Skip to main content

మార్పుల దిశగా..యూజీసీ నెట్ !

అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించాలనుందా! జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌తో పరిశోధనల వైపు అడుగులు వేయాలనుందా! ఈ రెండిటిలో మీ మార్గం ఏదైనా యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)లో ప్రతిభ కనబరిస్తే సరిపోతుంది.
వచ్చే ఏడాది నుంచి నెట్ సిలబస్ సమూలంగా మారనుంది. నెట్ పరిధిలోని అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను మార్చి.. నూతన సిలబస్‌ను తీసుకొచ్చే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నెట్‌లో జరగనున్న మార్పులపై విశ్లేషణ..

యూజీసీ వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్‌తో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ దిశగా నూతన సిలబస్ రూపకల్పనప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సబ్జెక్టు నిపుణుల పేర్లను సిఫారసు చేయాలనియూనివర్సిటీలను కోరింది. ఇప్పటికే దేశంలోని చాలా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు.. సిలబస్, కరిక్యులంలో మార్పులు చేశాయి. ప్రస్తుతం తాజా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాదాపు అన్ని కోర్సుల సిలబస్‌లోనూ కొత్త అంశాలు కనిపిస్తున్నాయి. దీంతో యూజీసీ సైతం నెట్ సిలబస్‌ను తాజా అకడమిక్ సిలబస్‌కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించి, మార్పులకు శ్రీకారం చుట్టింది.

25 కమిటీల ఏర్పాటు :
ప్రస్తుతం నెట్‌ను 100 సబ్జెక్టుల్లో నిర్వహిస్తుండగా... ఇప్పటికే 25 సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులను సూచించేందుకు ఆయా సబ్జెక్టుల నిపుణులతో 25 కమిటీలు ఏర్పాటు చేసింది. ఇవి ప్రస్తుతం అకడమిక్‌గా అమలవుతున్న సిలబస్‌ను అధ్యయనం చేసి.. చేయాల్సినమార్పులను సిఫారసు చేస్తాయి. మిగిలిన సబ్జెక్టుల సిలబస్ రివ్యూ కమిటీల ఏర్పాటును మరో నెల లోపు పూర్తిచేయనున్నట్లు సమాచారం.

వృత్తి విద్యలో భారీ మార్పులు!
వృత్తి విద్యా కోర్సుల సిలబస్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఇంటర్నేషనల్ అండ్ ఏరియా స్టడీస్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఫోరెన్సిక్ సైన్స్ పేపర్లసిలబస్‌లో ఎక్కువ మార్పులు జరిగే అవకాశముంది.

ఏడాదికి ఒకసారే!
నెట్ నిర్వహణలోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యూజీసీ ప్రస్తుతం ఏటా రెండుసారు ్ల నెట్ నిర్వహిస్తోంది. అయితే, ఇక నుంచి ఏడాదికి ఒకసారే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సెషన్‌కు దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ, పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య మాత్రం లక్ష నుంచి లక్షా పదివేల మధ్యే ఉంటోంది. దీంతో రెండుసార్లు నిర్వహించడం అనవసరమనే అభిప్రాయానికి యూజీసీ వచ్చినట్లు తెలుస్తోంది. బహుశా ఈ విధానం 2019 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.

ఎన్‌టీఏ ద్వారా నిర్వహణ :
ప్రస్తుతం నెట్ నిర్వహణను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) చేపడుతోంది. వచ్చే ఏడాది నుంచి ఈ బాధ్యతను నూతనంగా ఏర్పాటుచేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జాతీయ స్థాయిలో సింగిల్ టెస్టింగ్ విండో తరహాలో తెరపైకొచ్చిన ఎన్‌టీఏ.. వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనుంది.

తొలి ఆరుశాతంతోనే మెరిట్..
ఇప్పటికే యూజీసీ రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా పరీక్షకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో (అన్ని వర్గాల నుంచి) మొదటి ఆరు శాతానికి సమానమైన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఉదాహరణకు లక్ష మంది పరీక్షకు హాజరైతే వారిలో తొలి ఆరు శాతం (అంటే ఆరువేల మంది) మందిని నెట్ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. వీరికే అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌నకు అర్హత లభిస్తుంది. ఇలా తొలి ఆరు శాతంలో నిలిచిన అభ్యర్థులనే ఉత్తీర్ణులుగా ప్రకటించాలనే నిర్ణయాన్ని విద్యావేత్తలు సైతం హర్షిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని యాజీసీ 2017, నవంబర్ సెషన్ నుంచి అమల్లోకి తెచ్చింది. తొలి ఆరు శాతంతో రూపొందిన మెరిట్ జాబితాలోని వారికి రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయనుంది. ఇప్పటి వరకు సబ్జెక్టు వారీగా, అభ్యర్థుల సామాజిక వర్గాల వారీగా టాప్-15 శాతంలో నిలిచిన వారితో జాబితా రూపొందించి, వారిని అర్హులుగా ప్రకటిస్తూ వచ్చింది.

జేఆర్‌ఎఫ్ ప్రక్రియ యథాతథం :
నెట్ అర్హతతో మొదటగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్ అర్హత లభిస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియలో మార్పులు చేస్తున్నప్పటికీ.. తర్వాత దశలో ఎంపిక చేసే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హుల ఎంపిక విధానం మాత్రం ప్రస్తుత తరహాలోనే కొనసాగుతుంది.

ముఖ్య సమాచారం..
  • మొత్తం అన్ని పేపర్లలోనూ సిలబస్ మార్పులకు శ్రీకారం.
  • ఇప్పటికే 25 సబ్జెక్టు కమిటీల ఏర్పాటు.
  • వృత్తి విద్యా సబ్జెక్టుల్లో అధికంగా మార్పులు జరిగే అవకాశం.
  • 2018 నుంచి ఏటా ఒక సారే నెట్ నిర్వహించే అవకాశం.

యూజీసీ నెట్ పరీక్ష విధానం...
యూజీసీ నెట్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తారు. వివరాలు..

సెషన్

పేపర్

మార్కులు

ప్రశ్నలు

వ్యవధి

1

1

100

50

1:15 గం॥

2

2

100

50

1:15 గం॥

3

3

150

75

2:30 గం॥

  • పేపర్-1 అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకూ ఒకే విధంగా ఉంటుంది. ఇందులో టీచింగ్ ఆప్టిట్యూడ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రెహెన్షన్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
  • పేపర్-2, 3లు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల ఆధారంగా ఉంటాయి. వీటిలో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
  • ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓబీసీ (నాన్-క్రీమీలేయర్) అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధిస్తే షార్ట్‌లిస్ట్ జాబితా రూపకల్పన ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు.

ఆహ్వానించదగ్గ పరిణామం...
యూజీసీ నెట్ సిలబస్‌లో మార్పులు చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీనివల్ల తాజా పరిస్థితులకు అనుగుణంగా బోధన, పరిశోధనా నైపుణ్యాలను పరీక్షించే అవకాశం లభిస్తుంది. ఇటీవల అభ్యర్థులు సైతం అకడమిక్‌గా కొత్త అంశాలను నేర్చుకుంటున్నారు. వాటిలో తమకున్న సామర్థ్యాన్ని బహిర్గతం చేసే అవకాశం కలుగుతుంది.
- డాక్టర్ డి.ఎన్.రెడ్డి, యూజీసీ మాజీ సభ్యులు, డెరైక్టర్ డాక్టర్ సీఆర్‌రావు ఏఐఎంఎస్‌సీఎస్.
Published date : 20 Dec 2017 03:39PM

Photo Stories