Skip to main content

ఫార్మసీ ఉన్నత విద్యకు... నైపర్

ఫార్మసీ.. ప్రస్తుతం ఐటీకి దీటుగా కొలువులు అందిస్తున్న రంగం. వేతన ప్యాకేజీలు, కెరీర్ అవకాశాలు, ఉద్యోగ భద్రత.. ఇలా దేన్ని తీసుకున్నా.. ఫార్మా ఒక అడుగు ముందే ఉంటోంది. ఇలాంటి సమయంలో ఫార్మసీ ఉన్నత విద్యకు తలమానికంగా నిలుస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)లో ప్రవేశం పొందితే.. భవిష్యత్తు బంగారుమయమే.
కొద్ది రోజుల క్రితం గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) ఫలితాలు విడుదలయ్యాయి. వీటి ఆధారంగా నిర్వహించే నైపర్ జేఈఈ నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. ఈ నేపథ్యంలో నైపర్ అందిస్తున్న పీజీ కోర్సులు, ఎంపిక ప్రక్రియ, కెరీర్ అవకాశాలపై ఫోకస్..

ఫార్మా రంగానికి నిపుణులను అందించే ఉద్దేశంతో నైపర్‌లను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్, గువహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్ నగర్ (మొహాలీ)లో నైపర్ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో పోస్టు గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇండస్ట్రీ, రీసెర్చ్ ల్యాబ్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా నైపర్‌లు ఉన్నత ప్రమాణాలతో కోర్సులను అందిస్తున్నాయి.

పీజీ కోర్సులు :
నైపర్ క్యాంపస్‌లు పీజీ స్థాయిలో ఎంఎస్-ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎం.టెక్-ఫార్మసీ, ఎంబీఏ (ఫార్మసీ) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

పీజీ స్పెషలైజేషన్లు..
  • ఎంఎస్-ఫార్మసీ: మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివెజైస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషినల్ మెడిసిన్.
  • ఎం.ఫార్మసీ: ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్).
  • ఎంటెక్ ఫార్మసీ: ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ), ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ).
  • ఎంబీఏ (ఫార్మసీ): ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్.

జీప్యాట్+నైపర్ జేఈఈతో..
జాతీయ స్థాయిలోని జీప్యాట్ ఆధారంగా ఫార్మసీ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. కానీ, నైపర్‌లో ప్రవేశం పొందాలంటే మాత్రం జీప్యాట్ స్కోర్ ద్వారా నైపర్-జేఈఈ (నైపర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) పేరుతో నిర్వహించే ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

నైపర్-జేఈఈ అర్హతలు :
  • బీఫార్మసీ లేదా నిర్దేశించిన కోర్సులో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.75 సీజీపీఏ (10 పాయింట్ల స్కేలుపై) లేదా తత్సమాన పర్సంటేజీతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
  • జీప్యాట్/గేట్/నెట్ ఉత్తీర్ణత.

నైపర్-జేఈఈ విధానం..
నైపర్ ఆన్‌లైన్ జేఈఈలో 200 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. బీఫార్మసీ స్థాయి అకడమిక్స్‌పై పూర్తిస్థాయి పట్టు అవసరం. కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ విభాగాలపై దృష్టిసారించాలి. మొత్తం 200 ప్రశ్నల్లో 70 శాతం ప్రశ్నలు వీటి నుంచే వస్తున్నాయి. కోర్ సబ్జెక్టులకు సంబంధించి బీఫార్మసీలో పొందిన నైపుణ్యం, జీప్యాట్ ప్రిపరేషన్.. పరీక్షలో రాణించేందుకు ఉపయోగపడతాయి. ఫార్మకాలజీలో రిసెప్టర్స్, వాటి రకాలు, మెకానిజమ్ ఆఫ్ యాక్షన్, ఔషధాల వర్గీకరణ, క్లినికల్ ట్రయల్స్, ప్రీ-క్లినికల్ ట్రయల్స్ తదితర అంశాలు ముఖ్యమైనవి.

ఉమ్మడి కౌన్సెలింగ్ :
  • పీజీ కోర్సుల్లో (ఎంబీఏ మినహా) ప్రవేశాలకు నైపర్-జేఈఈలో ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఎంబీఏ ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నైపర్-జేఈఈతో పాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. నైపర్-జేఈఈకి 85 శాతం వెయిటేజీ; గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా తుది జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏటా ఒక క్యాంపస్ నైపర్-జేఈఈ, కౌన్సెలింగ్ బాధ్యతలు చేపడుతుంది.

ఆర్థిక ప్రోత్సాహం :
నైపర్ క్యాంపస్‌ల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు (ఎంబీఏ-ఫార్మసీ మినహా) నెలకు రూ.12,400 స్టయిపెండ్ లభిస్తుంది. ఈ స్టయిపెండ్ కొనసాగాలంటే.. ప్రతి సెమిస్టర్‌లోనూ సీజీపీఏ ఆరు పాయింట్లకు తగ్గకూడదు.

క్యాంపస్‌ల వారీగా పీజీ సీట్లు :
మొహాలీ 249
అహ్మదాబాద్ 77
గువహటి 41
హైదరాబాద్ 125
హాజీపూర్ 46
కోల్‌కతా 52
రాయ్‌బరేలి 42

నైపర్-జేఈఈ 2018 సమాచారం...
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ చివరి వారం.
నైపర్ జేఈఈ తేదీ:
జూన్ రెండో వారం
నైపర్ జేఈఈ పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, చండీగఢ్, డెహ్రాడూన్, గువహటి, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
నైపర్ హైదరాబాద్
వెబ్‌సైట్: www.niperhyd.ac.in

అవకాశాలు అపారం..
నైపర్ ప్రవేశ ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంటుంది. కానీ, ఒక్కసారి నైపర్ క్యాంపస్‌లో ప్రవేశం పొంది.. కోర్సు పూర్తిచేస్తే మాత్రం కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఫార్మా కంపెనీలు, డ్రగ్ ఫార్ములేషన్ కేంద్రాలతో పాటు పరిశోధనా సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. కెరీర్ ప్రారంభంలోనే నెలకు కనీసం రూ.40 వేల జీతం అందుతుంది. కాబట్టి విద్యార్థులు బీఫార్మసీతో సరిపెట్టకుండా.. పీజీ స్థాయి కోర్సులు చేయాలి.
- ప్రొఫెసర్ బి.రాజేశ్వర రెడ్డి, డీన్, నైపర్-హైదరాబాద్.
Published date : 20 Mar 2018 06:08PM

Photo Stories