Skip to main content

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2016

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న నూతన విద్యా విధానం ముసాయిదా విడుదలైంది. కేంద్ర కేబినెట్ మాజీ సెక్రటరీ టి.ఎస్.ఆర్.సుబ్రమణియన్ నేతృత్వంలో ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ.. ప్రస్తుత తరానికి, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా కొత్త విద్యావిధానంలో అనుసరించాల్సిన పలు సిఫార్సులు చేసింది. ప్రీ-ప్రైమరీ నుంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వరకు.. అంగన్‌వాడీల నుంచి అంతర్జాతీయ విద్యావకాశాల వరకూ.. పలు సలహాలు ఇచ్చింది. మారిన సమకాలీన ప్రపంచంలో నాలెడ్జ్ బేస్డ్ సమాజంలో లైఫ్‌లాంగ్ లెర్నింగ్, ఇంటర్నేషనలైజేషన్, స్కిల్ డెవలప్‌మెంట్‌కు సిఫార్సుల్లో పెద్దపీట వేసింది. మరోవైపు కమిటీ సిఫార్సులపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది.
సుబ్రమణియన్ కమిటీ విద్యారంగ ప్రగతికి ఎలాంటి మార్పులు తీసుకురావాలో... ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్దిష్టంగా పేర్కొనలేదని కొంతమంది విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుబ్రమణియన్ కమిటీ రూపొందించిన జాతీయ విద్యా విధానం 2016 ముసాయిదాపై నిపుణుల విశ్లేషణ..

స్కూల్ ఎడ్యుకేషన్
సెకండరీ ఎడ్యుకేషన్ స్థాయిలో పాఠశాలలను, మూల్యాంకన విధానాలను పునస్సమీక్షించి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల నైపుణ్యాలను మూల్యాంకన చేసే కోణంలో పరీక్షల్లో పలు అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని సూచించింది. ఎన్‌రోల్‌మెంట్ తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించి.. వీలైతే వాటిని సమీపంలోని పాఠశాలల్లో కలిపేయాలి. దీనివల్ల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టీచింగ్-లెర్నింగ్ సాధ్యమవుతాయి. ఫలితంగా వన్ - క్లాస్, వన్ - టీచర్ లక్ష్యం చేరుకోవచ్చు. అలాగే కేంద్రీయ, జవహర్ నవోదయ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను పెంచాలి. డ్రాప్‌అవుట్స్ కోసం ఓపెన్ స్కూలింగ్ సౌకర్యం కల్పించాలి. విద్యార్థుల్లో నిజమైన ఆసక్తిని, సామర్థ్యాన్ని గుర్తించేందుకు ఆప్టిట్యూడ్ టెస్ట్‌లను నిర్వహించాలి. స్లో లెర్నర్స్‌కు సహకరించేందుకు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కౌన్సిలర్లను నియమించాలి.

ఐదో తరగతి వరకే నో డిటెన్షన్
పాఠశాల విద్యకు సంబంధించి కమిటీ చేసిన ముఖ్య సిఫార్సు.. నో - డిటెన్షన్ విధానాన్ని సవరించడం. దీన్ని ఐదో తరగతి వరకే పరిమితం చేయాలని, ప్రాథమికోన్నత స్థాయిలో డిటెన్షన్ విధానం అమలు చేయాలని సూచించింది. కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్‌ను సమర్థంగా అమలు చేయాలి. తద్వారా అకడమిక్‌గా రాణించలేకపోతున్న వారిని గుర్తించొచ్చు.

