Skip to main content

వైద్య విద్యలో లైసెన్సియేట్‌ ఎగ్జామ్‌ తో ఇబ్బందే

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బిల్లు.. దేశంలో వైద్య విద్యలో సమూల మార్పుల దిశగా ఇటీవల కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందిన బిల్లు. ఇప్పుడు ఈ బిల్లుపై మెడికల్‌ విద్యార్థులు, ఈ రంగంలోని నిపుణుల్లో ప్రతికూల అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా లైసెన్సియేట్‌ ఎగ్జామినేషన్, ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజుల పరంగా స్వయం ప్రతిపత్తి తదితర అంశాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లుపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా బిల్లుపై ఐఎంఏ జాతీయ అధ్యక్షులు, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఎథిక్స్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ కె.కె.అగర్వాల్‌ గెస్ట్‌ కాలమ్‌..

ఉద్దేశం నెరవేరుతుందా?
మెడికల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ (ఎంఏసీ), నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ), మరో నాలుగు బోర్డులను ఏర్పాటు చేయాలని.. వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని నిర్ణయించినట్లు బిల్లులో పేర్కొన్నారు. అయితే అందులో సభ్యులందరూ కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్‌ సభ్యులే ఉంటారని చెబుతున్నారు. అంతేకాకుండా నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌లో మెడికల్‌ రంగంలోని నిపుణులే కాకుండా.. మేనేజ్‌మెంట్, లా, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకనామిక్స్‌ తదితర రంగాలకు చెందిన నిపుణులు కూడా ఉంటారని పేర్కొన్నారు. దీనివల్ల అసలు ఉద్దేశం నెరవేరుతుందా? అనే సందేహం తలెత్తుతోంది. అదే విధంగా చైర్‌పర్సన్, సెక్రటరీ వంటి పోస్టులను కూడా నామినేటెడ్‌ విధానంలో భర్తీచేయాలనే ప్రతిపాదన కారణంగా.. పదవీ విరమణ పొందిన బ్యూరోక్రాట్స్‌ తెరవెనక ప్రయత్నాలతో ఈ పోస్టులను దక్కించుకునే అవకాశముంది. ఈ విషయంలో కేవలం మెడికల్‌ రంగానికి చెందిన నిపుణులే అని పేర్కొని ఉంటే బాగుండేది. స్వయం ప్రతిపత్తితో కూడిన బోర్డులు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నప్పటికీ.. బిల్లులోని ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ అటానమస్‌ బోర్డులు వాస్తవానికి ప్రభుత్వ దిశానిర్దేశాల మేరకు నడుచుకోవాల్సిందే. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే పేరుకే స్వయం ప్రతిపత్తి అనే భావన కలుగుతోంది.

పారదర్శకత అనుమానమే..
ప్రస్తుత స్వరూపంలోనే బిల్లును అమల్లోకి తెస్తే.. వైద్య విద్యలో పారదర్శకత అనే మాట వాస్తవ దూరంగానే నిలిచిపోతుందనిపిస్తోంది. ఉదాహరణకు బిల్లులో ప్రతిపాదించిన నేషనల్‌ లైసెన్సియేట్‌ ఎగ్జామినేషన్‌ విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే... చట్టం రూపొందిన మూడేళ్లలోపు లైసెన్సియేట్‌ ఎగ్జామ్‌ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే విదేశాల్లో వైద్యవిద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎలాంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకుండానే శాశ్వత రిజిస్ట్రేషన్‌ పొంది.. మన దేశంలో ప్రాక్టీస్‌ లేదా ఉన్నతవిద్య చేసే అవకాశం కలుగుతుంది. ఇది బ్యాక్‌డోర్‌ ఎంట్రీకి అవకాశం కల్పిస్తుంది. లైసెన్సియేట్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహణ పరంగా కచ్చితంగా కాల పరిమితి విధానం అవలంబించాలి. లేదంటే ఏటా లక్ష మంది వరకు విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసుకుంటున్న భారత విద్యార్థులు... బ్యాక్‌ డోర్‌ ఎంట్రీ విధానంలో వైద్య రంగంలో అడుగుపెట్టే ఆస్కారం ఉంటుంది.

