Skip to main content

ఇక‌పై గేట్ అంద‌రూ రాయొచ్చు.. స‌మాచారం తెలుసుకోండిలా..

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌.. సంక్షిప్తంగా గేట్‌!ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌సీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఇటీవల కీలక మార్పులతో గేట్‌ 2021 నోటిఫికేషన్‌ వెలువడింది. ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌తోపాటు ఇకపై ఆర్ట్స్‌/కామర్స్‌/సైన్స్‌లలో బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్థులు కూడా గేట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించారు. అందుకోసం కొత్తగా హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌సైన్సెస్‌కు సంబంధించి పేపర్‌ ప్రవేశపెట్టారు. అదే విధంగా ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం విద్యార్థులు కూడా గేట్‌కు హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు ఆరు రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో గేట్‌ పరీక్ష జరుగనుంది. ఈ నేపథ్యంలో గేట్‌–2021లో ప్రవేశ పెట్టిన కీలక మార్పులు, పరీక్ష విధానం, గేట్‌తో ప్రయోజనాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ..

గేట్‌ రాసేందుకు ఇంతకాలం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మాత్రమే అర్హత ఉండేది.  ఇప్పుడు  బీటెక్‌/బీఈతోపాటుæ మూడేళ్ల వ్యవధిలో ఉండే ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌ డిగ్రీల విద్యార్థులు కూడా గేట్‌కు హాజరుకావచ్చు. గేట్‌ పరీక్షతో ప్రయోజనాలు అనేకం. ముఖ్యంగా ఐఐటీలు, నిట్‌లు వంటి ప్రముఖ ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్, పీహెచ్‌డీల్లో ప్రవేశం పొందొచ్చు. అలాగే గేట్‌ స్కోర్‌తో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల నిబంధనల మేరకు  స్కాలర్‌షిప్‌/అసిస్టెంట్‌షిప్‌ లభిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు కూడా గేట్‌ స్కోర్‌ ఉపయోగపడుతుంది. గేట్‌ స్కోర్‌కు మూడేళ్ల పాటు వాలిడిటీ ఉంటుంది.

పేపర్ల సంఖ్య 27కు పెంపు..

గేట్‌–2020లో 25 పేపర్లకే పరీక్ష నిర్వహించగా.. గేట్‌–2021లో ఆ సంఖ్య 27కు పెంచారు. అదనంగా రెండు పేపర్లను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ పేపర్, కాగా మరొకటి హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌సైన్సెస్‌(ఎక్స్‌హెచ్‌) పేపర్‌. 

హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎందుకు?

ఇంజనీరింగ్‌ విద్యను అందించే ఐఐటీలు హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ పేపర్‌ను ప్రవేశ పెట్టడం ఏమిటి? అనే ఆలోచన కలగడం సహజమే. ప్రస్తుతం పలు ఐఐటీలు పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో హ్యుమానిటీస్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటీ చెన్నై, గువహటిలలో డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో ఎంఏ కోర్సు ఉంది. అదే విధంగా ఐఐటీ గాంధీనగర్‌లో సైకాలజీ అండ్‌ సోషియాలజీలో పీజీ కోర్సు అందిస్తున్నారు. ఇలా పలు ఐఐటీలు ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌లో పీజీ స్థాయిలో కోర్సులు అందిస్తూ.. వాటిలో ప్రవేశానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించడం లేదా యూజీసీ–నెట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పించడం జరుగుతోంది. ఇలా కాకుండా ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలనే ఐఐటీ వర్గాల ఆలోచన కారణంగా హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ పేపర్‌ను కూడా గేట్‌లో చేర్చారు.  హ్యుమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చదివిన అభ్యర్థులు ఎక్స్‌హెచ్‌ పేపర్‌ పేరుతో ఎకనామిక్స్‌/ఇంగ్లిష్‌/లింగ్విస్టిక్స్‌/ సోషియాలజీ/సైకాలజీ/ఫిలాసఫీ సబ్జెక్ట్‌లలో పరీక్షకు హాజరు కావచ్చు.  అభ్యర్థులు ఏ సబ్జెక్ట్‌కు హాజరవ్వాలనుకుంటున్నారో దరఖాస్తు సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది.

హ్యుమానిటీస్‌తో స్కాలర్‌షిప్‌ అవకాశం..

గేట్‌ 2021లో హ్యుమానిటీస్‌ పేపర్‌ను ప్రవేశ పెట్టడం వల్ల ఇంజనీరింగ్‌ విద్యార్థులకు లభించినట్లే..  హుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ అభ్యర్థులు సైతం స్కాలర్‌షిప్‌ సదుపాయం పొందే వీలుంటుంది. ఇప్పటి వరకు విద్యార్థులు ఆయా ఐఐటీలు వేర్వేరుగా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్‌ ఖరారు చేసుకుంటున్నా.. ఎలాంటి ఆర్థిక చేయూత లభించట్లేదు.

మూడో సంవత్సరం విద్యార్థులూ అర్హులే..

ఇప్పటి వరకు బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థులకే గేట్‌కు అర్హత ఉండేది. తాజాగా గేట్‌–2021లో బీటెక్‌ మూడో సంవత్సరం(ప్రీ ఫైనల్‌ ఇయర్‌) విద్యార్థులకు కూడా  అవకాశం కల్పించారు. ఫలితంగా మూడో సంవత్సరంలోనే గేట్‌కు హాజరై మంచి స్కోర్‌ రాకుంటే.. బలాలు, బలహీనతలు బేరీజు వేసుకొని, ఫైనలియర్‌లో మరోసారి గేట్‌కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.  గేట్‌ స్కోర్‌కు మూడేళ్ల వాలిడిటీ ఉండటం వల్ల  మూడో సంవత్సరంలోనే మంచి స్కోర్‌ తెచ్చుకుంటే.. చివరి సంవత్సరంలో పూర్తి స్థాయిలో అకడెమిక్స్, ప్లేస్‌మెంట్స్‌పై దృష్టి పెట్టే సమయం లభిస్తుంది. 