కరిక్యులంలో మార్పులు
పాఠశాల స్థాయి నుంచే కరిక్యులంలో నిరంతర మార్పులు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. పరమత సహనం, జాతీయ సమైక్యత, సమకాలీన సామాజిక పరిస్థితులపై అవగాహన కల్పించాలని పేర్కొంది. కరిక్యులం అవుట్‌కమ్ బేస్డ్‌గా ఉండాలని, లైఫ్ స్కిల్స్‌ను పెంపొందించేలా మార్పులు చేయాలని సూచించింది. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలపై అవగాహన కల్పించాలని పేర్కొంది. కింది స్థాయి నుంచే కరిక్యులం, పెడగాజీల్లో నిరంతరం మార్పులు చేస్తూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెంపొందించాలి. సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌లకు జాతీయ స్థాయిలో ఉమ్మడి కరిక్యులం రూపొందించాలి. ఐదో తరగతి నుంచే డిజిటల్ లిటరసీని కరిక్యులంలో పొందుపర్చాలి. ఆరో తరగతి నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని ఒక సబ్జెక్ట్‌గా రూపొందించాలి. లింగ, సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ వివక్షతలకు తావివ్వని రీతిలో కరిక్యులం రూపొందించాలి. పౌరసత్వం, శాంతి, వ్యక్తిత్వం, న్యాయ, రాజ్యాంగం, ఆర్థికం, పర్యావరణ అంశాలపై అవగాహన ఉండాలి.

కోరుకుంటేనే బోర్డ్ పరీక్షలు
పరీక్ష విధానంలోనూ కమిటీ పలు మార్పులు సూచించింది. పరీక్షలు పూర్తిగా విస్తృత అవగాహనను, గ్రాహక శక్తిని, సమ స్య సాధన నైపుణ్యాలను పరీక్షించేలా ఉండాలని పేర్కొంది. కేవలం పాఠ్యపుస్తకాల్లోని అంశాలను తిరిగి పొందుపరిచే విధానానికి స్వస్తి పలకాలని సిఫార్సు చేసింది. పదో తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలవుతున్న సబ్జెక్ట్‌లు సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్. ఈ మూడు సబ్జెక్ట్‌ల పరీక్షలను పార్ట్-ఎ, పార్ట్-బి విధానంలో నిర్వహించాలి. ఉన్నత చదువుల కోణంలో ఈ మూడు సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకునేవారు పార్ట్-ఎ, పదో తరగతి తర్వాత ఒకేషనల్, ఇతర కోర్సులవైపు వెళ్లే విద్యార్థులు పార్ట్-బి స్థాయి పరీక్షలు రాస్తే సరిపోయేలా చూడాలి. అయితే పదో తరగతి పరీక్షలు రాయడం విద్యార్థులందరికీ తప్పనిసరి చేయాలి. దేశవ్యాప్తంగా వివిధ బోర్డులు, వేర్వేరు సిలబస్‌లు, పరీక్షలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అన్ని బోర్డ్‌ల విద్యార్థుల మార్కులను ఒక నిర్దిష్ట స్కేలింగ్ విధానంలో సమీకృతం చేయాలి లేదా జాతీయ స్థాయిలో పది, ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలి. మూడో ప్రత్యామ్నాయం ప్రతి బోర్డ్‌లో పర్సంటైల్ విధానాన్ని అమలు చేయడం.

బోధన మాధ్యమం
జాతీయ విద్యా విధానం-1986, 1992 ప్రకారం దేశంలో త్రిభాష సిద్ధాంతం అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే భిన్న సంస్కృతుల రాష్ట్రాలు ఉన్న కారణంగా ఈ విషయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా త్రీ లాంగ్వేజ్ విధానంపైనా పలు సూచనలను ఈ కమిటీ నివేదించింది. వీటి ప్రకారం.. ఐదో తరగతి వరకు మాతృ భాషలో లేదా ప్రాంతీయ భాషలో బోధన ఉండాలి. రెండో లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్‌ను అందించాలి. మూడో లాంగ్వేజ్ ఎంపికను విద్యార్థులు తమ ఆసక్తి మేరకు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. సంస్కృతానికి ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో పాఠశాల, యూనివర్సిటీ స్థాయిలో సంస్కృత బోధనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి.

వ్యక్తిత్వ వికాసం..
ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా, గేమ్స్- స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి వాటిలో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని కమిటీ పేర్కొంది. స్థానిక కళలు, సాహిత్యాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో ఆరోగ్య సంరక్షణ దిశగా ఆరోగ్య శాఖ సహకారంతో నిరంతరం పరీక్షలు నిర్వహించాలి.

