Skip to main content

హెచ్‌ఈసీఐ విధి- విధానాలు...!

దేశంలోని ఉన్నతవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఈసీఐ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉన్నత విద్య పర్యవేక్షణకు ఇప్పటికే ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్థానంలో కొత్తగా హెచ్‌ఈసీఐని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
ఆ దిశగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (రిపీల్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ యాక్ట్) యాక్ట్ 2018 ముసాయిదా చట్టాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) రూపొం దించింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతూ.. సదరు ముసాయిదా చట్టాన్ని హెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ముసాయిదా చట్టాన్ని అనుసరించి.. కొత్తగా ఏర్పాటయ్యే కమిషన్ ఉన్నత విద్యా ప్రమాణాల నాణ్యతపైనే దృష్టిసారిస్తుంది. నిధుల పంపిణి, ఆర్థిక అధికారాలు మాత్రం ఎంహెచ్‌ఆర్‌డీ పర్యవేక్షణలో ఉంటాయి. ఇంతకాలం యూనివర్సిటీలకు నిధుల పంపిణీ బాధ్యతలు యూజీసీ నిర్వహిస్తూ వస్తోంది. హెచ్‌ఈసీఐకి ఆర్థిక అధికారాలు ఉండవన్న అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చజరుగుతోంది.

ప్రభుత్వ జోక్యం పెరగనుందా?
  • యూజీసీ రద్దు.. హెచ్‌ఈసీఐ ఏర్పాటుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌ఈసీఐ ఏర్పాటు ద్వారా ఉన్నతవిద్యలో ప్రభుత్వ జోక్యం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. అందుకు హెచ్‌ఈసీఐ స్వరూపాన్ని ఉదహరిస్తున్నారు. ముసాయిదా చట్టం ప్రకారం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, మరో 12 మంది సభ్యులు ఉండే ఈ కమిషన్‌లో ముగ్గురు సభ్యులు కేంద్ర ప్రభుత్వ అధికారులే (ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎంఎస్‌డీఈ) కార్యదర్శి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) కార్యదర్శి) ఉంటారని పేర్కొనడాన్ని ప్రభుత్వ జోక్యం పెరుగుతుందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు.
  • చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌లతో పాటు ఇతర సభ్యుల నియామకానికి ప్రత్యేకంగా సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో.. కేంద్ర ఉన్నత విద్యా శాఖ సెక్రటరీ, మరో ముగ్గురు విద్యావేత్తలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తమకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపుతుంది. వీటి ఆధారంగా కేంద్రం నియామకాలు ఖరారు చేస్తుంది.
  • కేంద్ర మానవ వనరుల మంత్రి ఆధ్వర్యంలో సలహా మండలి వ్యవస్థ ఉంటుందని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. ఇందులో హెచ్‌ఈసీఐ సభ్యులు, అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు/వైస్‌చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఈ సలహా మండలి కనీసం ఆర్నెల్లకు ఒకసారి సమావేశమై.. ఉన్నత విద్యకు సంబంధించిన అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయానికి ప్రయత్నిస్తుంది. ఈ సలహా మండలి అందించే సలహాలు, సూచనలను అమలు చేసేందుకు కమిషన్ చర్యలు తీసుకుంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు. ఇది అంతిమంగా ఉన్నత విద్యలో ప్రభుత్వ జోక్యానికి దారితీస్తుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే సలహా మండలిలో రాష్ట్రాలకు చోటు కల్పించడంపై మాత్రం సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిధుల మంజూరు అధికారం :
ఇప్పటిదాకా దేశంలో ఉన్నత విద్య ప్రమాణాల పెంపు, నిధుల మంజూరు అధికారాలు యూజీసీకి ఉన్నాయి. కానీ, హెచ్‌ఈసీఐ ముసాయిదా చట్టం ప్రకారం కమిషన్ కేవలం విద్యా (అకడమిక్) సంబంధ అంశాలకే పరిమితమవుతుంది. హెచ్‌ఈసీఐకి ఎలాంటి ఆర్థిక అధికారాలు ఉండవు. ఆయా యూనివర్సిటీలకు నిధుల మంజూరు, పంపిణీ, ఇతర ఆర్థిక అధికారాల అంశం ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అది కూడా పనితీరు ఆధారంగా నిధులు అనడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీల్లో నిధుల లేమి కారణంగా ఫ్యాకల్టీ కొరత, మౌలిక సదుపాయాల సమస్య, పరిశోధనల నత్తనడక వంటి సమస్యలు నెలకొన్నాయి. పనితీరు ఆధారిత నిధుల మంజూరు అనే నిబంధన కారణంగా.. ఇప్పటికే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారముందని నిపుణులు పేర్కొంటున్నారు.

