Skip to main content

సైన్స్ పరిశోధనలకు సరైన దారి..!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్‌లు) సైన్సు విద్య, పరిశోధనల్లో జాతీయ ప్రాధాన్య విద్యా సంస్థలుగా వెలుగొందుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు ఐసర్‌లు ఉన్నాయి. వీటిలో ప్రవేశం పొందితే సైన్సు పరిశోధన, బోధన-ఇతర అనుబంధ రంగాల్లో ఉజ్వల కెరీర్ సొంతమైనట్లే! ఈ నేపథ్యంలో ఐసర్ ప్రత్యేకతలు, అందిస్తున్న కోర్సులు, ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్టు, సిలబస్, కెరీర్ అవకాశాలపై సమగ్ర కథనం...
ఐసర్ బీఎస్, బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్, 2019 నుంచి ప్రారంభం కానుంది. ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఐఏటీ) జూన్‌లో జరగనుంది.

బీఎస్-ఎంఎస్ (డ్యూయల్ డిగ్రీ) :
  • ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన ప్రతిభావంతుల కోసం బీఎస్-ఎంఎస్ కోర్సును ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో బయలాజికల్ సెన్సైస్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు వ్యవధి ఐదేళ్లు. అభ్యర్థులు కోర్సులో భాగంగా తరగతి అభ్యసన, పరిశోధనలతోపాటు బహుముఖ విభాగాలతో అనుసంధానం అవుతారు.
  • బీఎస్-ఎంఎస్ కోర్సు ప్రధానంగా సైన్సు, అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్, ఎంఎస్ రీసెర్చ్ ప్రాజెక్టుల సమాహారంగా ఉంటుంది. ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులకు లభించే శిక్షణ ఫలితంగా బోధన, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, పరిశ్రమ విభాగాల్లో కొలువులకు అవసరమైన నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని అందిస్తుంది. సైన్సు విభాగంలో ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులు ప్రవేశానికి అర్హులు.
బీఎస్ డిగ్రీ :
ఐసర్ భోపాల్.. ఎకనామిక్స్, ఇంజనీరింగ్ సెన్సైస్‌లో బీఎస్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ లేదా తత్సమాన స్థాయిల్లో మ్యాథ్స్‌ను తప్పనిసరిగా చదివుండాలి. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 60 సీట్లు, ఎకనామిక్స్ స్ట్రీమ్‌లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశాలు :
ఐసర్‌లో కింది విధానాల్లో ప్రవేశాలు పొందొచ్చు. అవి..
  1. కేవీపీవై.. ఈ విధానంలో విద్యార్థులు నేరుగా ఐసర్‌లో ప్రవేశం పొందొచ్చు. 2019-20 విద్యాసంవత్సరానికిగాను కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) ఫెలోషిప్ కలిగున్న విద్యార్థులు ప్రవేశానికి అర్హులు. దీంతోపాటు అదనపు కటాఫ్ ప్రక్రియ ఉంటుంది.
  2. జేఈఈ.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2019 కామన్ ర్యాంకు లిస్టులో 10,000లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. దీంతోపాటు అదనపు కటాఫ్ ప్రక్రియ ఉంటుంది.
  3. ఎస్‌సీబీ.. ఈ విధానంలో ప్రవేశాలు పొందాలనుకునేవారు తప్పనిసరిగా ఐసర్ ఆప్టిట్యూట్ టెస్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. సైన్స్ విభాగంతో 2018, 2019 సంవత్సరాల్లో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు (ఆయా బోర్డులు నిర్దేశించిన కటాఫ్ పర్సంటేజ్ ఉండాలి) ఐఏటీ దరఖాస్తుకు లేదా ఐసర్‌లో ప్రవేశానికి అర్హులు. 2019 సంవత్సరానికి ఆయా బోర్డుల కటాఫ్ పర్సంటేజ్‌లను మార్చిలో ప్రకటిస్తారు.
పరీక్ష విధానం :
ప్రశ్నపత్రం 60 ప్రశ్నలతో మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుంచి 15 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు.

ఐసర్‌ల ప్రత్యేకతలు..
  • సైన్సుపై పట్టు సాధించేలా నిత్యం విద్యార్థులను ప్రోత్సహించే ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటుంది.
  • గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి అన్ని విభాగాల్లో అత్యున్నత స్థాయి బోధన అవకాశాలు.
  • అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్‌లు.
  • బుక్ కలెక్షన్, రీసెర్చ్ జర్నల్స్‌తోపాటు ఆన్‌లైన్ సౌకర్యాలు కలిగిన లైబ్రరీ.
  • అత్యుత్తమ పరిశోధన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
  • స్పోర్ట్స్, రిక్రియేషన్ సౌకర్యాలు లభిస్తాయి.
  • విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉంటుంది.
సిలబస్ :
ఐసర్ ఆప్టిట్యూడ్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎన్‌సీఈఆర్‌టీ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పుస్తకాలు చదవాలి.

స్కాలర్‌షిప్‌లు :
ఐసర్‌లో ప్రవేశాలు పొందిన కేవీపీవై స్కాలర్లకు నిబంధనల మేరకు ఫెలోషిప్ లభిస్తుంది. దీంతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్, ఎస్‌సీబీ విధానం ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పరిమిత సంఖ్యలో ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్‌లు అందుతాయి!!

కీలక దశలు..
10+2 బోర్డు కటాఫ్ మార్కుల ప్రకటన: మార్చి, 2019.
ఐఏటీ ప్రాక్టీస్/మాక్ టెస్టు: ఏప్రిల్, 2019.
అడ్మిషన్ పోర్టల్ ప్రారంభం: ఏప్రిల్, 2019.
ఐఏటీ పరీక్ష 2019: జూన్, 2019.
ఫలితాలు/కౌన్సెలింగ్/అడ్మిషన్స్: జూన్-జూలై, 2019.
అకడమిక్ సెషన్ ప్రారంభం: ఆగస్టు, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.iiseradmission.in
Published date : 13 Feb 2019 02:03PM

Photo Stories