Skip to main content

వాకిన్స్.. నయా ట్రెండ్

భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలు వాకిన్స్ జపం చేస్తున్నాయా! తాజా ట్రెండ్స్‌ను చూస్తుంటే అవుననిపిస్తోంది! ఇప్పటివరకు ఐటీ కంపెనీలు బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (బీపీవో) విభాగంలోని నియామకాలకు వాకిన్ డ్రైవ్‌లు; సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొలువుల భర్తీకి క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లకు ప్రాధాన్యమిచ్చేవి! కానీ, ఇప్పుడు ఈ విధానంలో మార్పు కనిపిస్తోంది. బీపీవో ఉద్యోగాలే కాదు.. టెక్నికల్ పోస్టుల్లో నియామకాలను సైతం వాకిన్స్ ద్వారానేచేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీల్లోవాకిన్ ట్రెండ్స్; వాకిన్స్‌లో విజయానికి మార్గాల గురించి తెలుసుకుందాం...
టెక్నాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన మానవవనరుల కోసం ఐటీ కంపెనీలు ఇటీవల కాలంలో వాకిన్స్ విధానంపై మొగ్గుచూపుతున్నాయి. ముఖ్యంగా కోర్ టెక్నాలజీ నిపుణుల నియామకాలకు సంబంధించి వాకిన్స్ ట్రెండ్ విస్తృతమవుతోంది. కోర్ స్కిల్స్ ఉన్న నిపుణులకోసం కంపెనీల మధ్య రోజురోజుకీ పోటీ తీవ్రమవుతోంది. కొత్త ప్రాజెక్టులను నిర్దిష్ట సమయంలో పూర్తిచేయాల్సి వచ్చినప్పుడు నిపుణుల అవసరం ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో అనుభవజ్ఞులను వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడుతుంటాయి. మరోవైపు ఐటీ కంపెనీల్లో నైపుణ్యాలున్న ఉద్యోగులు కొంత అనుభవంరాగానే మంచి పేప్యాకేజీతో ఆఫర్ వస్తే... కంపెనీలు మారడం సర్వసాధారణంగా మారింది. తాజా అంచనాల ప్రకారం ఐటీ కంపెనీల్లో ఉద్యోగం మారే రేటు 20 శాతంవరకు ఉంది. ఇలా అట్రిషన్ రేటు పెరుగుతుండటంతో సాఫ్ట్‌వేర్ సంస్థలు టెక్నాలజీ పోస్టులకు కూడా వాకిన్స్ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలోఇలాంటి ట్రెండ్ పెరుగుతుండటం విశేషం.

స్పెషలిస్టులకు ప్రాధాన్యం
  • వాకిన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు కూడాక్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలాగే వివిధ రౌండ్‌లలో పరీక్షించాకే ఆఫర్ లెటర్ ఇస్తున్నారు.
  • ఒకప్పుడు స్పెషలిస్టుల కంటే జనరలిస్ట్‌లకు ప్రాధాన్యం ఎక్కువ ఉండేది. కానీ, ఇప్పుడు ఎక్కువ శాతం కంపెనీలు స్పెషలిస్ట్‌లను నియమించుకునేందుకు ఆసక్తిచూపుతున్నాయి.
  • క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కంపెనీలకు స్పెషలిస్ట్‌లు లభించే అవకాశం తక్కువ. అదే విధంగా షెడ్యూల్డ్ ఇంటర్వ్యూల్లోనూ స్పెషలిస్టుల నియామకాలకు పెద్దగా అవకాశం ఉండటంలేదు. దాంతో కంపెనీలు నిపుణులకోసం వాకిన్స్‌పై దృష్టిసారిస్తున్నాయి.