స్వయం ప్రతిపత్తి :
హెచ్‌ఈసీఐ ముసాయిదా ప్రకారం ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడంపై కమిషన్ దృష్టి పెడుతుందని పేర్కొనడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టిట్యూట్స్‌కు అవసరానికి మించి స్వయం ప్రతిపత్తి ఇస్తే నిర్దిష్ట లక్ష్యాలు నెరవేరకపోగా.. స్వయం ప్రతిపత్తి పొందిన సంస్థలు తమ ఇష్టానుసారం వ్యవహరించే ప్రమాదముందనే వాదన వినిపిస్తోంది. ఇటీవల 62 విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడంపై నిరసన వ్యక్తమవడాన్ని పలువురు ఉదహరిస్తున్నారు. అయితే ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే.. విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశామే ఎక్కువగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఇందుకు ఇప్పటికే స్వయం ప్రతి పత్తి ఉన్న సంస్థలు రాణిస్తున్న విషయాన్ని వారు చెబుతున్నారు.

పరిమిత పర్యవేక్షణ :
ప్రతిపాదిత హెచ్‌ఈసీఐకు ఉన్నత విద్యా సంస్థలపై పరిమిత పర్యవేక్షణ అధికారాలు మాత్రమే కల్పించనున్నారు. ఒకవైపు హెచ్‌ఈసీఐ 'ఏటా ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల అకడమిక్ పనితీరును మూల్యాంకనం చేయాలి' అని ముసాయిదా చట్టంలో ప్రస్తావించారు. మరోవైపు 'లెస్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్' అని పేర్కొంటూ.. విద్యా సంస్థల నిర్వహణలో జోక్యం ఉండదని స్పష్టం చేశారు. దీంతో విద్యా సంస్థలు నిర్వహణపరంగా తమ ఇష్టానుసారం వ్యవహరించేందుకు ఆస్కారముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెచ్‌ఈసీఐ ముసాయిదా చట్టం ప్రకారం ఇన్‌స్టిట్యూట్‌లలో తనిఖీలు నిర్వహించే విషయంలోనూ పరిమితులు విధించింది. ఆయా విద్యా సంస్థలే తమ వెబ్‌సైట్లలో నిర్వహణ, అకడమిక్ పరమైన అంశాలను అందరికీ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. దీనివల్ల కొన్ని విద్యా సంస్థలు తప్పుదోవ పట్టించే విధంగా సమాచారం పొందుపరిచే ఆస్కారముందంటున్నారు.

