Skip to main content

కరోనా కాలంలో విదేశీ విద్య పరిస్థితి ఏంటి..?

కార్తీక్.. బీటెక్ పూర్తి చేశాడు. విదేశీ విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో జీఆర్‌ఈ, జీమ్యాట్ వంటి టెస్ట్ స్కోర్లు కూడా సొంతం చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన కొవిడ్ మహమ్మారి కారణంగా.. భవిష్యత్తు ప్రణాళికలకు బ్రేక్ పడిందనే ఆవేదన!!

ప్రదీప్.. యూకేలోని ఫాల్ సెమిస్టర్‌కు ఎంబీఏలో చేరాలనే ఉద్దేశం. కానీ కోవిడ్ కారణంగా నెలకొన్న నిబంధనలు, అంతర్జాతీయ విద్యార్థులు, ప్రయాణాలపై కొనసాగుతున్న నిషేధం వంటి కారణాలతో ఈ ఏడాది వృథా అయినట్లేనా? అనే ఆందోళన!

వీరిద్దరే కాదు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా..లక్షల మంది విదేశీ విద్య అభ్యర్థులందరిదీ ఇదే పరిస్థితి!! గ్రాడ్యుయేషన్ పట్టా చేతికందుతూనే స్టడీ అబ్రాడ్‌కు వెళ్లాలని ఎంతో మంది ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం తమకు నప్పే దేశాలు, యూనివర్సిటీలు, కోర్సుల గురించి అన్వేషణ సాగిస్తారు. కొవిడ్ తెచ్చిన ముప్పుతో ఏడాది వృథా చేసుకోవాల్సిందేనా..! అనే భావన ప్రస్తుతం వారందరిలో నెలకొంది. ఇలాంటి పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న పలు దేశాలకు చెందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, కన్సల్టెన్సీలు సరికొత్త మార్గంలో విదేశీ విద్య ఔత్సాహికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ సరికొత్త మార్గమే.. వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్!!

వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే..
సాధారణంగా విదేశీ విద్య అభ్యర్థులు తాము వెళ్లాలనుకుంటున్న దేశం,అక్కడి యూనివర్సిటీలు, ప్రవేశానికి అందుబాటులో ఉన్న అవకాశాలకు సంబంధించి కన్సల్టెన్సీలను సంప్రదిస్తుంటారు. వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయా యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులతో ఆన్‌లైన్ విధానంలోనే సంప్రదించి.. సదరు యూనివర్సి టీలో అందుబాటులో ఉన్న కోర్సులు.. వాటిలో తమకు సరితూగే ప్రోగ్రామ్‌లు, ఫీజులు, ఇతర అర్హతల వివరాలను తెలుసుకో వడానికి వీలు కల్పిస్తున్న ప్రక్రియే.. వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్!! పలు యూనివర్సిటీలు వర్చువల్ క్యాంపస్ టూర్స్ సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తెస్తూ... అక్కడి పరిస్థితులను విద్యార్థులు తెలుసుకునేలా చేస్తున్నాయి.

(ఇంకా చదవండి: part 2: విదేశీ విద్య కోసం వర్చువల్‌గా ఎడ్యుకేషన్ ఫెయిర్స్!)
Published date : 03 Oct 2020 05:29PM

Photo Stories