Skip to main content

నిట్‌ల్లో ఎంసీఏ చేయాలనుకునేవారికి సదావకాశం.. నిమ్‌సెట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల..

మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌.. సంక్షిప్తంగా ఎంసీఏ. పీజీ స్థాయిలో ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంబంధ నైపుణ్యాలను అందించే కోర్సు! ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంసీఏలో చేరేందుకు చక్కటి మార్గం.. నిమ్‌సెట్‌!! జాతీయ స్థాయిలో.. టాప్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌గా.. గుర్తింపు పొందిన విద్యాసంస్థలు.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీలు(నిట్స్‌). వీటిల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్షే నిమ్‌సెట్‌! 2021–22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి.. నిమ్‌సెట్‌–2021 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో... నిమ్‌సెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం...

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో కంప్యూటర్‌ సైన్స్, అనుబంధ కోర్సులకు డిమాండ్‌ నెలకొంది. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల ద్వారా ఐటీ రంగంలో కొలువులు దక్కించుకోవాలని లక్షల మంది విద్యార్థులు కలలు కంటున్నారు. డిగ్రీ తర్వాత పీజీ స్థాయిలో ఎంసీఏలో చేరితే కలల కొలువుకు మార్గం సుగమం అవుతుంది. నిమ్‌సెట్‌ ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)ల్లో ఎంసీఏ కోర్సులో అడుగు పెట్టి.. ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు.

çపదకొండు ఎన్‌ఐటీలు..
నిమ్‌సెట్‌(ఎన్‌ఐటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)లో ర్యాంకు ఆధారంగా మొత్తం çపదకొండు ఎన్‌ఐటీ క్యాంపస్‌ల్లో ఎంసీఏ కోర్సులో చేరొచ్చు. ఎన్‌ఐటీ–అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లి, వరంగల్, పాట్నా క్యాంపస్‌లు నిమ్‌సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నాయి. గత ఏడాది పది ఎన్‌ఐటీలే నిమ్‌సెట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పించగా.. 2021లో నిట్‌–పాట్నా కూడా ఈ జాబితాలో చేరింది. ప్రతి ఏటా ఒక్కో ఎన్‌ఐటీ నిమ్‌సెట్‌ నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. ఈ ఏడాది నిమ్‌సెట్‌ను ఎన్‌ఐటీ రాయ్‌పూర్‌ నిర్వహిస్తోంది.

మొత్తం సీట్లు 951..
నిమ్‌సెట్‌–2021 ద్వారా ప్రవేశం కల్పించే పదకొండు ఎన్‌ఐటీల్లో మొత్తం 951 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వివరాలు.. అగర్తల 30; అలహాబాద్‌ 116; భోపాల్‌ 115; కాలికట్‌ 58; జంషెడ్‌పూర్‌ 115; కురుక్షేత్ర 64; పాట్నా 40; రాయ్‌పూర్‌110; సూరత్‌కల్‌ 58; తిరుచిరాపల్లి 115; వరంగల్‌ 58.

అర్హత..

  • మూడేళ్ల కాలపరిమితి గల బీఎస్సీ/బీఎస్సీ (ఆనర్స్‌)/బీసీఏ/బిఐటీ/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌)లో మ్యాథమెటిక్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా బీఈ/బీటెక్‌ చదివిన వారు నిమ్‌సెట్‌–21కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి అభ్యర్థులు సెప్టెంబర్‌ 15లోపు సర్టిఫికెట్లు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.
  • డిగ్రీలో 60 మార్కులు లేదా సీజీపీఏ 6.5/10, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు 55 శాతం మార్కులు లేదా 6.0 సీజీపీఏ తప్పనిసరి.

ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష..
నిమ్‌సెట్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగెటివ్‌ మార్కుగా నిర్ణయించారు.

