Skip to main content

పక్కా కొలువులు సాధించేందుకు ఉపయోగపడే హాస్పిటాలిటీ కోర్సులకు.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ 2021 నోటిఫికేషన్ విడుదల..

కోర్సులు వందల్లో ఉండొచ్చు. కానీ, ఈ కోర్సులు చేస్తే ప్లేస్‌మెంట్స్ పక్కా అనేవి కొన్నే ఉంటాయి.

అలాంటి వాటిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు ఒకటి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌ల్లో ఈ కోర్సులో ప్రవేశాలకు వీలు కల్పించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ) 2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ 2021ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు.. కెరీర్ అవకాశాలు.. ఐహెచ్‌ఎంల ప్రత్యేకత, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం...

ఐహెచ్‌ఎం..
హోటల్ మేనేజ్‌మెంట్ రంగానికి అవసరమైన మానవ వనరులను తయారు చేసేందుకు కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఇది దేశంలో హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ విద్యను పర్యవేక్షిస్తుంది. ఏటా స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దాంతో ప్రస్తుతం ఆతిథ్య రంగం దూసుకుపోతోంది. ఫలితంగా సేవల రంగంలో భాగమైన హోటల్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌ల్లో కోర్సులు పూర్తి చేసుకున్న వారు అవకాశాలు అందుకోవచ్చు.

హోటల్ మేనేజ్‌మెంట్... జేఈఈ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌ల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షే.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఐహెచ్‌ఎంలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌లోని హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలు లభిస్తాయి. హోటల్ పరిశ్రమలో పనిచేయాలనుకునే విద్యార్థుల కోసం ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2021 నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల అభ్యర్థులు మే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులకు 2021 జూన్ 12న ఆన్‌లైన్ ఎంట్రన్‌‌స నిర్వహిస్తారు.

ఇన్‌స్టిట్యూట్స్-సీట్లు..
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 21 ఇన్‌స్టిట్యూట్స్, స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్‌స్టిట్యూట్స్ 26, పీఎస్‌యూ యాజమాన్యంలో నడుస్తున్న ఒక సంస్థ, 26 ప్రైవేట్ సంస్థలు.. మొత్తం 74 హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంస్థలు కోర్సులను అందిస్తు న్నాయి. కాగా, తెలంగాణలో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి చొప్పున మొత్తం ఐదు ప్రభుత్వ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలు ఉన్నాయి. పలు ప్రైవేటు సంస్థలు కూడా ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఇంకా చదవండి: part 2: హాస్పిటాలిటీ కోర్సులు చదవాలనుకుంటే.. ఉండాల్సిన అర్హతలివే..

Published date : 16 Feb 2021 04:02PM

Photo Stories