విద్య, ఉద్యోగ సాధన నైపుణ్యాల కల్పన
యువతకు వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపట్టి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచాలని కమిటీ సూచించింది. ఎన్‌ఎస్‌డీసీ అంచనాల ప్రకారం- 2022 నాటికి 104.62 మిలియన్ల యువత జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించనున్నారు. ఇప్పటి నుంచే వారికి జాబ్ రెడీ స్కిల్స్ అందించాలి. ఎంప్లాయబిలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ లభించేలా స్కిల్ డవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ అందించాలి.

ఐసీటీకి ప్రాధాన్యం
అన్ని కోర్సులు, అన్ని స్థాయిల్లో అభ్యసనం పరంగా ఐసీటీని అంతర్గత విధానంగా రూపొందించే ఏర్పాట్లు చేయాలి. ఐసీటీ విధానాన్ని పెంపొందించేందుకు మూక్స్ (మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్)ను ప్రోత్సహించాలి. ఐసీటీ సమర్థ అమలుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి.

బోధన సిబ్బంది బలోపేతం
కమిటీ నివేదిక ప్రకారం సెకండరీ స్థాయిలో మ్యాథమెటిక్స్, సైన్స్, లాంగ్వేజ్ టీచర్ల కొరత అధికంగా నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో అధిక శాతం పాఠశాలల్లో పూర్తి స్థాయి బోధన సిబ్బంది లేరని కమిటీ పేర్కొంది. టీచర్ల నియామకం పరంగా రాష్ట్రాల స్థాయిలో టీచర్ రిక్రూట్‌మెంట్ కమిషన్లను ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీని ఆ ప్రాంతం వారితోనే చేపట్టాలి. ఉపాధ్యాయుల గైర్హాజరు, పాఠశాలల నిర్వహణకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు నిర్ణయాధికారాలు ఇవ్వాలి.
ఉపాధ్యాయ విద్య కోర్సులు: జాతీయ స్థాయిలో టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. రీజనల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌ను బలోపేతం చేయడంతోపాటు వాటిని యూనివర్సిటీ స్థాయికి పెంచాలి. బీఈడీ, డీఈడీ కోర్సుల కరిక్యులంలో మార్పులు చేయాలి. ఈ కోర్సులు అందించే సంస్థలకు గుర్తింపు తప్పనిసరి. టీచర్లకు ప్రతి మూడేళ్లకు ఓరియెంటేషన్స్ నిర్వహించాలి. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్ల నైపుణ్యాల ఆధారంగా పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.

ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్
కమిటీ సిఫార్సుల ప్రకారం.. ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం లేదు. ద ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. వీటిని బలోపేతం చేసి 4 నుంచి 5 ఏళ్ల వయసులోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ర్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలి. అన్ని ప్రాథమిక పాఠశాలల్లోనూ ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాల ప్రాంగణంలోనో, లేదా పాఠశాలకు అత్యంత సమీపంలోనే ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు ప్రత్యేకంగా నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. ప్రాథమిక విద్యలో లెర్నింగ్ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు విద్యార్థుల్లో ఎర్లీ గ్రేడ్ రీడింగ్, రైటింగ్, కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ స్కిల్స్ పెరిగేలా సంబంధిత ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి. అలాగే ప్రత్యేక వర్గాలకు చెందిన వలస పిల్లలు, దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న పిల్లల కోసం అవసరమైతే ‘ఆల్టర్నేట్ స్కూల్స్’ను ఏర్పాటు చేయొచ్చని కమిటీ సిఫార్సు చేసింది.

