Skip to main content

కౌన్సెలింగ్‌కు దూరంగా..టాప్ ర్యాంకర్లు ?

ఎంసెట్ కౌన్సెలింగ్ (ఇంజనీరింగ్)..రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందే మొదలైంది! అంతేకాదు జేఈఈ మెయిన్, అడ్వాన్‌‌సడ్ ర్యాంకుల ఆధారంగా.. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే..‘జోసా’ కౌన్సెలింగ్ కంటే ముందుగానే పూర్తవనుంది! గతంలో ఎంసెట్ కౌన్సెలింగ్, జోసాతో పోలిస్తే ఆలస్యంగా జరిగేది.

కాని ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ కౌన్సెలింగ్‌తో పాటు సీటు అలాట్‌మెంట్ సైతం ముందే ముగియనుంది.. ఇదే ఇప్పుడు అటు జేఈఈ మెయిన్‌తోపాటు ఇటు ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కొంత ఒత్తిడికి గురిచేస్తోంది!

గతేడాది వరకు జాతీయ స్థాయిలో ఐఐటీలు, నిట్‌లలో ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం దశలోనే ఉండేది. దాంతో జేఈఈ- మెయిన్, అడ్వాన్‌‌సడ్‌లో మంచి ర్యాంకులు పొందిన విద్యార్థులు ఎన్‌ఐటీలు, ఐఐటీలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అక్కడ అడ్మిషన్ లభించని విద్యార్థులు మాత్రం ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్ర స్థాయి కాలేజీల్లో చేరిపోయేవారు. కానీ ఈ ఏడాది పరిస్థితి మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుగానే అంటే మే 25వ తేదీ నుంచే ప్రారంభమైంది. ఏపీలో జూన్ 5న, తెలంగాణలో జూన్ 8న తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. ఆ తర్వాత మరో వారం రోజుల్లోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి,సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే సీటు రద్దవుతుంది. ఇదే ఇప్పుడు విద్యార్థులకు సమస్యగా మారింది.

సమస్య ఏమిటి ?
నిట్‌ల్లో ప్రవేశానికి వీలు కల్పించే జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలైనా.. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అదేవిధంగా ఐఐటీల్లో అడ్మిషన్‌‌స కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్‌‌సడ్ ర్యాంకులు జూన్ 10న విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా..ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి కౌన్సెలింగ్ ప్రక్రియ ‘జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ)’ జూన్ మూడో వారంలో ప్రారంభం కానుంది. ఈ పరిస్థితుల్లో జేఈఈ-మెయిన్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులతోపాటు అడ్వాన్‌‌సడ్‌లో మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్న విద్యార్థులు..తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ముందుగానే నిర్వహిం చడంపై కొంత ఆందోళనగా ఉన్నారు.

ఆర్థిక భారం :
జేఈఈ మెయిన్‌లో ర్యాంకుతోపాటు ఎంసెట్‌లోనూ మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులు ప్రస్తుతం జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటే.. ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. కాని ఎంసెట్ కౌన్సెలింగ్‌లో సీటు లభించిన విద్యార్థులు.. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి జూన్ 12లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ ఫీజు టాప్-10లో నిలిచిన ప్రైవేటు కళాశాలల్లో దాదాపు రూ.లక్ష వరకు ఉంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసేలోపు సదరు సీటు రద్దు చేసుకుంటే.. ఫీజు రిఫండ్ చేసే విధానం అమల్లో ఉన్నప్పటికీ.. రూ.వేలల్లో వదులుకోవాల్సిన పరిస్థితి.

గతేడాది ఇలా..
గతేడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలిస్తే.. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ జూన్ 8న ప్రారంభమై.. జూన్ 23 సీట్ అలాట్‌మెంట్ జరిగింది. విద్యార్థులకు సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం జూన్ 29 వరకు గడువిచ్చారు. అలాగే టీఎస్ ఎంసెట్ జూన్ 12న ప్రారంభమై.. జూన్ 28న సీట్ అలాట్‌మెంట్ జరిగింది. గతేడాది అప్పటికే జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 20నాటికి మొదటి దశ కౌన్సెలింగ్, మాక్ సీట్ అలొకేషన్ వివరాలు సైతం అందుబాటులో ఉంచారు. జూన్ 28న సీట్ అలాట్‌మెంట్ చేసి.. విద్యార్థులు తాము సీటు పొందిన ఐఐటీ లేదా ఎన్‌ఐటీల్లో రిపోర్టింగ్ చేసేందుకు జూలై 3 వరకు గడువిచ్చారు. దాంతో గతేడాది ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నప్పటికీ.. జోసా కౌన్సెలింగ్ తేదీలు అనుకూలంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. కాని ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి నెలకొంది. జేఈఈ అడ్వాన్‌‌సడ్ ఫలితాలు వెల్లడయ్యే సమయానికే రెండు రాష్ట్రాల్లో ఎంసెట్ సీట్ అలాట్‌మెంట్ ఖరారవుతున్న పరిస్థితి. జోసా ద్వారా ఐఐటీలు, నిట్‌ల్లో సీటు వస్తుందని ఆశించి.. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే... ఆ తర్వాత అక్కడ కోరుకున్న కాలేజీ/బ్రాంచ్‌లో సీటు రాకుంటే.. రెండు చోట్లా నష్టపోవాల్సిన ఉంటుంది. ఒకవేళ ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీటు పొంది ఫీజు చెల్లిస్తే... జోసాలో మంచి కాలేజీలో సీటు వచ్చి అక్కడ చేరాలనుకుంటే... ఇక్కడ ఫీజు నష్టపోవాల్సి వస్తుంది.

