ఈ సారికి మాత్రం జేఈఈ మెయిన్ రెండు సార్లే..
అంటే.. ప్రస్తుతం జేఈఈ-అడ్వాన్స్‌డ్ నిబంధనల ప్రకారం-వరుసగా రెండేళ్లలో రెండుసార్లు మాత్రమే అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. 2020లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన వారు, అదే విధంగా 2021లో ఉత్తీర్ణత సాధించనున్న విద్యార్థులే జేఈఈ అడ్వాన్స్‌డ్-2021కు అర్హులవుతారు.
- జేఈఈ-మెయిన్-2021కు మాత్రం 2019, 2020లో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. అలాగే 2021లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మెయిన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ-అడ్వాన్స్‌డ్ నిబంధనను పరిగణనలోకి తీసుకుంటే.. ఐఐటీల్లో చేరాలనుకునే 2019 బ్యాచ్ విద్యార్థులకు మెయిన్ అటెంప్ట్‌ల పెంపు పరంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలకే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జేఈఈ- అడ్వాన్స్‌డ్‌కు కూడా 2019లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఒత్తిడికి ఆస్కారం..
జేఈఈ-మెయిన్‌ను నాలుగుసార్లు నిర్వహించడంవల్ల విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యే ఆస్కారముందనే వాదన కూడా వినిపిస్తోంది. వరుసగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించే ఈ పరీక్షల్లో బెస్ట్ స్కోర్‌నే తుది ర్యాంకుల కేటాయింపులో పరిగణిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఫిబ్రవరిలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు.. మార్చి, ఏప్రిల్ నెలల్లో వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్ కోసం సంసిద్ధం కావాల్సి ఉంటుంది. అలాంటి వారు మళ్లీ మే నెలలోనే మెయిన్‌పై దృష్టి కేంద్రీకరించే పరిస్థితి ఉంటుంది. ఇదే సమయంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలకు హాజరయ్యే వారు తమకంటే మంచి స్కోర్ సాధిస్తారేమో, తాము వెనుకబడి పోతామేమోనని విద్యార్థులు ఆందోళన చెందే ఆస్కారముంది. అంతేకాకుండా మంచి స్కోర్ సాధించే వరకు.. నిరంతరం ప్రిపరేషన్ సాగించాల్సిన ఒత్తిడి కూడా ఎదురవుతుందని అంటున్నారు.
ఇంకా తెలుసుకోండి: part 4: జేఈఈ-మెయిన్-2021 పరీక్ష స్వరూపం ఇలా..