Skip to main content

ఉద్యోగమే లక్ష్యంగా...నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు

ట్రెడిషనల్ అయినా.. టెక్నికల్ అయినా.. ఏ డొమైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినా.. అధికశాతం మంది విద్యార్థుల్లో జాబ్ రెడీ స్కిల్స్ ఉండట్లేదు. వాస్తవానికి దేశంలో డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వారెందరో!! ఇలాంటి పరిస్థితిలో డిగ్రీ విద్యార్థులను జాబ్ మార్కెట్ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాభివృద్ధిలో తీర్చిదిద్ది.. ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సుతోపాటు కొత్తగా బీఎస్సీ ఇంజనీరింగ్ కోర్సును సైతం ప్రారంభించాలని ఆలోచిస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. సంబంధిత ప్రతిపాదనలను యూజీసీ ఆమోదం కోసం పంపింది. ఈ నేపథ్యంలో.. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ తీరుతెన్నులు, బీఎస్సీ ఇంజనీరింగ్ కోర్సుతో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...
2020-21 నుంచే అమలు :
బీఎస్సీ ఇంజనీరింగ్, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులను 2020-21 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తేవాలని ఏపీ ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఆమేరకు ఇప్పటికే యూజీసీకి ప్రతిపాదనలు కూడా పంపారు. ప్రస్తుతం ఇండస్ట్రీ అవసరాలు, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఆవశ్యకత.. ఎన్‌ఈపీ, యూజీసీ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటే.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు యూజీసీ ఆమోదం లభించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యూజీసీ కమిటీ సిఫార్సుల్లో సైతం :
గతేడాది ‘‘ప్రమోటింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్/కాలేజెస్’ పేరుతో యూజీసీ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందుకోసం ఐఐఎస్‌సీ-బెంగళూరు మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ పి.బలరామ్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికలో దేశంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కల్పించాలని ప్రతిపాదించింది. బీటెక్ విద్యార్థులకు ఐఐటీలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కల్పిస్తున్న విధానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.

విభిన్న నైపుణ్యాలు :
గతేడాది ఎంహెచ్‌ఆర్‌డీ విడుదల చేసిన నూతన విద్యా విధానం ముసాయిదాలో సైతం కస్తూరి రంగన్ కమిటీ నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్‌లు ప్రవేశ పెట్టడం మేలని పేర్కొంది. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్‌లలో విద్యార్థులకు విభిన్న నైపుణ్యాలు లభించేలా కరిక్యులంను రూపొందించాలని సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాధించిన నాలుగేళ్ల డిగ్రీ విధానానికి యూజీసీ నుంచి ఆమోదం లభిస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం ఆనర్స్ డిగ్రీ :
ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఆనర్స్ డిగ్రీ కోర్సుల వ్యవధి మూడేళ్లు. వీటిల్లో చేరిన విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న మేజర్ సబ్జెక్టు పైనే ఎక్కువగా దృష్టిపెట్టేలా కరిక్యులం ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులతో పోలిస్తే ఆనర్స్ డిగ్రీ విద్యార్థులు సబ్జెక్ట్ నైపుణ్యాల పరంగా కొంత ముందంజలో ఉంటున్నారు. కాని ఈ కోర్సులు థియరీ ఆధారితంగా ఉండటంతో విద్యార్థుల్లో ప్రాక్టికల్ అప్రోచ్ తక్కువగా ఉంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన.. ఇంటర్న్‌షిప్ సమ్మిళిత నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీతో విద్యార్థుల్లో థియరీతోపాటు, ప్రాక్టికల్ నాలెడ్జ్ సైతం సొంతమవుతుంది.

ప్రాక్టికల్ నైపుణ్యాలు :
నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో.. విద్యార్థులు ముందుగా మూడేళ్లు తాము ఎంచుకున్న గ్రూప్ సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏడాదిపాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించే ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. ఫలితంగా విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతమవుతాయి. నాలుగేళ్ల కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఆనర్స్ డిగ్రీ సర్టిఫికెట్లు అందిస్తారు. ఫలితంగా జాబ్ మార్కెట్‌లో వీరికి ప్రాధాన్యం లభించడం ఖాయం. ఇంతకాలం బీఏ, బీఎస్సీ కోర్సులు పూర్తి చేసుకుంటున్న అధిక శాతం మంది.. బీపీఓ, కాల్ సెంటర్స్ ఉద్యోగాలకే పరిమితమవుతున్న సంగతి తెలిసిందే.

