Skip to main content

విదేశీ భాషలు.. నేర్చుకోవడానికి దరఖాస్తులు

గ్లోబల్ విలేజ్‌గా మారుతున్న ప్రపంచంలో విద్యా, ఉపాధి అవకాశాలు అందుకోవాలంటే.. భాష కీలకంగా మారుతోంది. ముఖ్యంగా ఇంగ్లిష్‌తోపాటు వివిధ విదేశీ భాషలు నేర్చుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉద్యోగాన్వేషణలో లాభిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ భాషలను నేర్చుకోవాలనుకునే వారి కోసం హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ.. 2020-2021 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇఫ్లూ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్, షిల్లాంగ్, లక్నోలోని క్యాంపస్‌ల్లో వివిధ విదేశీ భాషల్లో యూజీ, పీజీ, బీఈడీ, పీజీడీటీఈ, పీజీడీటీఏ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో.. ఇఫ్లూ దరఖాస్తు ప్రక్రియ.. కోర్సుల వివరాలు.. ఎంపిక విధానం తెలుసుకుందాం...

ఇఫ్లూ :
ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ.. ఇఫ్లూ. గతంలో దీన్ని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్(సీఐఎఫ్‌ఎల్)గా పిలిచేవారు. భారతదేశంలో భాషపరమైన ఉన్నత విద్యకు సంబంధించి జాతీయస్థాయిలో యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. 2007లో అధికారికంగా ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)గా పేరు మార్చారు. ఇఫ్లూకు హైదరాబాద్ ప్రధాన క్యాంపస్ కాగా.. షిల్లాంగ్, లక్నోల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా 26 డిపార్ట్‌మెంట్‌లతో వివిధ విదేశీ భాషల్లో యూజీ, పీజీ, టీచర్ ట్రైనింగ్, పీహెచ్‌డీల తోపాటు పలు షార్ట్‌టర్మ్ కోర్సులను అందిస్తోంది.

విదేశీ భాషా కోర్సులివే..
ఇంగ్లిష్‌తో ప్రారంభమైనా... ప్రస్తుతం ఇఫ్లూ అనేక విదేశీ భాషా కోర్సులను అందిస్తోంది. ఇంగ్లిష్‌తోపాటు అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్ వంటి విదేశీ భాషలపై వివిధ కోర్సులను అందిస్తోంది. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సులు మొదలుకొని పీహెచ్‌డీ వరకు వివిధ రకాల కోర్సులను అందిస్తుంది. ఏటా నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష ద్వారా హైదరాబాద్ ప్రధాన క్యాంపస్‌తోపాటు షిల్లాంగ్, లక్నోలోని క్యాంపస్‌ల్లోనూ ప్రవేశాలను కల్పిస్తుంది.

కోర్సులు- సీట్లు- అర్హతలు :
అభ్యర్థుల విద్యార్హతలకు అనుగుణంగా అందిస్తున్న కోర్సులు...
యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) :
బీఏ(ఆనర్స్) ఇంగ్లిష్‌కు సంబంధించి హైదరాబాద్‌లో 40 సీట్లు, లక్నో క్యాంపస్‌లో 40 సీట్లు, షిల్లాంగ్‌లో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బీఏ(ఆనర్స్) అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్‌కు సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌లో 20 చొప్పున సీట్లలో ఇఫ్లూ ప్రవేశం కల్పిస్తోంది; అదేవిధంగా బీఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్(జేఎంసీ) కోర్సుకు సంబంధించి షిల్లాంగ్ క్యాంపస్‌లో 20 సీట్లు ఉన్నాయి.
అర్హత: బీఏ(ఆనర్స్)కు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్ అభ్యర్థులు 45 శాతం సాధించి ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తుకు అర్హులే.

పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) :
ఎంఏ ఇంగ్లిష్ హైదరాబాద్ క్యాంపస్‌లో 90 సీట్లు, లక్నో క్యాంపస్‌లో 40 సీట్లు, షిల్లాంగ్ క్యాంపస్ 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్‌కు సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌లో 20, షిల్లాంగ్ క్యాంపస్‌లో 30 సీట్ల భర్తీ చేపడుతోంది. అలాగే ఎంఏ లిటరేచర్ ఇన్ ఇంగ్లిష్‌కు సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌లో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఏ కాంపరేటివ్ లిటరేచర్‌కు సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌లో 20 సీట్లలో ప్రవేశం కల్పిస్తోంది. ఎంఏ లింగ్విస్టిక్స్‌కు సంబంధించి హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్‌ల్లో 20 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో హైదరాబాద్, షిల్లాంగ్‌ల్లో 20 సీట్ల చొప్పున ప్రవేశం కల్పిస్తున్నారు. ఎంఏ హిందీ, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, అరబిక్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, జర్మన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, హిస్పానిక్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, రష్యన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్‌కు సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌లో 20 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి.
విద్యార్హత: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీలో జనరల్, ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించాలి. అలాగే సంబంధిత భాష లేదా సబ్జెక్టును డిగ్రీ లేదా డిప్లొమా స్థాయిలో చదివి ఉండాలి.