ఐటీ కంపెనీల్లో వాకిన్ సరళి
  • హెచ్‌సీఎల్: ఇది కొద్ది వారాల క్రితం నోయిడా, లక్నోల్లోవాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించి 2,000 మందికి ఉద్యోగాలు అందించింది. వీటికి 5,600 మంది హాజరుకాగా120 మంది తాజా బీటెక్ గ్రాడ్యుయేట్లకు, 600 మందినాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు, 300మంది అనుభవమున్న ఐటీ నిపుణులకు కొలువులు అందించింది. హెచ్‌సీఎల్ ఆగస్టులో నోయిడాలో నిర్వహించిన మరో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 700 మంది ఎంపికకాగా,అందులో 520 మంది ఫ్రెషర్స్ కావడం గమనార్హం. హెచ్‌సీఎల్ నాగ్‌పూర్, లక్నో, నోయిడాల్లో నిర్వహించిన వాకిన్స్‌కి గ్రాడ్యుయేట్లు; అండర్ గ్రాడ్యుయేట్లు, ఇంటర్ విద్యార్థులను సైతం ఆహ్వానించింది.
  • క్యాప్‌జెమిని: ఈ ఏడాది క్యాప్‌జెమిని త్రివేండ్రం, గురుగావ్, కోల్‌కతా, గాంధీనగర్, బెంగళూరు, చెన్నై,హైదరాబాద్, నోయిడా, పుణె నగరాల్లో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీంతోపాటు జోధ్‌పూర్‌లో సైతం ఆగస్టు 24-25 తేదీల్లో మెగాక్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం విశేషం.
  • టీసీఎస్: టీసీఎస్ కొన్ని నెలల కిందట దేశవ్యాప్తంగా వివిధనగరాల్లో సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ కోసం వాకిన్స్ నిర్వహించింది. గతేడాది కూడా అనుభవమున్న నిపుణుల కోసం వాకిన్స్ జరిపింది. గత నాలుగునెలల కాలంలో టీసీఎస్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇంజనీర్స్, అనలిస్ట్‌లకు; టెక్నికల్ డెస్క్‌కి సంబంధించి ఫ్రెషర్స్ కోసం వాకిన్ ఇంటర్వ్యూ డ్రైవ్‌లు చేపట్టింది. టీసీఎస్‌గత రెండేళ్లుగా సగటున ఏటా నాలుగువేల మందికి ఆఫ్ క్యాంపస్ విధానంలోనియామకాలు జరుపుతోంది.
  • ఇన్ఫోసిస్: అనుభవజ్ఞులైన యూజర్ ఇంటర్ ఫేస్ (యూఐ) డెవలపర్ల కోసం ఇన్ఫోసిస్ ఇటీవల ప్రత్యేక వాకిన్ డ్రైవ్ నిర్వహించింది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఐటీ రంగంలో వాకిన్స్ ద్వారా 20 శాతం నియామకాలు జరుగుతున్నాయి.

వాకిన్‌లో విజయానికి..
అభ్యర్థులు.. ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి నిర్దిష్టసమయం కంటే ముందే చేరుకునేందుకు ప్రయత్నించాలి. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలకు అవకాశముంది? వాటికి సమాధానం ఎలా చెప్పాలి? అనేదానిపై ముందే కసరత్తు చేయాలి. ఉదాహరణకు మీ గురించి చెప్పండి? అని ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు.. మీ బయోడేటా మొత్తం చెప్పడం కాకుండా... మీరు కంపెనీకి ఎలా ఉపయోగపడతారో సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నంచేయాలి. వాకిన్ ఇంటర్వ్యూల్లో సాధారణంగా మీ బలాలు, బలహీనతలు చెప్పండి; మా కంపెనీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు? ప్రస్తుత ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు; మీకే ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి.. వంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొనేందుకుముందే సన్నద్ధమవాలి.

కొత్త పంథాలో..
  • ఐటీ కంపెనీలు కొంతకాలంగా నియామకాలకు సంబంధించి కొత్త పంథాను అనుసరిస్తున్నాయి.దాని ఫలితమే ప్రస్తుత వాకిన్ ట్రెండ్! పలుకంపెనీలు వాకిన్‌లను విభిన్నంగా నిర్వహిస్తున్నాయి. నేరుగా వాకిన్‌లకు ఆహ్వానించకుండా.. కొన్నిటాస్క్‌లు, చిన్నచిన్న టెస్టులు నిర్వహించి... వాటిలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తున్నాయి. వాకిన్స్‌కు సంబంధించి దీన్ని ప్రధానమార్పుగా చెప్పొచ్చు.
  • ప్రస్తుతం మార్కెట్లో పోటీ తీవ్రమైంది. దీంతో ప్రాజెక్టును అనుకున్న సమయంలో పూర్తిచేయక తప్పనిపరిస్థితి. ఫలితంగా మానవ వనరుల కోసం ఎక్కువ సమయం వేచిచూసే పరిస్థితి ఉండట్లేదు. వాకిన్‌లుపెరగడానికి దీన్నొక ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
  • క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా నియమించుకున్న వారికిశిక్షణ అవసరమవుతోంది. అదే సమయంలోవాకిన్స్ విధానంలో కొంత అనుభవం, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరికే అవకాశం ఉండటంతో కంపెనీలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి.
  • వాకిన్స్‌లో ఇంటర్వ్యూయర్ తక్కువసమయంలో ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేయాలని చూస్తుంటారు. ఆ సమయంలో ఇంటర్వ్యూయర్ అభ్యర్థుల నుంచి కొన్ని ‘కీ’వర్డ్స్‌ని ఆశిస్తుంటారు. వాటిని చెప్పగలిగితే కొలువుఖాయమైనట్లే!
- జి.ఆర్.రెడ్డి, సీఈవో, హుసీస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్.
Published date : 11 Sep 2018 05:18PM

Photo Stories