏ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీడీ) విధానంలో నిర్వహిస్తారు.
  • పార్ట్ ఏ ప్రశ్న పత్రంలో మూడు సెక్షన్‌లు ఉంటాయి.
  • సెక్షన్1లో న్యూమరికల్ ఆన్సర్‌టైప్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున 18 ప్రశ్నలు ఉంటాయి. ఈ సెక్షన్‌లో నెగిటివ్ మార్కింగ్ విధానంలో లేదు. కంప్యూటర్ స్క్రీన్‌పై వర్చువల్ కీ బోర్డు ద్వారా సమాధానం ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • సెక్షన్ 2లో..మల్టిపుల్ సెలక్షన్ టైప్ కొశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 18 ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి పొరపాటు సమాధానికి 0.19 మార్కుల్లో కోత ఉంటుంది. ప్రశ్నల కింద పేర్కొన్న నాలుగు ఆప్షన్లల్లో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు సైతం ఉంటాయి.
  • సెక్షన్ 3లో.. మల్టిపుల్ ఛాయిస్ టైప్ ప్రశ్నలు ఎదురవుతాయి. మొత్తం 32 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.71 మార్కుల కోత విధిస్తారు.
  • పార్ట్ బీ.. 60 మార్కులు 30 నిమిషాల పాటు జరుగుతుంది. పార్ట్ బీలో ఒక ప్రశ్న అడుగుతారు. ఇది అభ్యర్థి డ్రాయింగ్ స్కిల్స్‌ను పరీక్షించేందుకు ఉద్దేశించిన పరీక్ష. పార్ట్ బీలో ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ ప్రశ్నకు ఆన్సర్ బుక్‌లెట్‌లో సమాధానం రాయాల్సి ఉంటుంది.

సీట్ల వివరాలు..
యూసీడ్ ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 144 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో ఐఐటీ బాంబే-37, ఐఐటీ గువాహటి -56, ఐఐటీ హైదరాబాద్ -13, ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌లో ఉన్న 38 సీట్లను యూసీడ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు కామన్ అప్లికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

సీడ్-2020 :
మాస్టర్ ఆఫ్ డిజైన్(ఎండిజైన్), పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాల కోసం సీడ్ పరీక్షను నిర్వహిస్తారు. సీడ్ 2020ను కూడా ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది. అభ్యర్థుల సృజనాత్మకత, ఊహాశక్తి, డ్రాయింగ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను సీడ్ టెస్ట్ ద్వారా పరీక్షిస్తారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు సీడ్ టెస్ట్‌లో స్కోర్‌తోపాటు.. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం కోరుకుంటామో సదరు విద్యా సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూలోనూ సత్తా చాటాల్సి ఉంటుంది.
అర్హతలు:
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (10+2+3) ఉత్తీర్ణులైన వారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసినవారు, అలాగే ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి ఏమిలేదు.
  • సీడ్ పరీక్షను ఎన్నిసార్లు అయినా రాసుకునే వెసులుబాటు ఉంది, పరిమితులు ఏమిలేవు. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ఒక్క సంవత్సరం మాత్రమే సీడ్ 2020 స్కోర్ అమల్లో ఉంటుంది.

పరీక్ష విధానం:
  • సీడ్ పరీక్షను కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఇది మొత్తం రెండు విభాలుగా ఉంటుంది.
  • పార్ట్ ఏ 41 ప్రశ్నలు 100 మార్కులకు అబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం గంట. డిజైన్ అప్టిట్యూకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇది అభ్యర్థిలోని విజువల్, స్పేషియల్ సామర్థ్యాలు, ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ అవేర్‌నెస్, అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్, అబ్జర్వేషన్, డిజైన్ అండ్ సెన్సిటివిటీలను పరీక్షించేవిగా ఉంటాయి.
  • పార్ట్ బీలో 5 ప్రశ్నలు ఎదురవుతాయి. 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. రెండో విభాగానికి సంబంధించి ప్రశ్నలు కంప్యూటర్‌లో డిస్‌ప్లే అవుతాయి. అభ్యర్థులు ఆయా ప్రశ్నలకు సమాధానాలు బుక్‌లెట్‌లో రాయాల్సి ఉంటుంది. పార్ట్ బీలో డ్రాయింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ స్కిల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు.

ఎం.డిజైన్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్న సంస్థలు :
  • ఐఐఎస్సీలో ఎం.డీజైన్ (ప్రొడక్డ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్), పీహెచ్‌డీ డిజైనింగ్.
  • ఐఐటీ బాంబేలో ఎం.డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్షన్ డిజైన్, మొబిలిటీ అండ్ వెహికిల్ డిజైన్), పీహెచ్‌డీ (డిజైన్).
  • ఐఐటీ ఢిల్లీ ఎం.డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్).
  • ఐఐటీ గువాహటిలో ఎం.డిజైన్ (డిజైన్), పీహెచ్‌డీ (డిజైన్).
  • ఐఐటీ హైదరాబాద్‌లో ఎం.డిజైన్ (విజువల్ డిజైన్), పీహెచ్‌డీ డిజైన్.
  • ఐఐఐటీఎం జబల్‌పూర్‌లో ఎం.డిజైన్ (ప్రొడక్ట్ డిజైన్, విజువల్ డిజైన్), -ఐఐటీ కాన్పూర్‌లో ఎం.డిజైన్ , పీహెచ్‌డీ (డిజైన్).

ఇతర సంస్థల్లోను..
సీడ్ పరీక్షల్లో సాధించిన స్కోరుతో ఇతర సంస్థల్లోనూ ప్రవేశం పొందవచ్చు. ఢిల్లీలోని వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్, సృష్టి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ, వీఐటీ యూనివర్సిటీ, డీజే అకాడమీ ఆఫ్ డిజైన్,ఎల్‌పీయూ, యూపీఈఎస్, సీఐటీ లాంటి సంస్థలో అడ్మిషన్ లభించే వీలుంది.

యూసీడీ, సీడ్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 9, 2019.
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 9, 2019.
  • లేట్ ఫీ రూ.500 చెల్లించి నవంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డు: 2020 జనవరి 1 నుంచి 5 తేదీ వరకు
పరీక్ష తేదీ: 2020 జనవరి 18
యూసీడ్ ఫలితాల: 2020 మార్చి 13
సీడ్ ఫలితాల వెల్లడి: 2020 మార్చి 4
యూసీడ్ వెబ్‌సైట్: www.uceed.iitb.ac.in
సీడ్ వెబ్‌సైట్: www.ceed.iitb.ac.in
Published date : 04 Oct 2019 11:54AM

Photo Stories