Skip to main content

ఎఫ్‌డీడీఐ-ఏఐఎస్‌టీ2020 పరీక్ష విధానం..కోర్సులు..ఉద్యోగావకాశాలు

జీవితంలో లక్ష్యం ముఖ్యం. కెరీర్ విషయంలో అది మరింత స్పష్టంగా ఉండాలి. ఎంతటి ఉన్నతవిద్య చదువుతున్నాం అనేది ముఖ్యం కాదు. మనం చదివిన చదువుకు ఎంత వరకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.. కెరీర్ ఎలా ఉంటుంది.. భవిష్యత్తుకు ఢోకా లేకుండా ఉంటుందా.. లేదా అనే విషయాలే ప్రధానం. అలాంటివే ఫుట్‌వేర్ కోర్సులు.
పాదరక్షలు ఆకర్షణీయ డిజైన్‌లతో చిన్నపిల్లలను నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. వీటిని అవసరాలకు తగ్గట్లు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించడానికి నైపుణ్యం అవసరం. అలాంటి స్కిల్స్ పెంపొందిం చుకోవాలనుకునే వారికోసం పుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్- ఆలిండియా సెలక్షన్ టెస్ట్(ఎఫ్‌డీడీఐ-ఏఐఎస్‌టీ)-2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఎఫ్‌డీడీఐ-ఏఐఎస్‌టీ పరీక్ష విధానం, అందిస్తున్న కోర్సులు, ఉద్యోగావకాశాలపై సమగ్ర కథనం...

పాదరక్షల తయారీలో మానవ వనరులను తీర్చిదిద్ది ఎక్కువ మందికి ఉపాధి కల్పించే.. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 1986లో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)ఏర్పాటైంది. నోయిడాలోని ప్రధాన కేంద్రంతోపాటు హైదరాబాద్, ఫుర్సత్‌గంజ్, అంకలేశ్వర్(గుజరాత్), గుణ, చెన్నై, పాట్నా, కోల్‌కతా, రోహ్‌తక్, చిండ్వారా, జోద్‌పూర్, చండీగఢ్ సహా దేశవ్యాప్తంగా దాదాపు 12 కేంద్రాలున్నాయి. వీటిలో రిటైల్ మేనేజ్‌మెంట్, ఫుట్‌వేర్ డిజైన్, టెక్నాలజీ, ఫ్యాషన్ మర్చెండైజింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, విజువల్ మర్చెండైజింగ్, మార్కెటింగ్, క్రియేటివ్ డిజైనింగ్, లెదర్ గూడ్స్ డిజైనింగ్ వంటి యూజీ,పీజీ, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నారు.

కోర్సుల్లో ఏం నేర్పుతారు?
ఫుట్‌వేర్ కోర్సుల్లో భాగంగా వివిధ ముడి పదార్థాలు, ఉత్పత్తులను ఉపయోగించి పాదరక్షలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. యంత్రాల సాయంతో వాటిని డిజైన్ చేసేలా శిక్షణ ఇస్తారు. వినియోగదారుల అవసరాలు, ఆలోచనలపై అవగాహన కల్పిస్తారు. వీటితోపాటు రిటైల్ మేనేజ్‌మెంట్, కన్జ్యూమర్ బిహేవియర్, రిటైల్ కమ్యూనికేషన్, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్, రిటైల్ ఆపరేషన్, మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, సేల్స్ మేనేజ్‌మెంట్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వంటివి నేర్పుతారు.
కోర్సులు.. అర్హతలు:
  1. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్, రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్, ఫ్యాషన్ డిజైన్ విభాగాలున్నాయి. వీటి కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్ విద్యార్హతతో వీటిలో చేరొచ్చు.
  2. మాస్టర్ ఆఫ్ డిజైన్: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్. ఫుట్‌వేర్/లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్/ఫ్యాషన్/ఇంజనీరింగ్/ఫైన్‌ఆర్ట్స్/ఆర్కిటెక్చర్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చదివిన వారు అర్హులు.
  3. ఎంబీఏ (రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్): ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు చేరొచ్చు.
  4. మాస్టర్ ఆఫ్ డిజైన్ (క్యాడ్/క్యామ్): ఫుట్‌వేర్/లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్/ఫ్యాషన్/ఇంజనీరింగ్/ఫైన్‌ఆర్ట్స్/ఆర్కిటెక్చర్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్స్ :
పాదరక్షల పరిశ్రమలో అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. టెక్నికల్, డిజైనింగ్, మేనేజ్‌మెంట్ సహా వివిధ విభాగాల్లో నిత్యం నియామకాలు జరుగుతుంటాయి. ఇందులో ముఖ్యంగా ఫుట్‌వేర్ డిజైనర్, ప్రొడక్ట్ డెవలపర్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్, క్వాలిటీ కంట్రోలర్, ఫుట్‌వేర్ టెక్నాలజిస్ట్, మెర్చెండైజర్, మార్కెటింగ్, ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్, ట్రెండ్ అనలిస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డిజైన్ మ్యానుఫాక్చరింగ్ ఆపరేషన్స్, స్టోర్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, ఏరియా మేనేజర్ వంటి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సొంతంగా డిజైనింగ్ స్టూడియోలు ప్రారంభించొచ్చు.