ఉన్నత విద్యలో సమున్నత మార్పులు
ప్రస్తుత గ్లోబలైజేషన్, డిజిటలైజేషన్ నేపథ్యంలో ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని కమిటీ పేర్కొంది.
జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఇది ప్రతి ఐదేళ్లకోసారి కరిక్యులం, బోధన, ఇతర అంశాలపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సలహాలు, సూచనలు అందించాలి.
ఉన్నత విద్య నియంత్రణ సంస్థల్లో ఇండస్ట్రీ నిపుణులు, పూర్వ విద్యార్థులు, ఇతర విద్యావేత్తలు ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
యూనివర్సిటీల స్థాయిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్టడీస్‌ను సమీకృతం చేసే విధానాలు రూపొందించాలి.
విద్యా రంగంలో అకడమిక్, నిర్వహణ విభాగాల కోసం జాతీయ స్థాయిలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్‌ను రూపొందించాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్స్ ఉండాలి. వర్సిటీ పరిధిలో అనుబంధ కళాశాలలు వందకు మించకూడదు.

ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి నియంత్రణ విధానాలు
జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలు వేర్వేరు విధానాలతో నిర్వహణ సాగిస్తున్నాయి. వీటన్నిటినీ ఒకే విధానంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని కమిటీ పేర్కొంది.
నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను సమర్థంగా పర్యవేక్షించేందుకు స్వతంత్ర వ్యవస్థను రూపొందించాలి.
జాతీయ స్థాయిలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల సమాచార సేకరణ, సమీకృతం చేయడం కోసం సెంట్రల్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టికల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు తప్పనిసరిగా వర్సిటీలు, కళాశాలల నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి.
ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా ఎన్‌బీఏ లేదా న్యాక్ గుర్తింపు పొందాలి. న్యాక్, ఎన్‌బీఏలను పునర్వ్యవస్థీకరించాలి.
గ్లోబల్ ర్యాంకులు పొందేలా వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు ఉండేలా న్యాక్, ఎన్‌బీఏలు చర్యలు తీసుకోవాలి.

మూక్స్‌కు ప్రాధాన్యం.. ప్రత్యేక వ్యవస్థ
అంతర్జాతీయంగా తాజా పరిణామాలపై అవగాహన, అంతర్జాతీయంగా సబ్జెక్ట్ నైపుణ్యాల వృద్ధి. ఈ క్రమంలో ప్రాచుర్యంలోకి వస్తున్న విధానం మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్స్). వీటిని విస్తరించేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. మూక్స్ నిర్వహణ, అభివృద్ధి, సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. మూక్స్, ఓడీఎల్ కోర్సుల్లో నిరంతరం మార్పులు చేర్పులు చేస్తుండాలి. స్కిల్ డవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఒకేషనల్ కోర్సులు అందించాలి.

విదేశీ వర్సిటీలకు ఆహ్వానం.. పరస్పర ఒప్పందం
అంతర్జాతీయ నైపుణ్యాలు పొందడానికి విద్యా వ్యవస్థను గ్లోబలైజ్ చేయాలని కమిటీ పేర్కొంది. అందులో ప్రధానంగా విదేశీ వర్సిటీలను ఆహ్వానించడం, లేదా వాటితో భారత్‌లోని యూనివర్సిటీలు ఒప్పందం చేసుకోవడం వంటివి కీలకం. ప్రపంచంలోని టాప్-200 జాబితాలో ఉన్న వర్సిటీలు భారత్‌లోని వర్సిటీలతో ఒప్పందం ద్వారా ఇక్కడ అడుగుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ ఇన్‌స్టిట్యూట్‌లు ఇచ్చే సర్టిఫికెట్లకు గుర్తింపు కల్పించాలి.