ఎంతమందిపై ప్రభావం :
తాజాగా విడుదల చేసిన జేఈఈ-మెయిన్ ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటే.. జేఈఈ- మెయిన్‌లో మంచి ర్యాంకులు సాధించి.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సీటు లభించే అవకాశమున్న తెలుగు విద్యార్థుల సంఖ్య వేలల్లోనే ఉంది. అడ్వాన్‌‌సడ్‌కు అర్హత సాధించిన వారి సంఖ్యే ఆరు వేల వరకు ఉంది. ఎంసెట్ ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.44 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో రెండు ఎంసెట్‌లకు హాజరైన వారి సంఖ్య ఇరవై శాతం ఉంటుందని అంచనా. జేఈఈ-మెయిన్‌లో అర్హత సాధించిన వారితోపాటు మరో పది వేల మంది వరకు.. జాతీయ స్థాయిలోని ఇతర ప్రముఖ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు, డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశాల దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ డీమ్డ్ టు బి యూనివర్సిటీలు నిర్వహించిన పరీక్షల్లో విజయం సాధించిన పలువురు విద్యార్థులు అడ్మిషన్ లెటర్స్ సైతం అందుకుంటున్నారు.

జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లకే మొగ్గు !
ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించి రాష్ట్ర స్థాయిలో మంచి కాలేజీలో సీటు లభించే అవకాశం ఉన్న విద్యార్థులు కూడా జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లవైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ గణాంకాలనే పరిగ ణనలోకి తీసుకుంటే.. తొలి దశలో యూనివర్సిటీ కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కానీ.. తుది దశ కౌన్సెలింగ్‌లో ఆ సంఖ్య తగ్గడం గమనార్హం. యూనివర్సిటీ కళాశాలల్లో 17 సీట్లు మిగిలిపోయాయి. వర్సిటీ కళాశాలల్లో ఎంసెట్ తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులు.. జోసా తదుపరి రౌండ్లలో సీటు సాధించి జాతీయ ఇన్‌స్టిట్యూట్‌ల్లో చేరిపోవడం ఇందుకు కారణం.

రెండు రాష్ట్రాల్లో..
విద్యార్థులను వేధిస్తున్న మరో సమస్య.. ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించడం. దీంతో టాప్ ర్యాంకులు సాధించి.. ఓపెన్ కేటగిరీ(నాన్-లోకల్) కోటాలో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ ఖరారు చేసుకుందామనుకునే విద్యార్థులకు ఇది సమస్యగా మారింది.

కౌన్సెలింగ్‌కు దూరంగా...
మరోవైపు ఎంసెట్ టాప్ ర్యాంకర్లు.. ఇప్పటికే కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణలో వంద ర్యాంకుల్లోపు ముగ్గురు మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావడమే ఇందుకు నిదర్శనం. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జేఈఈ-మెయిన్, అడ్వాన్‌‌సడ్‌లో మంచి ర్యాంకులతో ఉత్తమ కాలేజీల్లో సీటు లభిస్తుందనే నమ్మకమున్న విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావట్లేదు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పదివేల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో దాదాపు 60 శాతం మంది కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు.

జోసా తర్వాత నిర్వహిస్తే మేలు !
ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ముందుగా నిర్వహించడంపై సానుకూలత వ్యక్తమవుతున్నప్పటికీ.. జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ తర్వాత కనీసం తొలి దశ సీటు అలాట్‌మెంట్ జరిగే వరకు అయినా వేచి ఉండి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో సీటు ఖరారు విషయంలో స్పష్టత లభించేదంటున్నారు. ఇప్పుడు జోసా ప్రక్రియ కంటే ముందే ఎంసెట్ సీట్ అలాట్ మెంట్ జరగడం వల్ల ఇక్కడి టాప్ కళాశాలల్లో సీటు వచ్చినా.. చేరాలా?వద్దా? అనే అంతర్మథనం చెందాల్సిన పరిస్థితి. మరోవైపు గతేడాది ఆయా కళాశాలల్లో ప్రవేశం లభించిన ర్యాంకుల ఆధారంగా.. విద్యార్థులు ఈ ఏడాది తాము పొందిన ర్యాంకులు-సీటు లభించే అవ కాశమున్న కళాశాలల విషయంలో స్పష్టత తెచ్చుకునే అవకాశముందని.. కాబట్టి ఎంసెట్ కౌన్సెలింగ్‌ను జోసాతో పోల్చడం సరికాదని కౌన్సెలింగ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Published date : 06 Jun 2018 12:06PM

Photo Stories