Skip to main content

రీ-స్కిల్లింగ్ బాటలో..

రీ-స్కిల్లింగ్.. అంటే కొత్త సాంకేతికతలకు అనుగుణంగా ఉద్యోగులకు నూతన నైపుణ్యాలపై శిక్షణ అందించడం! ఐటీ రంగంలో శరవేగంగా విస్తరిస్తున్న సరికొత్త టెక్నాలజీ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ!! సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇప్పటికే పనిచేస్తున్న తమ ఉద్యోగులకు ఈ టెక్నాలజీలకు సంబంధించిన స్కిల్స్ అందించే ప్రయత్నాలు ప్రారంభించాయి. కొత్త టెక్నాలజీల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకునే కంటే.. ఇప్పటికే పనిచేస్తున్న వారికి శిక్షణనివ్వడం మేలని సంస్థలు భావిస్తున్నాయి. కంపెనీలు రీస్కిల్లింగ్‌కు ఉపక్రమించడానికి కారణాలతోపాటు రీస్కిల్లింగ్‌తో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
మూడు నుంచి 15 ఏళ్ల అనుభవం
ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్ శిక్షణ పరంగా మూడు నుంచి 15 ఏళ్ల అనుభవం గడించిన సిబ్బందిని సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఏఐ, రోబోటిక్స్, క్లౌడ్ టెక్నాలజీస్‌కు సంబంధించిన నైపుణ్యాలను మొదట అందించాలని కంపెనీలు భావిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రీస్కిల్లింగ్ వల్ల క్లయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో దాదాపు 70 శాతం ఐటీ కంపెనీలు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. క్లయింట్లకు అందిస్తున్న సర్వీసులకు అనుగుణంగా 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలో ఈ శిక్షణనిస్తున్నాయి.

జస్ట్ ఇన్ టైమ్
ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్ నేపథ్యంలో సంస్థలు అంతర్గతంగా సొంతంగా లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఎల్ అండ్ డీ) సెంటర్లను నెలకొల్పుతున్నాయి. వీటిద్వారా ఆయా విభాగాల్లోని నిపుణుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు శిక్షణనిప్పిస్తున్నాయి. రీ-స్కిల్లింగ్ విధానాల్లో ఐటీ సంస్థలు అనుసరిస్తున్న మరో సరికొత్త విధానం.. జస్ట్ ఇన్ టైమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. క్లయింట్ల నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి అప్పటికప్పుడు వాటికి సంబంధించి ఉద్యోగులకు శిక్షణ ఇప్పించడమే జస్ట్ ఇన్ టైమ్. ఇది ప్రధానంగా క్లౌడ్ టెక్నాలజీస్ విభాగంలో కనిపిస్తోంది. ఇందుకోసం సంస్థలు తమ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లను మార్గంగా ఎంచుకుంటున్నాయి.

మూక్స్ మార్గంగా
ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్ కోసం ఐటీ సంస్థలు ఎంచుకుంటున్న మరో మార్గం.. మూక్స్ (మాసివ్‌లీ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్). ఆన్‌లైన్ విధానంలో ప్రముఖ యూనివర్సిటీల అధ్యాపకులు, ఆయా రంగాల్లోని నిపుణుల ద్వారా బోధన, శిక్షణ పొందడమే మూక్స్! భారత ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను.. వారు పనిచేసే విభాగాల వారీగా సంబంధిత మూక్స్‌లో పేరు నమోదు చేసుకుని శిక్షణ తీసుకోవాలని సూచిస్తున్నాయి. కోర్స్‌ఎరా, ఎడెక్స్, ఉడాసిటీ, నాస్కామ్ ఫ్యూచర్‌స్కిల్స్ ఇనిషియేటివ్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనికి ఉద్యోగుల నుంచి కూడా సానుకూల స్పందన కనిపిస్తోంది. గతేడాది కాలంలో ఇలా.. టీసీఎస్ సంస్థ దాదాపు 80 వేల మందికి, కాగ్నిజెంట్ సంస్థ లక్ష మందికి, విప్రో సంస్థ దాదాపు 90 వేల మందికి, ఇన్ఫోసిస్ సంస్థ దాదాపు 60 వేల మందికి శిక్షణనిప్పించింది.

ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్
ఉద్యోగులకు నూతన టెక్నాలజీలపై శిక్షణనిప్పిస్తున్న సంస్థలు.. ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ విధానాన్ని సైతం అనుసరిస్తున్నాయి. అంటే.. శిక్షణనిచ్చే వారికే శిక్షణ ఇవ్వడం. ట్రైనింగ్ ఇచ్చే వాళ్లకి నైపుణ్యం ఉంటేనే ఇతరులకు శిక్షణనివ్వగలుగుతారు అనే ఆలోచనే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. సంస్థలో ఆయా విభాగాల్లో మెరుగైన పనితీరు చూపిన ఉద్యోగులను కొద్దికాలం పాటు నూతన టెక్నాలజీల్లో నైపుణ్యం పొందేలా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో శిక్షణ కోసం పంపిస్తున్నాయి. ఇందుకోసం విదేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లకు పంపడానికి సైతం వెనుకాడటం లేదు. ఒక్కో సంస్థ సగటున పది మంది ఉద్యోగులను ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ ప్రోగ్రామ్‌కు పంపిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం అయ్యే ఖర్చును సైతం కంపెనీలే భరిస్తున్నాయి.

ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ
సంస్థలు ఖర్చు తగ్గించుకునేందుకు రీ-స్కిల్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే... వారికి కూడా కొత్త టెక్నాలజీపై శిక్షణ ఇవ్వక తప్పదు. అంటే నియామకు ప్రక్రియకు అయ్యే ఖర్చుతోపాటు వారికి శిక్షణకు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా అప్పటికే సంస్థ కార్యకలాపాలు, టార్గెట్ క్లయింట్స్, సర్వీసెస్‌పై అవగాహన పొందిన ఉద్యోగులకు స్వల్ప వ్యవధిలో శిక్షణనిప్పిస్తే వారు త్వరగా నైపుణ్యాలను అందిపుచ్చుకోగలరని సంస్థలు భావిస్తున్నాయి. దీనివల్ల సంస్థలకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. మరోవైపు ఆదాయంలో పెరుగుదలకు ఆస్కారం ఎక్కువ. గతేడాది ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థల ఆదాయంలో 1.9 శాతం నుంచి 5 శాతం పెరుగుదల నమోదవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.

కొత్త నియామకాలు?
కొత్త నియామకాల పరంగా గతేడాదితో పోల్చితే కొంత తక్కువగా నమోదుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్రెష్ రిక్రూటీస్‌కు కూడా సంస్థలు కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేశాక పూర్తిస్థాయిలో విధులు కేటాయించడానికి ముందే లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా కొత్త ఉద్యోగులకు శిక్షణనిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు.. ఒకవైపు విధులు కేటాయిస్తూనే.. పనివేళల తర్వాత ట్రైనింగ్ ఇస్తున్నాయి. ప్రధానంగా క్లౌడ్, కోడింగ్, బ్లాక్‌చైన్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, 3-డి డిజైన్ విభాగాల్లో నైపుణ్యాలు అందిస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా నియామకాలు జరుపుతున్న మరికొన్ని సంస్థలు.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందం చేసుకొని ముందే తమ సంస్థ అవసరాలకు సరితూగే విధంగా విద్యార్థులకు శిక్షణనిచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి.

ఔట్ సోర్సింగ్ విధానం
రీ-స్కిల్లింగ్ కోసం పెద్ద సంస్థలు సొంత విధానాలను అనుసరిస్తుంటే.. మధ్య, చిన్న తరహా కంపెనీలు మాత్రం ఔట్ సోర్సింగ్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. అప్పటికే ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన వారిని, చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో విధులు నిర్వహించిన వారిని సంప్రదిస్తున్నాయి. వారిద్వారా తమ ఉద్యోగులకు శిక్షణనిప్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు కొత్త టెక్నాలజీలపై ఆసక్తి చూపుతున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేసి... శిక్షణకు వెళ్లేలా ప్రోత్సహిస్తుండటం విశేషం.

సానుకూల స్పందన
సంస్థలు చేపడుతున్న రీ-స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొని నైపుణ్యాలు పెంచుకునేందుకు ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు. డబ్ల్యూఈఎఫ్, పీడబ్ల్యూసీ వంటి సంస్థలు రూపొందించిన నివేదిక ప్రకారం సంస్థల్లోని ఉద్యోగుల్లో 60 శాతం మంది వరకు రీ-స్కిల్లింగ్‌ను ఇష్టపడుతున్నారు. 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు మాత్రం రీస్కిల్లింగ్ పట్ల కొంత అనాసక్తితో ఉన్నారని... ఇలాంటి వారు ప్రత్యామ్నాయ కెరీర్స్ అన్వేషణ సాగిస్తున్నారని సదరు నివేదికలు తెలియజేస్తున్నాయి.

రీ-స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ముఖ్యాంశాలు
ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్ దిశగా 70 శాతం సంస్థల అడుగులు.
మూక్స్, ఎల్ అండ్ డీ విధానంలో రీ-స్కిల్లింగ్.
మూడు నుంచి పదిహేనేళ్ల అనుభవం ఉన్న వారికి రీ-స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్.
ఎడెక్స్, కోర్స్‌ఎరా, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇనిషియేటివ్ వంటి సంస్థలతో ఒప్పందం.

ఫ్రెషర్స్ ఆందోళన చెందక్కర్లేదు
ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్ ఇస్తున్న నేపథ్యంలో తాజా గ్రాడ్యుయేట్లు తమ భవిష్యత్తు అవకాశాలు, ఫ్రెష్ హైరింగ్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంస్థలు ఏటా కొత్త నియామకాలు తప్పనిసరిగా చేపడతాయి. ఔత్సాహిక అభ్యర్థులు ముందుగానే కొత్త సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన ఏర్పరచుకుంటే అవకాశాలు మరింత మెరుగవుతాయి.
- ఎం.నరసింహరావు, ఈవీపీ, ఇన్ఫోసిస్.
Published date : 28 Nov 2018 04:25PM

Photo Stories