Skip to main content

కేంద్రీయ విద్యాలయాల‌ల్లో అడ్మిష‌న్ పొంద‌డం ఎలా? దీని ప్రత్యేకతలు ఏమిటి?

ప్రభుత్వాలు ఉత్తమ పాఠశాలలు నడపగలవా అనే వారికి సమాధానం.. కేంద్రీయ విద్యాలయాలు! విద్యార్థులను ఆల్‌రౌండ్ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఘనత కలిగిన స్కూల్స్.. కేంద్రీయ విద్యాలయాలు!


ప్రస్థానం:
దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశ భద్రత(రక్షణ శాఖ) విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పిల్లల చదువుల కోసం 1963లో సెంట్రల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం వీటినే కేంద్రీయ విద్యాలయాలుగా మార్చారు. తదనంతర కాలంలో ఆర్మీ సొంతంగా పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసుకుంది. దీంతో కేవీల్లో అన్ని రకాల కేంద్ర సర్వీసు ఉద్యోగులకు, ఇతర కేటగిరీల వారికి కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు.

ప్రత్యేకతలు..
  • దేశవ్యాప్తంగా ఏకరీతి విద్యా విధానం.
  • ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో బోధన.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)కు అనుబంధం.
  • కో ఎడ్యుకేషన్, కాంపోజిట్ స్కూల్స్.
  • నిర్దేశిత టీచర్-స్టూడెంట్ రేషియో, అత్యుత్తమ విద్య.

ఉల్లాస భరితం..
ప్రాథమిక విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రీయ విద్యాలయ సంగటన్ 1994లో యశ్‌పాల్ టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించింది. ఆ కమిటీ కేవీల్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానంలో ఉల్లాసభరిత విద్య అందించాలని సూచించింది. కమిటీ సూచనలకు అనుగుణంగా కేంద్రీయ విద్యాలయాల్లో యాక్టివిటీ బేస్డ్ బోధనతోపాటు గ్రేడ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. గ్రేడ్ సిస్టమ్ ద్వారా విద్యార్థి అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.

ఒత్తిడి లేని విద్య :
పిల్లలను స్కూలుకు అలవాటు చేయడంలో తల్లిదండ్రులు, స్కూలు పాత్ర కీలకం. ఇంటి నుంచి స్కూలుకు వెళ్లే దశ సాఫీగా సాగాలి. అలాకాని పక్షంలో పిల్లల్లో స్కూలుపై వ్యతిరేక భావన ఏర్పడే ఆస్కారముంది. అది భవిష్యత్ అభ్యసనపై ప్రభావం చూపుతుంది. దీన్ని గుర్తించిన కేంద్రీయ విద్యాలయాలు కొత్తగా చేరే పిల్లలు స్కూల్ వాతావరణానికి అలవాటుపడేలా చేసేందుకు ఆరు వారాల వ్యవధితో ‘స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్’ను రూపొందించాయి. ఈ ప్రోగ్రామ్ పూర్తయిన అనంతరం టీచర్లు విద్యార్థుల్లో కింది దృక్పథాల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయా లేదా అనే విషయాలను పరీక్షిస్తారు.

అవి..
  • పరిసరాలను అర్థంచేసుకోవడం
  • ఆత్మవిశ్వాసం
  • పరిశీలన
  • పరస్పర సంబంధాలు
  • వర్గీకరణ
  • ప్యాట్రన్‌లను అర్థంచేసుకొని, అనుకరించ గలగడం
  • భావవ్యక్తీకరణ
  • అవగాహన
  • క్రియేటివ్ స్కిల్స్.

ప్రాధాన్య క్రమంలో ప్రవేశాలు..
కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తం 5 కేటగిరీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కేటగిరీలకు ప్రాధాన్య క్రమంలో పరిగణనలోకి తీసుకుంటారు.
  1. బదిలీయైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలు.
  2. కేంద్ర ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (కేంద్ర ప్రభుత్వ వాటా 51 శాతం) సంబంధించి బదిలీయైన, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
  3. బదిలీయైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు.
  4. రాష్ట్ర ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంబంధించి బదిలీయైన, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
  5. విదేశీ అధికారుల పిల్లలు, ఇతర కేటగిరీల వారి పిల్లలు

వయసు :
  • ఒకటో తరగతి: 5-7 ఏళ్లు
  • రెండో తరగతి: 6-8 ఏళ్లు
  •  మూడో తరగతి: 7-9 ఏళ్లు
  • నాలుగో తరగతి: 8-10 ఏళ్లు
  •  ఐదోతరగతి: 9-11 ఏళ్లు
  •  ఆరోతరగతి: 10-12 ఏళ్లు
  •  ఏడో తరగతి: 11-13 ఏళ్లు
  •  ఎనిమిదో తరగతి: 12-14 ఏళ్లు
  •  తొమ్మిదో తరగతి: 13-15 ఏళ్లు
  • పదోతరగతి: 14-16 ఏళ్లు.
  • పీడబ్ల్యూడీ విద్యార్థులకు రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది.

రిజర్వేషన్: ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 7.5 శాతం సీట్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.

ఫీజులు :
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ ఫీజు రూ. 25. విద్యాలయ వికాస నిధి (రూ.500), ట్యూషన్ ఫీజు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ తదితర ఫీజులు ఉంటాయి. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు అన్ని ఫీజులు కలిపి నెలకు రూ.500-600, ఆరోతరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు రూ.1000లోపు అవుతుంది. బాలికలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. 
 వెబ్‌సైట్: https://kvsangathan.nic.in  

యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ :
కేంద్రీయ విద్యాలయాల్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. పుస్తకాల్లో ఉన్న కాన్సెప్టులను బట్టీ పట్టించకుండా... విద్యార్థుల్లో స్వీయ ఆలోచనా శక్తి, అధ్యయనాలను ప్రోత్సహించేలా బోధన సాగుతుంది. ప్రతి శనివారం ‘ఫన్ డే’ ప్రోగ్రామ్ నిర్వహిస్తాం. ఆ రోజంతా పిల్లలకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, రిక్రియేషన్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ తరహా విధానంతో పిల్లలపై ఒత్తిడి తగ్గి..వారిలో స్వేచ్ఛా ఆలోచన పెంపొందుతుంది. కేవీల్లో దేశ నలుమూలల నుంచి విద్యార్థులు ఉంటారు. అందుకే వీటిని ‘మినీ ఇండియా’లుగా పిలుస్తారు. విద్యార్థుల వైవిధ్యత కారణంగా పిల్లలకు ప్రాథమిక స్థాయిలోనే భాష, సాంస్కృతిక, సామాజిక వైవిధ్యాలు అలవడతాయి. స్కూల్ డే రోజు ఆయా ప్రాంతాల్లోని పండుగలు, కార్యక్రమాలు నిర్వహిస్తాం. తద్వారా పిల్లలకు ఆయా ప్రాంతాల సంస్కృతిపై అవగాహన లభిస్తుంది. విద్యార్థులను ఆల్‌రౌండర్లుగా తీర్చిదిద్దడంలో కేవీలు తమదైన కృషిచేస్తున్నాయి.
- పి.శ్రీనివాసరాజు, ప్రిన్సిపల్, కేంద్రీయ విద్యాలయం 1, ఉప్పల్.
Published date : 28 Feb 2019 04:46PM

Photo Stories