భారత్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఇతర దేశాల్లో క్యాంపస్‌లు నెలకొల్పేందుకు అనుమతివ్వాలి. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే విధంగా కరిక్యులం రూపొందించాలి. విదేశీ ఫ్యాకల్టీ ఆకర్షితులయ్యేందుకు కృషి చేయాలి. టీచింగ్ పోస్టుల్లో బెస్ట్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. రీసెర్చ్‌వైపు ఆకర్షితులయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎంఫిల్, పీహెచ్‌డీ అభ్యర్థులను అకడమిక్ అసిస్టెంట్స్, అకడమిక్ అసోసియేట్స్‌గా పరిగణించాలి. కొత్తగా నియమితులైన ఫ్యాకల్టీకి విధుల్లో చేరే ముందుగా మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ట్రైనింగ్ అకాడమీల నేతృత్వంలో ఇండక్షన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి. తర్వాత పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ అందించాలి. ఇండక్షన్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వాళ్లు ఫ్యాకల్టీగా నియమితులైన యూనివర్సిటీలో నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించాలి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీ నైపుణ్యాలను, అకడమిక్ పెర్‌ఫార్మెన్స్‌ను పరీక్షించేలా తప్పనిసరిగా మూల్యాంకన వ్యవస్థ ఉండాలి. సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల పదోన్నతుల క్రమంలో వారిలో లీడర్‌షిప్ నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్నత విద్యా సంస్థలు లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు నెలకొల్పి వీటిపై షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి.

ఆర్ అండ్ డీ కి అనువైన వాతావరణం
మన దేశంలోని యువత రీసెర్చ్ దిశగా విదేశాలకు వెళుతున్న క్రమంలో ఇక్కడే ఆ అవకాశం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. పబ్లిక్, ప్రైవేట్ విభాగంలో రానున్న పదేళ్లలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా కనీసం 100 కొత్త రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంపొందించేందుకు రానున్న ఐదేళ్ల కాలంలో ఉన్నత విద్యా సంస్థల్లో అదనంగా వంద ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, స్టడీస్‌కు ప్రాధాన్యమిస్తూ మానవ వనరులను అభివృద్ధి చేసేలా అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవాలి.

అన్ని వర్గాలకు విద్య అందేలా
గామీణ విద్యార్థులు, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులు, గిరిజన ప్రాంత విద్యార్థులు.. ఇలా ప్రతి ఒక్కరికీ విద్యనందించే విధంగా చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందించాలి. గిరిజన విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలు పెంచేలా పాఠశాల తరగతులు ముగిసిన తర్వాత వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించాలని కమిటీ సూచించింది. మాతృభాషలో బోధిస్తున్నప్పటికీ కొన్ని గిరిజన వర్గాలకు ఆ భాష అర్థం కావడం లేదు. ఇలాంటి వారికోసం బహుళ మాధ్యమ బోధన విధానాన్ని రూపొందించాలి.

ప్రత్యేకంగా నేషనల్ ఫెలోషిప్ ఫండ్
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు నేషనల్ ఫెలోషిప్ ఫండ్ పేరుతో స్కాలర్‌షిప్ ప్రారంభించాలి. దీని ద్వారా ఏటా దేశవ్యాప్తంగా పది లక్షల మంది ఈబీసీ వర్గాల విద్యార్థుల ట్యూషన్ ఫీజు, ఇతర అభ్యసన సామగ్రికి సరిపడే మొత్తాన్ని అందించాలి. అన్ని వర్గాల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్ ప్రారంభించాలి. అర్హులను ఎంపిక చేసేందుకు పదో తరగతి తర్వాత జాతీయ స్థాయిలో ఒక పరీక్ష నిర్వహించాలని కమిటీ సూచించింది.