మూడేళ్ల బీఎస్సీ ఇంజనీరింగ్ :
ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన మరో కోర్సు.. బీఎస్సీ ఇంజనీరింగ్. ఇప్పటి వరకు బీఎస్సీ అంటే.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా లైఫ్‌సెన్సైస్ కాంబినేషన్లే. ఇటీవల కాలంలో బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ ప్రభుత్వం బీఎస్సీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఫలితంగా సదరు కోర్సులో చేరిన విద్యార్థి ఆయా ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల్లో నిష్ణాతుడయ్యేలా తీర్చిదిద్దుతారు. మూడేళ్ల బీఎస్సీ ఇంజనీరింగ్‌తోనే నాలుగేళ్ల బీటెక్ విద్యార్థులతో పోటీ పడేలా కరిక్యులం ఉంటుంది. మూడేళ్ల బీఎస్సీ ఇంజనీరింగ్ తర్వాత ఏడాది పాటు సంబంధిత డొమైన్‌లో బ్రిడ్జ్ కోర్సును నిర్వహించాలని.. తద్వారా సదరు కోర్సుకు ఏఐసీటీఈ గుర్తింపు లభించేలా చూడాలని భావిస్తున్నారు.

విదేశీ విద్యకు ఊతం :
ప్రస్తుతం విదేశీ విద్య ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యంగా మారింది. విదేశీ యూనివర్సిటీలు ప్రవేశ ప్రక్రియలో అనుసరిస్తున్న 10+2+4 విధానం వల్ల బీటెక్, ఎంటెక్ కోర్సుల విద్యార్థులకే ప్రయోజనం చేకూరుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులను సైతం నాలుగేళ్ల వ్యవధికి పెంచడం.. ఆనర్స్ డిగ్రీ సర్టిఫికెట్ అందజేయడం ద్వారా డిగ్రీ విద్యార్థులు కూడా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు మార్గం సుగమం అవుతుంది.

నాలుగేళ్ల డిగ్రీ... ముఖ్యాంశాలు
 నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లలో మరింత నిష్ణాతులుగా మారొచ్చు. ఆ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
   -ప్రొఫెసర్ ఎం.జగదీశ్ కుమార్, వైస్ ఛాన్స్‌లర్, జేఎన్‌యూ
 
 ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం :
 విద్యార్థుల్లో కొంతమందికి థియరీ బేస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. మరికొందరిలో ప్రాక్టికల్ అప్రోచ్ ఎక్కువ. ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్న విద్యార్థులకు బీఎస్సీ ఇంజనీరింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కోర్సు కరిక్యులం నైపుణ్యాభివృద్ధికి, ప్రాక్టికల్ అవగాహనకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఉంటుంది. ఫలితంగా కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత జాబ్ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యార్థులు అధిక శాతం మంది బీటెక్ వైపు అడుగులు వేస్తున్నారు. బీఎస్సీ ఇంజనీరింగ్ తర్వాత ఏడాది వ్యవధిలో సంబంధిత సాంకేతిక సబ్జెక్ట్‌లలో పూర్తి నైపుణ్యం కల్పించే బ్రిడ్జ్ కోర్సులను ప్రవేశపెట్టాలనే ఆలోచన ఉంది. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సుతో సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల విద్యార్థులు కూడా ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ సొంతం చేసుకొని ఉద్యోగ సాధనలో ముందంజలో నిలుస్తారు. ఈ రెండు కోర్సులకు సంబంధించిన ప్రతిపాదనలను యూజీసీ అనుమతి కోసం పంపించాం. మరో రెండు వారాల్లో స్పష్టత లభిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచే వీటిని అమలు చేసే విధంగా కృషి చేస్తున్నాం.
 - ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి
Published date : 24 Jan 2020 04:52PM

Photo Stories