Skip to main content

నచ్చిన కోర్సులు ‘డిజిటల్‌ వేదిక’గా నేర్చుకునే మార్గాలు ఇవే..

నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ.. ఇప్పుడు మార్గాలు అనేకం! గతంలోలా కాలేజీకి, క్లాస్‌రూమ్‌కే వెళ్లి పాఠాలు వినాల్సిన అవసరంలేదు. స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. మన చేతి మునివేళ్ల మీదే ఎంతో సమాచారం అందుబాటులోకి వచ్చేసింది.
యాప్స్, యూట్యూబ్, వెబ్‌సైట్స్, బ్లాగ్స్, మూక్స్‌ వంటి టెక్‌ టీచర్‌లకు కొదవలేదు!! కంప్యూటర్, మ్యాథ్స్, లాంగ్వేజెస్, సైన్స్, సోషల్‌ లాంటి సంప్రదాయ కోర్సులతోపాటు మన మనసుకు నచ్చేవి కూడా డిజిటల్‌ వేదికగా నేర్చుకునే వీలుంది. ఫుడ్, యోగా,ఫ్యాషన్, మ్యూజిక్, ఇంగ్లిష్, జర్మన్, జపనీస్, స్పానిష్‌ వంటి విదేశీ భాషలు హాబీగా నేర్చుకోవడానికి వీలు కల్పిస్తున్న టెక్‌ టీచర్స్‌ గురించి తెలుసుకుందాం...

వహా వహా వంటలు :
కొత్త వంటలు నేర్చుకోవడం ఇప్పుడు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా అవసరంగా మారింది. రక రకాల రెసిపీలపై ప్రయోగాలు చేయాలనుకునే వారికి యూట్యూబ్‌లో లభించే కంటెంట్‌ ఎంతో ఉపయోగపడుతోంది. గ్రామీణ వంటకాలు,ఆరోగ్యకరమైన వంటలు, దేశ విదేశీ ఫుడ్స్, పాపులర్‌ స్ట్రీట్‌ ఫుడ్స్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఫుడ్‌లవర్స్‌కు, నేర్చుకోవాలనుకునే అభిరుచి ఉన్న వారికి యూట్యూబ్‌ మంచి టెక్‌ టీచర్‌ అని చెప్పొచ్చు. వంటల గురించి నేర్చుకోవాలను వారికి యూట్యూబ్‌లో ఎన్నో ఫుడ్‌ చానెల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లోనూ వంటలు నేర్పించే చానెల్స్‌ సంఖ్య పెరిగింది. తెలుగులోనూ రుచికరమైన వంటలు నేర్పించే చానెల్స్‌ ఎన్నో వచ్చేశాయి. కుకింగ్‌ కోర్సులు.. మూక్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు ఫీజులతో కుకింగ్‌ స్కిల్స్, హెల్తీ కుకింగ్‌ ఫండమెంటల్స్‌ నేర్చుకోవచ్చు. సంజీవ్‌ కపూర్‌ ఖజానా, వావ్‌ చెఫ్, టేస్టీ, నిషా మధులిక, కబితాస్‌ కిచెన్, గ్రాండ్‌పా కిచెన్, కంట్రీఫుడ్స్, స్ట్రీట్‌ఫుడ్, అత్తమ్మ టీవీ, మన వంటిల్లు, మన చెఫ్,గాయత్రి వంటిల్లు, రెసిపి టేబుల్, లతా చానెల్, హైదరాబాదీ రుచులు వంటి చానెల్స్‌ తెలుగు వారికి సుపరిచతం.

ఫిట్‌ నెస్‌ గురూ..
మిలీనియల్స్‌ యువత ఫిట్‌నెస్‌ మంత్రం జపిస్తోంది. అందుకోసం ఆరోగ్యకరమైన డైట్‌ గురించి గైడ్‌ చేసే యాప్స్‌ను ఆశ్రయిస్తోంది. అలాంటి వారికి హెల్తీ టిప్స్‌ అందించే ఫిట్‌నెస్‌ యాప్స్‌ ప్లేస్టోర్‌లో కోకొల్లలు. నామమాత్రపు ఫీజులతో డైట్‌ కోర్సులు, న్యూట్రిషన్‌ కోర్సుల్లో చేరొచ్చు. బరువు నియంత్రణలో ఉంచుకునే ఆన్‌లైన్‌ కోర్సులు కూడా చేయొచ్చు.