రెండు పేపర్లకు అనుమతి..

గేట్‌–2021 పరంగా మరో ప్రధాన మార్పు.. ఇంజనీరింగ్‌ అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశంకల్పించడం. ఇంతకాలం ఒక పేపర్‌కు మాత్రమే అర్హత ఉండేది. ఇంటర్‌ డిసిప్లినరీ దృక్పథాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాజాగా కోర్‌ సబ్జెక్ట్‌తోపాటు మరో సబ్జెక్ట్‌ను కూడా ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. అభ్యర్థులు బీటెక్‌లో చదివిన కోర్‌ సబ్జెక్ట్‌ను బట్టి అర్హత ఉన్న మరో సబ్జెక్ట్‌ను గేట్‌ నిర్వాహక కమిటీ నిర్ధారించింది. దీంతో అభ్యర్థులు ఆ నిర్దిష్ట సబ్జెక్ట్‌నే రెండో పేపర్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. 

పరీక్ష విధానం..

  1.     గేట్‌ పరీక్ష మొత్తం మూడు గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది.
  2.     మొత్తం 65 ప్రశ్నలను 100 మార్కులకు అడుగుతారు.
  3.     జనరల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఎంచుకున్న సబ్జెక్టుకు 85 మార్కులు కేటాయించారు. 

ఎంసీక్యూ, ఎంఎస్‌క్యూ, ఎన్‌ఏటీ  ప్రశ్నలు..

గేట్‌లో అన్ని పేపర్లలోనూ ఎంసీక్యూ(బహుళైచ్ఛిక), ఎంఎస్‌క్యూ(మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌), ఎన్‌ఏటీ(న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌) ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌ విధానంలో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సమాధానంగా ఉండే ప్రశ్నలు ఎదురవుతాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. సంబంధిత టాపిక్‌పై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి.

ఎక్స్‌హెచ్‌ పేపర్‌ స్వరూపం..

  1.     గేట్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ పేపర్‌ కూడా 65 ప్రశ్నలతో వంద మార్కులకు నిర్వహిస్తారు. 
  2.     ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 10 ప్రశ్నలు 15 మార్కులకు ఉంటాయి. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు అడుగుతారు.
  3.     రీడింగ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ విభాగం పేరుతో 25 మార్కులకు పదిహేను ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అయిదు ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు 10 ఎదురవుతాయి.
  4.     సబ్జెక్ట్‌ కొశ్చన్స్‌ విభాగం నుంచి 40 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. వీటిలో ఒక మార్కు ప్రశ్నలు 20, రెండు మార్కుల ప్రశ్నలు 20 అడుగుతారు. 

బేసిక్స్‌పై పట్టు..

గేట్‌లో బెస్ట్‌ స్కోర్‌ సాధించి ఐఐటీల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసుకోవాలంటే.. అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌ వరకూ.. అన్ని విషయాలపై అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి. అప్పుడే ప్రశ్న ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి టాపిక్‌కు సంబంధించి ప్రాథమిక భావనలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి.

సిలబస్‌పై స్పష్టత..

గేట్‌ ప్రిపరేషన్‌ పరంగా అభ్యర్థులు ముందుగా సిలబస్‌ను ఆసాంతం పరిశీలించి స్పష్టత తెచ్చుకోవాలి. ఆ తర్వాత గేట్‌ సిలబస్‌ను అకడమిక్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ.. ప్రిపరేషన్‌ సాగించాలి. వీక్లీ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా మేలు చేస్తుంది. 

ఆన్‌లైన్‌ టూల్స్‌పై అవగాహన..

గేట్‌ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షకు హాజరయ్యే విషయంలోనూ పరిపూర్ణత సాధించాలి. ముఖ్యంగా వర్చువల్‌ కాలిక్యులేటర్‌ వినియోగం, ఆన్‌స్క్రీన్‌ ఆన్సర్స్‌ రికగ్నిషన్‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి. ఇందుకోసం వీలైతే ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లకు హాజరవడం  ఉపయుక్తంగా ఉంటుంది.

వెయిటేజీని అనుసరిస్తూ.. ప్రిపరేషన్‌

అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆయా టాపిక్స్, వాటికి గత అయిదారేళ్లుగా గేట్‌లో లభిస్తున్న వెయిటేజ్, అకడమిక్‌గా ఉన్న వెయిటేజీ ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి. డిసెంబర్‌ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్‌ పూర్తి చేసుకునేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరవ్వాలి. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. పరీక్షలో మంచి స్కోర్‌ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

గేట్‌–2021 ముఖ్య సమాచారం..

  1.     గేట్‌లో మొత్తం పేపర్ల సంఖ్య : 27
  2.     అర్హత: ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌/కామర్స్‌/ సైన్స్‌/ఆర్ట్స్‌ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ విద్యార్థుల విషయంలో మూడో సంవత్సరం విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
  3.     ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్‌ 14, 2020 – సెప్టెంబర్‌ 30, 20
  4.     ఆన్‌లైన్‌ అడ్మిట్‌ కార్డ్‌ సదుపాయం:  జనవరి 8, 2021 నుంచి.
  5.     పరీక్ష తేదీలు: 2021 ఫిబ్రవరి 5, 6, 7, 12, 13, 14 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల (ఉదయం 9:00–12:00, 3:00–6:00)లో పరీక్ష జరుగుతుంది. 
  6.     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://gate.iitb.ac.in
Published date : 27 Aug 2020 06:04PM

Photo Stories