కేంద్ర నిర్ణయమే 'ఫైనల్'..
విధుల పరంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే హెచ్‌ఈసీఐ నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. హెచ్‌ఈసీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏదైనా అంశంలో బేధాభిప్రాయాలు నెలకొంటే.. కేంద్రం తీసుకునే నిర్ణయానికే కమిషన్ కట్టుబడాల్సి ఉంటుందని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. కమిషన్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ సహా సభ్యులందరినీ ఎప్పుడైనా తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మొత్తంగా హెచ్‌ఈసీఐ ముసాయిదా చట్టాన్ని పరిశీలిస్తే... ఉన్నత విద్యా రంగంలో ప్రభుత్వ ఆధిపత్యమే కొనసాగే ఆస్కారముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రతిపాదిత హెచ్‌ఈసీఐ స్వరూపం
  1. చైర్‌పర్సన్
  2. వైస్ చైర్‌పర్సన్
  3. 12 మంది సభ్యులు: ముగ్గురు సభ్యులు.. కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ కార్యదర్శి, సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి.
  4. ఏఐసీటీఈ చైర్మన్
  5. ఎన్‌సీటీఈ చైర్మన్
  6. నియంత్రణ సంస్థల కార్వనిర్వాహక/పరిపాలన మండళ్ల చైర్ పర్సన్స్ ఇద్దరు.
  7. యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు ఇద్దరు.
  8. రీసెర్చ్, నైపుణ్యాభివృద్ధిలో అనుభవమున్న యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఇద్దరు.
  9. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒకరు.
హెచ్‌ఈసీఐ విధులు :
  • అకడమిక్ బోధన, ప్రమాణాల పరంగా నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవడం.
  • నిబంధనలకు లోబడి ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించే చర్యలు చేపట్టడం.
  • బోధన ఫలితాలను నిర్దేశించడం.
  • కరిక్యులానికి సంబంధించి బోధన/మూల్యాంకన/పరిశోధన ప్రమాణాలు రూపొందించడం.
  • బోధన సిబ్బందికి శిక్షణనివ్వడం, నైపుణ్యాభివృద్ధి చేపట్టడం.
  • నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఏటా ఉన్నత విద్యా సంస్థల పనితీరు మూల్యాంకన చేయడం.
  • ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనలకు కృషి చేయడం.
  • ఉన్నత విద్యా సంస్థల అకడమిక్ ఫలితాల మూల్యాంకన పరంగా పటిష్టమైన అక్రెడిటేషన్ వ్యవస్థను నెలకొల్పడం.
  • నిర్దేశిత అకడమిక్ ప్రమాణాలు పాటించడంలో విఫలమవుతున్న సంస్థలకు మెంటారింగ్ సదుపాయం కల్పించడం.
  • కనీస ప్రమాణాలు పాటించని విద్యా సంస్థల మూసివేతకు ఆదేశాలు జారీ చేయడం.
  • కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టంగా ఒక విషయంపై సంప్రదించినప్పుడు తగిన సలహా ఇవ్వడం.
  • ఇన్‌స్టిట్యూట్‌ల పనితీరు, అకడమిక్ ఫలితాలు ప్రజలకు అందుబాటులో ఉంచేలా చేయడం.
ప్రైవేటుకు ఊతమిచ్చేలా..
 హెచ్‌ఈసీఐ ముసాయిదా చట్టం ప్రతిని పరిశీలిస్తే ప్రైవేటు సంస్థలకు ఊతమిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారనిపిస్తోంది. అసలు యూజీసీని రద్దు చేయాలనే ఆలోచనే సరికాదు. ఒకవేళ యూజీసీ పనితీరు సరిగా లేదని భావిస్తే దాన్ని పటిష్టం చేసేలా చర్యలు తీసుకోవాలే తప్ప.. పూర్తిగా ఒక వ్యవస్థను రద్దు చేయడమనేది అసంబద్ధమైన చర్య. సలహా మండలి ఏర్పాటు, నిధుల మంజూరు అధికారం తమ వద్దే ఉంచుకోవడం వంటివి ఉన్నత విద్యలో తమ ఆధిపత్యాన్ని చూపించాలనుకోవడమే. దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. - ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ విద్యావేత్త.
 
 అమలు చేయడంలో ఇబ్బందులు...
 హెచ్‌ఈసీఐ ఏర్పాటు చేసినప్పటికీ.. దీన్ని సమర్థమంతంగా అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ముఖ్యంగా సంస్థల పనితీరు ఆధారంగా నిధుల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయడం, దాని ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు విషయంలో నిర్ణయం తీసుకోవడం వంటి ప్రతిపాదనల వల్ల కార్యకలాపాల్లో జాప్యం జరిగే ఆస్కారముంది. నిధుల మంజూరు విషయంలోనూ హెచ్‌ఈసీఐకే నేరుగా అధికారాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటే మంచిది.  
- డాక్టర్ డి.ఎన్.రెడ్డి, యూజీసీ మాజీ సభ్యులు.
Published date : 12 Jul 2018 02:37PM

Photo Stories