గ్రామీణ విద్యార్థులపై భారం...
మనదేశంలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు కూడా లైసెన్సియేట్‌ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన చాలా ఇబ్బందికర అంశమే. ఇది వారు నేషనల్‌ మెడికల్‌ రిజిస్ట్రీలో తమ పేరు నమోదు చేసుకోవడానికి, లేదా ఉన్నత విద్య అభ్యసించడానికి అడ్డంకి అనేది నా అభిప్రాయం. మొత్తంమీద మన దేశంలో ఎంబీబీఎస్‌ చేసిన విద్యార్థులకు లైసెన్సియేట్‌ ఎగ్జామినేషన్‌ విధానం వల్ల కెరీర్‌ పరంగా హాని చేస్తుంది. లైసెన్సియేట్‌ ఎగ్జామినేషన్‌లో క్లిష్టత ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

‘ఫీజు’ స్వేచ్ఛ సరికాదు..
ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లోని ఫీజుల పరంగా 40 శాతం సీట్లకు సంబంధించిన ఫీజులను ఎన్‌ఎంసీ నిర్ణయిస్తుందనే ప్రతిపాదన కూడా అర్థం కాని విషయంగా మారింది. 40 శాతం సీట్ల సంఖ్యను ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? అదే విధంగా ఫీజులు ఏ మేరకు ఉంటాయో? చెప్పకపోవడం సరికాదు. ఇక 60 శాతం సీట్ల విషయంలో యాజమాన్యాలకు స్వేచ్ఛ ఇవ్వడం కూడా ఆక్షేపణీయం. నిబంధనలు అతిక్రమించిన మెడికల్‌ కళాశాలలపై జరిమానాలు విధిస్తామని బిల్లులో పేర్కొన్నారు. దీనివల్ల కళాశాలల నైతిక ప్రవర్తన మెరుగుపడుతుందని అనుకోవడం కూడా పొరపాటే!

ఇలా అయితేనే నాణ్యత :
వైద్య విద్యలో నాణ్యత ప్రమాణల పెంపు కోసం అడుగులు వేయడం హర్షణీయమే. వైద్య విద్య ప్రమాణాల పెంపు దిశగా.. ముందుగా ప్రస్తుత విధానంలో ఉన్న చట్టాన్ని సవరించాలి. ఎంసీఐ, ఐఎంఏ ఇచ్చిన సలహాలను అమలు చేయాలి. పరీక్ష విధానాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా తీర్చిదిద్దాలి. అప్పుడే వైద్య విద్యలో నాణ్యత అనే లక్ష్యం సాకారమవుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే.. పార్లమెంటుæ స్థాయీ సంఘం మా వాదనలు కూడా వినాలని, బిల్లులోని ప్రతి అంశంపై మా అభిప్రాయాలు తీసుకోవాలని కోరుతున్నాం.

విద్యార్థులకు ఇచ్చే సలహా..
వైద్య విద్య ఔత్సాహికులు, విద్యార్థులకు ఇచ్చే సలహా.. విధానాల్లో మార్పులు వచ్చినా మీలో వృత్తిపై నిబద్ధతలో మార్పు రాకూడదు. నిరంతరం వృత్తి పట్ల అంకిత భావం, కెరీర్‌ పరంగా పారదర్శకంగా వ్యవహరించాలి. అంతేకాకుండా వైద్యవృత్తికి ఉన్న ఘనతను కాపాడేలా వృత్తిని కొనసాగించాలి. అప్పుడే విధానాల పరంగా మార్పులు జరిగినా వ్యక్తిగతంగా గుర్తింపు, కెరీర్‌ పరంగా ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు!

‘‘మనదేశంలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు కూడా లైసెన్సియేట్‌ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన చాలా ఇబ్బందికర అంశమే. ఇది వారు నేషనల్‌ మెడికల్‌ రిజిస్ట్రీలో తమ పేరు నమోదు చేసుకోవడానికి, లేదా ఉన్నత విద్య అభ్యసించడానికి అడ్డంకి అనేది నా అభిప్రాయం’’ .
– డాక్టర్‌ కె.కె. అగర్వాల్, నేషనల్‌ ప్రెసిడెంట్, ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌

Published date : 09 Jan 2018 09:14PM

Photo Stories