Skip to main content

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షలోమార్పులు..!

జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉన్నత వైద్యాధికారుల పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్‌ఈ) నిర్వహిస్తోంది.
ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుంటారు. తాజాగా సీఎంఎస్‌ఈ విధానంలో యూపీఎస్సీ మార్పులు చేసింది. వీటిని సీఎంఎస్‌ఈ-2018 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎంఎస్‌ఈలో మార్పులపై విశ్లేషణ..

సీఎంఎస్‌ఈ ద్వారా ఎంబీబీఎస్ అర్హతతో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్డ్డినెన్స్ ఫ్యాక్టరీస్, సెంట్రల్ హెల్త్ సర్వీసెస్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తదితర కీలక విభాగాల్లో వైద్యాధికారులుగా స్థిరపడొచ్చు. ఏటా సగటున 800 ఖాళీలతో యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య దాదాపు లక్ష వరకు ఉంటోంది.

జనరల్ ఎబిలిటీకి స్వస్తి...
ఆన్‌లైన్‌లో నిర్వహించే సీఎంఎస్‌ఈ-2018లో ప్రధాన మార్పు.. పేపర్-1లో జనరల్ ఎబిలిటీ విభాగాన్ని తొలగించడం. సీఎంఎస్‌ఈ.. రెండు పేపర్లుగా ఉంటుంది. మొదటి పేపర్ పార్ట్-ఎలో గత పరీక్ష వరకు జనరల్ ఎబిలిటీ విభాగంలో 30 ప్రశ్నలు ఉండేవి. తాజాగా జనరల్ ఎబిలిటీని తొలగిస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. మిగిలిన విభాగాలైన జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్‌కు సంబంధించిన అదనపు అంశాలతో కమిషన్ కొత్త సిలబస్‌ను ప్రకటించింది.

పేపర్-2 సిలబస్ విస్తృతం..
ఈ పేపర్‌లో సర్జరీ; గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్స్; ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ విభాగాలు ఉంటాయి. సీఎంఎస్‌ఈ-2018 మార్పుల్లో భాగంగా తాజాగా ఆయా విభాగాల సిలబస్‌ను విస్తృతం చేశారు. జనరల్ సర్జరీ విభాగంలో గత సిలబస్‌తో పోల్చితే కొత్తగా ఆరు అదనపు అంశాలు చేరాయి. గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్స్ సిలబస్ సైతం విస్తృతమైంది. గైనకాలజీలో ఐదు నూతన అంశాలు చేర్చారు. ఆయా అంశాలపై అభ్యర్థులు అకడమిక్, ప్రాక్టికల్ నైపుణ్యాలు పొందేలా సిలబస్‌ను రూపొందించారు. ప్రివెంటివ్ సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో సామాజిక ఆరోగ్య స్థితిగతులపై అభ్యర్థుల అవగాహనను పరీక్షించేలా నూతన అంశాలు చేర్చారు. మేనేజ్‌మెంట్ ఆఫ్ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఎబిలిటీ టు మానిటర్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ (జాతీయ ఆరోగ్య పథకాల పర్యవేక్షణ సామర్థ్యం), నాలెడ్జ్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ వెల్‌నెస్, ఎబిలిటీ టు రికగ్నైజ్, ఇన్వెస్టిగేట్, రిపోర్ట్, ప్లాన్ అండ్ మేనేజ్ కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్‌క్లూడింగ్ మాల్‌న్యూట్రిషన్ అండ్ ఎమర్జెన్సీస్ వంటి అంశాలను కొత్తగా చేర్చారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అభ్యర్థులు సబ్జెక్టుతోపాటు వైద్య, ఆరోగ్య విధానాలు, సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాల్సినఅవసరం ఏర్పడింది.