సమర్థ అమలు ప్రధానం
నూతన విద్యా విధానం ప్రాథమిక విద్య నుంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వరకు అన్నీ స్పృశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే పాఠశాలల ఏకీకరణ విషయంలో నిర్దిష్టంగా కొన్ని విధానాలు అనుసరించాలి. మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లి చదవాల్సిన విద్యార్థులకు సబ్సిడీ అందించాలి. అదే విధంగా ఇప్పుడు మన విద్యా విధానంలో పాఠశాల స్థాయిలో ఎదురవుతున్న సమస్య.. జెడ్పీ, మునిసిపల్ తదితర విభాగాల ఆధ్వర్యంలో పాఠశాలల నిర్వహణ జరుగుతుండటం. వీటన్నిటినీ ఒకే విభాగంగా నిర్వహించాలి. ప్రైవేటు పాఠశాలల తనిఖీ, గుర్తింపునకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అక్రెడిటేషన్ బోర్డ్‌లను నియమించాలి. పాఠశాల స్థాయిలో ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉండాలనే సిఫార్సు మంచిదే. అయితే ఇంగ్లిష్‌ను సైతం ఒక భాషగా ఆరో తరగతి నుంచి అందించాలి. సిఫార్సులను సమర్థంగా అమలు చేయడం మనకు ఎదురయ్యే ప్రధాన సమస్య. దీన్ని పరిష్కరించేందుకు దృష్టి సారిస్తే ఏడాది వ్యవధిలోనే ఈ సిఫార్సులన్నీ పట్టాలెక్కుతాయి.
-డాక్టర్. ఎన్. జయప్రకాశ్ నారాయణ్, లోక్‌సత్తా వ్యవస్థాపకులు

ఆహ్వానించదగ్గ పరిణామం
ఆర్ అండ్ డీకి ప్రాధాన్యమిచ్చేలా పలు సిఫార్సులు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ప్రత్యేకంగా టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌కు అవసరమైన అంశాల గురించి నిర్దిష్టంగా ఎలాంటి సిఫార్సులు చేయకపోవడం గమనార్హం. విదేశీ యూనివర్సిటీలకు ఆహ్వానం పలకడం వల్ల విద్యార్థులకు అంతర్జాతీయ నైపుణ్యాలు సొంతమవడం ఖాయం. ఈ విషయంలో నిర్దిష్టంగా టాప్-200 జాబితాలోని గ్లోబల్ యూనివర్సిటీలు అని పేర్కొనడం వల్ల కచ్చితంగా మన విద్యార్థులకు మేలు జరుగుతుంది.
- డాక్టర్. డి.ఎన్. రెడ్డి, డెరైక్టర్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్

న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు తప్పనిసరి మంచి సిఫార్సు
దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు పొందే విధంగా చర్యలు తీసుకోవాలనే సిఫార్సు ఎంతో మంచిది. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యా సంస్థల గురించి ఆమూలాగ్ర సమాచారం లభిస్తుంది. అంతేకాకుండా విద్యా సంస్థల మధ్య కూడా ఆరోగ్యకరమైన పోటీ, వాతావరణం నెలకొంటుంది. అవి మంచి విద్యను అందించేందుకు కృషి చేస్తాయి. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించి భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.
- ప్రొఫెసర్. సంజయ్ దాండే, యూజీసీ సభ్యులు

నిర్దిష్టంగా సిఫార్సులు కనిపించట్లేదు
నూతన విద్యా విధానంలో అన్ని అంశాలను స్పృశించినా నిర్దిష్టంగా చేపట్టాల్సిన చర్యల గురించి కూడా సూచనలు చేస్తే బాగుండేది. ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్, అంగన్‌వాడీలను సమీప ప్రాంత స్కూళ్లతో మమేకం చేయడం వంటి సిఫార్సుల ఆచరణ కొంత క్లిష్టమైన వ్యవహారంగా కనిపిస్తోంది. అదే విధంగా ఉన్నత విద్యలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగానూ నూతన విద్యా విధానంలోని సిఫార్సులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తేనే తత్ఫలితాలు లభిస్తాయి.
- ప్రొఫెసర్. జి. హరగోపాల్, ప్రముఖ విద్యావేత్త

ఉపాధ్యాయ విద్య బలోపేతం హర్షణీయం
ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేసేలా సూచనలు, ఉపాధ్యాయులకు సైతం నిరంతర తాజా నైపుణ్యాలు అందించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలనే సిఫార్సులు హర్షణీయం. టీచర్ల నియామకాలపరంగా ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలనే సిఫార్సుతో టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
- ప్రొఫెసర్ సందీప్ పొన్నాల, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓయూ
Published date : 03 Sep 2016 12:31PM

Photo Stories