నవంబర్ 29న క్యాట్ 2020.. పరీక్ష విధానంలో కీలక మార్పులు..
ముందుగా..‘కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)’ రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంలతోపాటు ఇతర బీస్కూల్స్‌లోనూ ఎంబీఏ కోర్సుల్లో చేరవచ్చు. ఈ నెల(నవంబర్) 29న క్యాట్ జరుగనున్న నేపథ్యంలో... ఈ పరీక్షలో విజయానికి ఎగ్జామ్ టిప్స్..
మూడు విభాగాలు..100 ప్రశ్నలు
క్యాట్ పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో పేపర్, పెన్/పెన్సిల్ వాడేందుకు అవకాశం ఉండదు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుంది. టెస్ట్‌లో మూడు విభాగాలుగా ప్రశ్నలు ఉంటాయి. మొదటిది ‘వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెషన్’ (వీఏఆర్‌సీ). ఈ విభాగం నుంచి 34 ప్రశ్నలు వస్తాయి. రెండో విభాగం.. ‘డేటా ఇంటర్‌ప్రెటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్’(డీఐఎల్‌ఆర్). దీన్నుంచి 32 ప్రశ్నలు ఉంటాయి. మూడోది ‘క్వాంటిటేటివ్ ఎబిలిటీ’(క్యూఏ). ఈ విభాగం నుంచి 34 ప్రశ్నలు వస్తాయి. అంటే.. మొత్తం మూడు విభాగాల నుంచి 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఎంసీక్యూ(మల్టిపుల్ చాయిస్ కొశ్చన్స్), నాన్ ఎంసీక్యూ విధానంలో అడిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఎంతో పోటీ ఉండే.. ఈ పరీక్షలో ప్రతి మార్కు ఎంతో కీలకమని గుర్తించాలి.
సమయం కుదింపు..
క్యాట్ సమయాన్ని కుదిస్తున్నట్టు పరీక్ష నిర్వాహక సంస్థ ఐఐఎం–ఇండోర్ ఇటీవల ప్రకటించింది. దీని ప్రకారం– పరీక్షకు గతంలో మొత్తం 180 నిమిషాల(3గంటలు) సమయం ఉండగా.. ఈ ఏడాది (2020) మాత్రం కొవిడ్–19 నేపథ్యంలో.. ఆ సమయాన్ని 120 నిమిషాలకు(2గంటలు) కుదించారు. అంటే.. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాలు మాత్రమే సమయం అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ స్లాట్స్ సైతం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని మూడుసార్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష సమయాన్ని కుదించారు కాబట్టి ప్రశ్నలను కూడా తగ్గించవచ్చని (65 నుంచి 75 వరకు) అంచనా వేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని ఇండోర్ ఐఐఎం ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. ప్రశ్నలను తగ్గిస్తున్నట్టు గాని, కొన్నింటిని తొలగించినట్టు గానీ ప్రకటించలేదు. కాబట్టి గతేడాది మాదిరిగానే 100 ప్రశ్నలు ఉంటాయనుకొని సిద్ధం కావాలి అంటున్నారు నిపుణులు.
ఇంకా చదవండి: part 2: క్యాట్‌లో విజయం సాధించాలంటే ఇవి ఎంతో కీలకం..