మూడేళ్లలో మరోసారి మార్పు...
2014 వరకు సీఎంఎస్‌ఈ పెన్-పేపర్ విధానంలో (అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌పై ఆన్సర్ చేసేలా) ఉండేది. యూపీఎస్సీ దీన్ని 2015 నుంచి కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ విధానంలోకి మార్చింది. ఈ ఏడాది నుంచి జనరల్ ఎబిలిటీకి స్వస్తి పలికి.. ఇతర విభాగాల ప్రశ్నల సంఖ్యను పెంచింది. కొత్తగా చేర్చిన అంశాలను పరిశీలిస్తే పూర్తిగా మెడికల్ సంబంధిత నైపుణ్యాలను పరీక్షించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు పూర్తిగా మెడికల్ రంగంలోనే సేవలందించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రంగంలోని తాజా స్థితిగతులు, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేలా పేపర్-2 పార్ట్-సి (ప్రివెంటివ్ సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్)లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, వాటి పర్యవేక్షణపై అవగాహన స్థాయి తదితర అంశాలను చేర్చారు.

విద్యార్థులకు కలిసొచ్చే అంశమే..
తాజా మార్పులు అభ్యర్థులకు అనుకూలమని చెప్పొచ్చు. గతేడాది వరకు 30 మార్కులకు ఉండే జనరల్ ఎబిలిటీ విభాగంలో అభ్యర్థులు మెడిసిన్‌తో సంబంధంలేని అంశాల (భారత సమాజం, సంస్కృతి, వారసత్వం, పాలిటీ, ఎకానమీ, అభివృద్ధి కార్యక్రమాలు, సహజ వనరులు తదితర)ను చదవాల్సి వచ్చేది. దాంతో అప్పటివరకు పూర్తిగా వైద్య సంబంధ అంశాలపై దృష్టిపెట్టిన అభ్యర్థులకు జనరల్ ఎబిలిటీ ప్రిపరేషన్ కష్టంగా ఉండేది. 2018 నుంచి ఈ విభాగాన్ని తొలగించడం అభ్యర్థులకు అనుకూలంగా మారనుంది.

సబ్జెక్టులపై లోతైన అవగాహన...
జనరల్ ఎబిలిటీ భారం నుంచి ఉపశమనం కల్పించిన యూపీఎస్సీ.. వైద్య సంబంధ విభాగాల సిలబస్‌ను విస్తృతం చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఔత్సాహిక అభ్యర్థులు అకడమిక్ అంశాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్స్, ప్రివెంటివ్ సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్‌ల పరంగా కాంటెంపరరీ అప్రోచ్‌తో సన్నద్ధం కావాలి. ఇప్పటి నుంచే ఆ దిశగా కృషిచేస్తే పరీక్షలో విజయావకాశాలను మెరుగుపరచుకొని పర్సనాలిటీ టెస్టుకు అర్హత పొందొచ్చు. ఆన్‌లైన్‌లో నిర్వహించే సీఎంఎస్‌ఈలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోతవిధిస్తారు.

సీఎంఎస్‌ఈ స్వరూపం (2018) :
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (500 మార్కులు)
పేపర్-1: 250 మార్కులు (120 ప్రశ్నలు, రెండు గంటలు).
పార్ట్-ఎ: జనరల్ మెడిసిన్-96 ప్రశ్నలు.
పార్ట్-బి: పీడియాట్రిక్స్-24 ప్రశ్నలు.
పేపర్-2: 250 మార్కులు (120 ప్రశ్నలు, రెండు గంటలు).
పార్ట్-ఎ: సర్జరీ (40 ప్రశ్నలు).
పార్ట్-బి: గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్స్ (40 ప్రశ్నలు).
పార్ట్-సి: ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (40 ప్రశ్నలు).

పర్సనాలిటీ టెస్ట్- 100 మార్కులు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్ట్‌కు పిలుస్తారు.
సీఎంఎస్‌ఈ-2018 షెడ్యూల్
నోటిఫికేషన్ వెల్లడి: ఏప్రిల్ 11, 2018.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 7, 2018.
పరీక్ష తేదీ (ఆన్‌లైన్ టెస్ట్): జూలై 22, 2018.
Published date : 15 Nov 2017 11:35AM

Photo Stories