యోగా :
యోగా.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. గత కొన్నేళ్లుగా యోగాపై అవగాహన పెరుగుతూ వస్తోంది. దాంతో పలు ఇన్‌స్టిట్యూట్లు యోగా సంబంధిత డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నాయి. అయితే యాప్స్‌ వంటి టెక్‌ టీచర్స్‌ సాయంతో ఇంటివద్దే ఉండి ఆన్‌లైన్‌లోనూ యోగా నేర్చుకునే వీలుంది. యాప్స్, యూట్యూబ్‌ వీడియోల ద్వారా యోగాను ప్రాక్టీస్‌ చేయవచ్చు. వీటిల్లో చాలావరకు పెయిడ్‌ యాప్స్‌ ఉండగా.. యూట్యూబ్‌లో ఉచితంగా కొంత కంటెంట్‌ ఉంది. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే.. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారానే యోగాను సులువుగా దశల వారీగా నేర్చుకోవచ్చు. యోగా తరగతులకు రెగ్యులర్‌గా వెళ్లే వీలు లేని యువత ఇటువంటి యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. యాప్స్‌ పనిచేయాలంటే.. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం. అయితే ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే కొన్ని యాప్స్‌ను ఉపయోగించుకునే సౌకర్యం కూడా ఉంది. చాలా యాప్స్‌ ఉచితంగా ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా యోగాసనాల గురించి ఇమేజ్‌ల ద్వారా, వీడియోల ద్వారా చక్కగా నేర్చుకోవచ్చు.
  • యోగా విత్‌ అడ్రైన్‌లో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. చాలా వీడియోల ప్లే లిస్టులు చూడొచ్చు. ఉచితంగా వీటిని వీక్షించవచ్చు. ప్రారంభం నుంచి క్లాసులు వినవచ్చు.
  • ఎక్‌హార్ట్‌ యోగా యుట్యూబ్‌లో కూడా మనకు అనేక రకాల యోగా వీడియోలు లభిస్తున్నాయి. వీరి యాప్‌ కూడా అందుబాటులో ఉంది.
  • వీటితోపాటు మరెన్నో పెయిడ్, ఫ్రీ యాప్స్‌ను ప్లేస్టోర్‌లో చూడొచ్చు.
  • యోగా, మెంటల్‌ హెల్త్‌ పేరిట ఉన్న మూక్స్‌ కోర్సులను నేర్చుకోవచ్చు. యోగా ప్రాక్టీస్‌ పేరుతోనూ పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • స్వామి రాందేవ్‌ యూట్యూబ్‌ చానెల్‌లో యోగాకు సంబంధించి కంటెంట్‌ అందుబాటులో ఉంది.

మ్యూజిక్‌ :
మ్యూజిక్‌ సంబంధిత కోర్సులు కూడా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో నేర్చుకునే వీలుంది. నచ్చిన మ్యూజిక్‌ పరికరంపై పట్టు సాధించేందుకు పలు రకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి.
  • పియానో, గిటార్, వంటివి నేర్చుకోవడానికి యూజిషియన్‌ అనే యాప్‌ ఉపయోగపడుతుంది. కొత్తగా ప్రారంభించే వారికి ఇది వర్చువల్‌ టీచర్‌గా పనిచేస్తుంది.
  • గిటార్‌ నేర్చుకోవాలనుకుంటే.. గిటార్‌+అనే యాప్‌ ఉపయోగపడుతుంది. ఇందులో అభ్యర్థి ఇష్టాల మేరకు పర్సనలైజ్డ్‌ సర్వీసులున్నాయి.
  • పియానోను నేర్చుకోవాలనుకుంటే.. పియానో ఫ్రీ అనే యాప్‌ అందుబాటులో ఉంది.
  • డీజీ మ్యూజిక్‌ మిక్సర్‌ ఎడ్జింగ్‌ మిక్స్‌ యాప్‌ ద్వారా పాటల మిక్సింగ్‌కు అవకాశముంది.
  • రియల్‌ డ్రమ్‌.. సొంతంగా కంపోజింగ్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ దోహదపడుతుంది.

విదేశీ భాషలు :
ఇంగ్లిష్, జర్మన్, జపనీస్, స్పానిష్‌ వంటి వివిధ విదేశీ భాషలను నేర్పించే యాప్స్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కోకొల్లలు. ఆయా యాప్స్‌ ద్వారా ఉచితంగానే ఇంగ్లిష్‌తోపాటు కొత్త కొత్త భాషలు నేర్చుకునే వీలుంది.
Published date : 29 Oct 2019 02:22PM

Photo Stories