విభాగం ప్రశ్నల సంఖ్య
మ్యాథమెటిక్స్‌ 50
అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 40
కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ 10
జనరల్‌ ఇంగ్లిష్‌ 20
మొత్తం ప్రశ్నలు 120

మ్యాథమెటిక్స్‌.. డిగ్రీ స్థాయి
నిమ్‌సెట్‌లో ర్యాంకు సాధించాలనుకుంటున్న విద్యార్థులు.. డిగ్రీ స్థాయిలోని మ్యాథమెటిక్స్‌ పుస్తకాలను బాగా చదవాలి. చదవడమే కాకుండా.. ప్రాక్టీస్‌ కూడా చేయాలి. ముఖ్యంగా సెట్‌ థియరీ, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్, అల్జీబ్రా, కో–ఆర్డినేట్‌ జామెట్రీ, కాలిక్యులస్, వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలి. వీటిలో ఆయా అంశాలకు సంబంధించి కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా ప్రిపరేషన్‌ సమయంలో ప్రాక్టీస్‌ చేస్తూ ముందుకు సాగాలి.

విశ్లేషణ, తార్కిక దృక్పథం..
నిమ్‌సెట్‌లోని మరో ముఖ్యమైన విభాగం.. అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌. ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో రాణించాలంటే.. అభ్యర్థులు విశ్లేషణ నైపుణ్యాలను, అదే విధంగా తార్కికంగా ఆలోచించే నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలను అభ్యసిస్తూ వాటిని ప్రాక్టీస్‌ చేయాలి. నిమ్‌సెట్‌ గత ప్రశ్న పత్రాల సాధన కూడా ఎంతో ఉపకరిస్తుంది.

కంప్యూటర్‌ అవేర్‌నెస్‌..
అభ్యర్థుల్లోని కంప్యూటర్‌ బేసిక్‌ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌కు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా డేటా రిప్రజెంటేషన్‌ అంశాలపైనా పట్టు సాధించాలి.

జనరల్‌ ఇంగ్లిష్‌..
ఇది అభ్యర్థుల్లోని ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించే ఉద్దేశంతో పొందుపర్చిన విభాగం. ఇందులో మంచి మార్కులు పొందడానికి కాంప్రహెన్షన్, వొకాబ్యులరీ, బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం మార్కెట్లో లభించే కాంపిటీటివ్‌ ఇంగ్లిష్‌ టెస్ట్‌ బుక్స్‌ను అధ్యయనం చేయడం ఎంతో లాభిస్తుంది.

రీడింగ్‌ + ప్రాక్టీస్‌..
మొత్తం నాలుగు విభాగాల్లోనూ రాణించేందుకు అభ్యర్థులు రీడింగ్‌తో పాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రిపరేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు తాము చదివిన అంశాలకు సంబంధించి ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించి సెల్ఫ్‌ టెస్ట్‌లు రాసుకోవాలి. అదే విధంగా మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లు రాయడం కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటివల్ల ఇంకా దృష్టి పెట్టాల్సిన అంశాల విషయంలో అవగాహన ఏర్పడుతుంది. ప్రిపరేషన్‌ పరంగా అనుసరించాల్సిన విధానంపై మరింత స్పష్టత లభిస్తుంది.

ఉమ్మడి కౌన్సెలింగ్‌..
నిమ్‌సెట్‌లో అర్హత ఆధారంగా ప్రవేశాలు కల్పించే పదకొండు ఎన్‌ఐటీలు.. ఆన్‌లైన్‌ విధానంలో ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతాయి. అభ్యర్థులు నిమ్‌సెట్‌ ర్యాంకు ఆధారంగా నిమ్‌సెట్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఇలా అప్లికేషన్‌ పూర్తి చేసే సమయంలోనే ప్రాధాన్యతా క్రమంలో తమకు ఆసక్తి ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు, ఎంచుకున్న ఇన్‌స్టిట్యూట్‌లు, అందుబాటులో ఉన్న సీట్లు ఆధారంగా ఆన్‌లైన్‌లోనే సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తారు. నిమ్‌సెట్‌లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు.. ముందుగానే తమకు ఆసక్తి ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ల విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి.

