ఇంజనీరింగ్‌లో పాపులారిటీ ఉన్న కోర్సులు ఇవే.. విద్యార్థుల ఓటు వాటికే..
ముఖ్యంగా టాపర్‌లు ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్‌లో చేరుతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీల్లో ప్రవేశ ప్రక్రియను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) చేపడుతుంది. తాజాగా జోసా 6రౌండ్ల సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ నేపథ్యంలో.. టాపర్స్ మొగ్గుచూపిన బ్రాంచ్‌లు, ఇన్‌స్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాం...
మొత్తం 23 ఐఐటీల్లో 16,053 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 2,470 సూపర్ న్యూమరరీ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు జోసా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీలు), గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్స్ (జీఎఫ్‌ఐ టీలు)ల్లో 50,822సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. గతేడాది కౌన్సెలింగ్‌ను 7 రౌండ్లుగా నిర్వహించగా.. కొవిడ్–19 దృష్ట్యా ఈ సంవత్సరం 6 రౌండ్లకు పరిమితం చేశారు.
టాప్ 3 ఐఐటీలు..
జోసా–2020 కౌన్సెలింగ్‌లో ఎప్పట్లానే టాపర్లు ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్‌లవైపే మెగ్గుచూపారు. టాప్ 100తోపాటు టాప్ 1000లోని ఎక్కువ మంది ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్‌ల్లోనే చేరారు. ఈసారి ఐఐటీ ఖరగ్‌పూర్,ఐఐటీ కాన్పూర్.. టాప్100 ర్యాంకర్స్‌ను ఆకర్షించడంలో విఫల మయ్యాయి. టాప్ 1000 ర్యాంకర్స్‌ను చూసినా.. ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ ముందంజలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ నిలిచాయి. వీటి తర్వాత ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువహటి, ఐఐటీ హైదరాబాద్‌లు టాప్ 1000లోని ర్యాంకర్స్‌ను ఆకర్షించాయి.
ర్యాంకర్స్ అడ్డా ఐఐటీ బాంబే..
ఐఐటీల్లోకెల్లా ప్రత్యేకంగా నిలుస్తోంది.. ఐఐటీ బాంబే! దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018లో దీనికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా ఇచ్చింది. ఐఐటీ ముంబైలో 15 డిపార్ట్‌మెంట్‌లు, 20 మల్టిడిసిప్లినరీ సెంటర్లు, 1 స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్లు ఈసారి కూడా ఐఐటీ బాంబేకే ఓటేశారు. జోసా రౌండ్–1 సీట్ల కేటాయింపును పరిశీలిస్తే.. అన్ని కేటగిరీలకు చెందిన టాప్ ర్యాంకర్లు ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివేందుకు మొగ్గుచూపారని తెలుస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్–2020 ఆలిండియా టాపర్ చిరాగ్ ఫాలర్.. మిట్‌లో చదివేందుకు ఇష్టపడగా..ఆలిండియా టాపర్2 మాత్రం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకున్నాడు. టాప్ 100 ర్యాంకుల్లో 61 మంది ఐఐటీ బాంబేలో చేరారు. గతేడాది ఈ సంఖ్య 64గా ఉంది.
ప్లస్ పాయింట్స్: ఐఐటీ బాంబేలో నాణ్యమైన బోధన; పటిష్టమైన రీసెర్చ్ వర్క్, వైవిధ్యభరితమైన మల్టి డిసిప్లినరీ కోర్సులు;అత్యుత్తమ ప్లేస్‌మెంట్ రికార్డు; తొలి ఏడాది మంచి జీపీఏ పొందిన విద్యార్థులకు రెండో సంవత్సరం ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను మార్చుకొనే వెసులుబాటు ఉండటం;ఆహ్లాదకరమైన క్యాంపస్ వంటివి టాపర్స్‌ను ఆకర్షిస్తున్నట్లు చెప్పొచ్చు.
ఐఐటీ ఢిల్లీ..