నైపుణ్యాలు..
ఇది క్రియేటివిటీతో ముడిపడిన కొలువు. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారు స్కెచ్ ప్యాటర్న్, స్కేల్ డ్రాయింగ్ లేదా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. అలాగే నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తెలిపేలా వపర్‌పాయింట్ ప్రజంటేషన్స్ కానీ లేదా హ్యాండ్ పెయింట్ ప్రజంటేషన్స్ ఇస్తుండాలి. సేఫ్ట్టీ, కంఫర్ట్, క్వాలిటీ.. ఇలా అన్నీ విషయాల్లో మెరుగైన ప్రొడక్ట్‌ను డిజైన్ చేయాలి. ప్రొడక్షన్ స్టేజ్‌లోనే తయారీకి సంబంధించి డిజైనర్ల్ల జోక్యం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి డిజైన్ ఫైనల్ చేశాక మార్పులు చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అన్నీ పక్కాగా చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ రంగంలో రాణించేందుకు ప్రధానంగా...
  • క్రియేటివిటీ
  • కలర్స్, టెక్చర్, ప్యాట్రన్ పట్ల అవగాహన
  • డ్రాయింగ్, క్యాడ్ స్కిల్స్
  • కమ్యూనికేషన్ స్కిల్స్
  • ఆసక్తి
  • వినియోగదారుల అభిరుచులు గుర్తించగలగడం వంటి నైపుణ్యాలు ఉండాలి.
ఉద్యోగ వేదికలు :
సంబంధిత ఫుట్‌వేర్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు..
  • అడిడాస్
  • ల్యాండ్ మార్క్
  • మ్యాక్స్
  • రీబక్
  • లిబర్టీ
  • రిలయన్స్ రిటైల్
  • వెస్ట్ సైడ్
  • ఉడ్‌ల్యాండ్
  • బాటా
  • ఫ్యూచర్ గ్రూప్
  • గ్లోబస్
  • ఖాదిమ్స్
  • లైఫ్ స్టైల్
  • ప్యుమా బ
  • యాక్షన్
....వంటి వాటిల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

ఎఫ్‌డీడీఐ -ఏఐఎస్‌టీ పరీక్ష విధానం :
ఎఫ్‌డీడీఐ-ఏఐఎస్‌టీ పరీక్ష యూజీ, పీజీకి కలిపి నాలుగు సెక్షన్‌లు (సెక్షన్-ఏ, బీ, సీ, డీ) లుగా ఉంటుంది. మొత్తం 200 మార్కులకు జరిగే ఈ పరీక్ష సమయం రెండున్నర గంటలు.

యూజీ:
సెక్షన్ సబ్జెక్ట్ మార్కులు
సెక్షన్-ఏ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50
సెక్షన్-బి వెర్బల్ ఎబిలిటీ 50
సెక్షన్-సి జనరల్ అవేర్‌నెస్ 50
సెక్షన్-డి బిజినెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(బ్యాట్ 50
మొత్తం మార్కులు 200

పీజీ :
సెక్షన్ సబ్జెక్ట్ మార్కులు
సెక్షన్-ఏ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50
సెక్షన్-బీ ఇంగ్లిష్ 50
సెక్షన్-సీ జీకే అండ్ కరెంట్ అఫైర్ 50
సెక్షన్-డీ మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్ 50
మొత్తం మార్కులు 200

ముఖ్య సమాచారం :

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 15, 2020
అడ్మిట్ కార్డ్‌ల అందుబాటు: ఏప్రిల్ 30, 2020
పరీక్ష తేదీ: మే 24, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.fddiindia.com

జీకే అండ్ కరెంట్ అఫైర్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Published date : 18 Feb 2020 06:12PM

Photo Stories