మూడు రౌండ్లలో కౌన్సెలింగ్‌..
మొత్తం మూడు రౌండ్లలో నిమ్‌సెట్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆయా రౌండ్లలో తమకు వచ్చిన సీట్‌ అలాట్‌మెంట్‌ ఆధారంగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. తదుపరి రౌండ్లలో కౌన్సెలింగ్‌కు పాల్గొనే అవకాశం కూడా అందుబాటులో ఉంది. మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌ తర్వాత ఏమైనా సీట్లు మిగిలితే ఫ్రెష్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ పేరిట మరో అవకాశం కల్పిస్తారు. ముందు మూడు రౌండ్లలో సీటు వచ్చిన ఇన్‌స్టిట్యూట్‌ల్లో చేరేందుకు ఆసక్తి లేని విద్యార్థులకు ఫ్రెష్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ద్వారా చివరి రౌండ్‌లో పాల్గొనేందుకు అర్హత లభిస్తుంది.

ఉజ్వల భవిష్యత్తు..
నిమ్‌సెట్‌ ద్వారా ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశం పొందితే ఉజ్వల భవిష్యత్తుకు మార్గం ఏర్పడినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కోర్సు బోధన విషయంలో ఆయా ఎన్‌ఐటీలు అనుసరిస్తున్న ప్రమాణాలు, నాణ్యత కారణంగా విద్యార్థులకు కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఇతర సాఫ్ట్‌వేర్‌ అంశాలపై పూర్తి అవగాహన వస్తుంది. తద్వారా సీఎస్‌ఈ విద్యార్థులకు దీటుగా కార్పొరేట్‌ రంగంలో పోటీ పడే అవకాశం లభిస్తోంది. ఇందుకు ఆయా ఎన్‌ఐటీల్లో ఎంసీఏ విద్యార్థులకు లభిస్తున్న ప్లేస్‌మెంట్స్‌నే నిదర్శనంగా పేర్కొనొచ్చు. గత మూడేళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. సదరు ఎన్‌ఐటీల్లో ఎంసీఏ పూర్తి చేసుకున్న వారిలో నూటికి తొంభై శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఖరారవుతున్నాయి. అదే విధంగా వేతనాలు కూడా సగటున రూ.ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంటున్నాయి.

ముఖ్య సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 7 వరకు
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మే 15 నుంచి మే 22 వరకు
నిమ్‌సెట్‌ పరీక్ష తేదీ: మే 23, 2021
నిమ్‌సెట్‌ ఫలితాల వెల్లడి: జూన్‌ 8, 2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్‌.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nimcet.in  

రెండేళ్ల తర్వాత ఎగ్జిట్‌ అవకాశం..
ఎన్‌ఐటీల్లో మూడేళ్ల ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిమ్‌సెట్‌ను నిర్వహిస్తున్నాం. వరంగల్‌లో మాత్రం రెండేళ్ల తర్వాత ఎంసీఏ నుంచి నిష్క్రమించే(ఎగ్జిట్‌) అవకాశాన్ని కూడా అందుబాటులోకి తెచ్చాం. రెండేళ్లు కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఎగ్జిట్‌ అవకాశం అందుబాటులోకి వస్తుంది. అలా ఎగ్జిట్‌ ఆప్షన్‌ను ఎంచుకునే విద్యార్థులకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ సర్టిఫికెట్‌ను అందిస్తున్నాం. కోర్సు, కెరీర్‌ విషయానికొస్తే విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు. ఎన్‌ఐటీల్లో ఎంసీఏ విద్యార్థులకు కార్పొరేట్‌ రంగంలో మంచి డిమాండ్‌ నెలకొంది. వచ్చే ఏడాది మరికొన్ని ఎన్‌ఐటీలు కూడా నిమ్‌సెట్‌ ద్వారా ఎంసీఏ ప్రవేశం కల్పించే అవకాశం ఉంది.
– ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణరావు, డైరెక్టర్, నిట్‌–వరంగల్‌.

Published date : 24 Mar 2021 04:57PM

Photo Stories