1961లో ప్రారంభించిన ఐఐటీ ఢిల్లీలో 15 డిపార్ట్‌మెంట్‌లు, 11 మల్టీడిసిప్లినరీ సెంటర్లు, 5ఎక్స్‌లెన్స్ స్కూల్స్, 14ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఉన్నాయి. బీటెక్, డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంఎస్(ఆర్), ఎంబీఏ, ఎండీ ఈఎస్, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సులను ఐఐటీ ఢిల్లీ అందిస్తోంది. జేఈఈ టాపర్స్‌ను దక్కించుకునే విషయంలో ఐఐటీ బాంబేతో పోటీ పడుతోంది. టాప్ 100 ర్యాంకర్లలో 30 మంది ఐఐటీ ఢిల్లీని ఎంచుకున్నారు. ఐఐటీ ఢిల్లీలో.. ఓపెన్ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ ఓపెనింగ్ ర్యాంకు 31 కాగా క్లోజింగ్ ర్యాంకు 105గా ఉంది.
ఐఐటీ మద్రాస్..
ఉన్నత సాంకేతిక విద్య, బేసిక్ అండ్ అప్లయిడ్ రీసెర్చ్ పరంగా దేశంలోనే అత్యుత్తమ, జాతీయ ప్రాధాన్యతా ఇన్‌స్టి ట్యూట్‌గా ఐఐటీ మద్రాస్ గుర్తింపు పొందింది. ప్రస్తుతం 16అకడెమిక్ డిపార్ట్‌మెంటులు, ఇంజనీరింగ్, ప్యూర్‌సైన్స్‌కు సంబంధించి పలు అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో అగ్రభాగంలో నిలుస్తున్న ప్పటికీ.. ర్యాంకర్లను ఆకర్షించడంలో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీలతో పోల్చితే వెనుకంజలో ఉంది. ఈ సంవత్సరం టాప్ 100 ర్యాంకర్లలో ఏడుగురు ఐఐటీ మద్రాస్‌ను ఎంచుకు న్నారు. ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ ఓపెనింగ్ ర్యాంకు 49 కాగా, క్లోజింగ్ ర్యాంకు 157గా ఉంది.
కంప్యూటర్ సైన్సే కింగ్!
ఐఐటీలైనా, ఎన్‌ఐటీలైనా అభ్యర్థుల తొలి ఛాయిస్ కంప్యూటర్ సైన్సే అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఐఐటీ బాంబేలో కంప్యూటర్స్ సైన్స్ ఓపెనింగ్ ర్యాంకు 2 కాగా, క్లోజింగ్ ర్యాంకు 63గా ఉంది. టాప్ ర్యాంకర్స్‌లో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌నే ఎంచుకుంటున్నారు.
ఐఐటీలు–క్రేజీ బ్రాంచ్‌లు
- ఐఐటీ బాంబే: కంప్యూటర్ సైన్స్; ఎలక్ట్రికల్; మెకానికల్;ఏరోస్పేస్ ఇంజనీరింగ్.
- ఐఐటీ ఢిల్లీ: కెమికల్, కంప్యూటర్ సైన్స్; సివిల్ ఇంజనీరింగ్; మెకానికల్; ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్.
- ఐఐటీ మద్రాస్: ఏరోస్పేస్ ఇంజనీరింగ్; ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్; బయో టెక్నాలజీ; ఇంజనీరింగ్ ఫిజిక్స్; సివిల్ ఇంజనీరింగ్.
- ఐఐటీ ఖరగ్‌పూర్: ఏరోస్పేస్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్; ఆర్కిటెక్చర్ అండ్ రీజనల్ ప్లానింగ్; ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నేవల్ ఆర్కిటెక్చర్.
- ఐఐటీ కాన్పూర్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; సివిల్ ఇంజనీరింగ్; ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్; మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; మెకానికల్ ఇంజనీరింగ్.
నిట్‌ల విషయానికి వస్తే.. టాపర్‌లను ఆకర్షించడంలో..
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూరత్‌కల్
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలహాబాద్ ముందు నిలుస్తున్నాయి.