టీచర్ ట్రైనింగ్ కోర్సులు :
బీఈడీ ఇంగ్లిష్ కోర్సుకు సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్(పీజీడీటీఈ)లో హైదరాబాద్ క్యాంపస్‌లో 40సీట్లు, లక్నో క్యాంపస్‌లో 20 సీట్లల్లో ప్రవేశం కల్పిస్తోంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ అరబిక్ (పీజీడీటీఏ)కు సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌లో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బీఈడీ ఇంగ్లిష్: బీఈడీ ఇంగ్లిష్‌కు దరఖాస్తు చేసుకునే జనరల్/ఓబీసీ అభ్యర్థులు బీఏ ఇంగ్లిష్ లేదా ఎంఏ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రస్తుతం ఆయా కోర్సులు చదువుతున్న వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
  • పీజీడీటీఈ: పీజీడీటీఈ దరఖాస్తు చేసుకునే జనరల్/ఓబీసీ అభ్యర్థులు ఎంఏ ఇంగ్లిష్ 55శాతం, ఎస్సీ/ఎస్టీ 50 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
  • పీజీడీటీఏ: పీజీడీటీఏకు దరఖాస్తు చేసుకునే జనరల్/ఓబీసీ అభ్యర్థులు ఎంఏ ఇన్ అరబిక్, అరబిక్ లిటరేచర్, లింగెస్టిక్స్, టీచింగ్ ఆఫ్ అరబిక్‌ల్లో 55శాతం, ఎస్సీ/ఎస్టీలు 50శాతం మార్కులతో పూర్తిచేసి ఉండాలి.
పీహెచ్‌డీ :
పీహెచ్‌డీ ఇన్ లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఇంగ్లిష్ అండ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్, ఇంగ్లిష్ లిటరేచర్, కల్చరల్ స్టడీస్, ఫిల్మ్ స్టడీస్ అండ్ విజువల్ కల్చర్, మీడియా అండ్ కమ్యూనికేషన్, కాంపరేటివ్ లిటరేచర్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, అయిస్థటిక్ అండ్ ఫిలాసఫీ, అరబిక్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, రష్యన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, జర్మన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, స్పానిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్.
విద్యార్హత: పీహెచ్‌డీ దరఖాస్తుచేసుకునే జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు 55శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ (నాన్‌క్రిమిలేయర్), దివ్యాంగులు 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

ఎంపిక విధానం :
యూజీ, పీజీ, టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష నిర్వహిస్తారు. పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఆన్‌లైన్ పరీక్షతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష వంద మార్కులకు జరుగుతుంది. పీహెచ్‌డీకి సంబంధించి 70 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష, 30 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

స్కాలర్‌షిప్ :
  • ఇఫ్లూలో ప్రవేశాలు పొందిన అర్హులైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్స్ అందుకునే అవకాశం ఉంది.
  • కుటుంబ వార్షికాదాయం లక్షా యాబై వేలకు తక్కువగా ఉన్నావారికి మాత్రమే వర్తిస్తుంది.
  • పీహెచ్‌డీ అభ్యర్థులు మినహ మిగిలిన ఏ కోర్సుల్లో దరఖాస్తు చేసుకున్న వారైన స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ ద్వారా ప్రవేశం పొందిన వారికి యూజీసీ నిబంధనల మేరకు ఫెలోషిప్ లభిస్తుంది.
ముఖ్య సమాచారం :
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: ఇఫ్లూ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే జనరల్,ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులు రూ.250 ఫీజుగా చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభతేదీ: 17.12.2019
దరఖాస్తుకు చివరి తేది: 19.01.2020
అడ్మిట్ కార్డ్: ఫిబ్రవరి, 2020
పీజీ ప్రవేశ పరీక్ష తేదీ: 29.02.2020
పీహెచ్‌డీ, బీఈడీ ప్రవేశ పరీక్ష తేదీ: 01.03.2020
యూజీ(బీఏ) ప్రవేశ పరీక్ష తేదీ తేదీ: 12.04.2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.efluniversity.ac.in
Published date : 02 Jan 2020 01:57PM

Photo Stories