Skip to main content

డిగ్రీలో కొత్తగా బకెట్ విధానం.. విద్యార్థులకు ప్రయోజనమా?కాదా?

తెలంగాణ డిగ్రీ చదువుల్లో కొత్తగా బకెట్ విధానం ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్రంలోనిడిగ్రీ చదువులు కొత్త రూపు సంతరించుకోన్నాయి. కాగా, ప్రస్తుతం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే దోస్త్(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. బకెట్ విధానం, కాంబినేషన్ల వివరాలతోపాటు కొత్తగా ప్రారంభించిన బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్ కోర్సుల వివరాలు...

దోస్త్ 2020-21 షెడ్యూల్..

  1.     రూ.200 ఫీజుతో మొదటి దశ దరఖాస్తు ప్రక్రియ: సెప్టెంబరు 7 వరకు.
  2.     వెబ్ ఆప్షన్స్: సెప్టెంబరు 8 వరకు
  3.     మొదటి దశ సీట్లు కేటాయింపు: సెప్టెంబరు 16
  4.     రెండో దశ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు: సెప్టెంబరు 17-23
  5.     రెండో దశ సీట్లు కేటాయింపు: సెప్టెంబరు 28
  6.     మూడో దశ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు: సెప్టెంబరు 28-అక్టోబరు 3
  7.     మూడో దశ సీట్ల కేటాయింపు: అక్టోబరు 8
  8.     మూడు దశలకు సంబంధించి ఆన్‌లైన్‌లో సీట్లు కన్‌ఫర్మ్ చేసుకున్న వారు కళాశాలల్లో -రిపోర్ట్ చేయాల్సిన తేదీలు: అక్టోబరు 8-12

 

  తెలంగాణలోని ఆరు వర్సిటీల్లో అడ్మిషన్స్..

 దోస్త్ ద్వారా కాకతీయ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, తెలంగాణ విశ్వవిద్యాలయాల పరిధిలోని 900కు పైగా కళాశాలల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 278, మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో 90, ఉస్మానియా కింద 352, శాతవాహన పరిధిలో 105, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం కింద ఉన్న 66 కళాశాలలు ఉన్నాయి. దోస్త్ ద్వారా ఆయా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీంతోపాటు డీహెచ్‌ఎంసీటీ, డీఫార్మసీ కోర్సులలో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ కూడా దోస్త్ ద్వారానే జరుగుతుంది. 

 

కొత్తగా బకెట్ విధానం..

 కొత్తగా ప్రవేశపెట్టిన బకెట్ విధానంతో డిగ్రీ చదువులు సమూలంగా మారనున్నాయి. ఇప్పటి వరకు బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో నిర్దిష్ట గ్రూపు సబ్జెక్టులనే ఎంచుకోవాల్సి ఉండేది. ఇతర సబ్జెక్టులను చదివేందుకు వీలుండేది కాదు. కానీ, ఈ సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందే విద్యార్థులంతా సంప్రదాయ సబ్జెక్టులతోపాటు నచ్చిన వాటిని ఎలక్టివ్స్‌గా ఎంచుకొనే అవకాశం ఉంది. ఒక్కో బకెట్‌లో పలు సబ్జెక్టులు ఉంటాయి. అలాంటివి నాలుగు బకెట్‌లు ఉంటాయి. ఒక్కో బకెట్ నుంచి విద్యార్థి ఇష్టం మేరకు ఒక్కో సబ్జెక్టును ఎంచుకోవాలి. అలా ఏవైనా మూడు బకెట్‌ల నుంచి ఎంపిక చేసుకోవాలి. ఎలక్టివ్‌గా ఎంచుకున్న సబ్జెక్టు ప్రవేశం పొందిన కళాశాలల్లో లేనట్లయితే.. విద్యార్థులు ఆయా సబ్జెక్టులను స్వయం లేదా రాష్ట్రం నిర్వహణలోని వర్చువల్ క్లాస్ రూమ్ ద్వారా అభ్యసించొచ్చు. ఎలక్టివ్స్‌కు సంబంధించి యూజీసీ నిబంధనల మేరకు పరీక్ష నిర్వహించి విద్యార్థులకు క్రెడిట్స్ ఇవ్వనున్నారు.

 

 బకెట్ విధానంతో ప్రయోజనం?

 నూతన బకెట్ విధానం విద్యార్థుల్లో మల్టిడిసిప్లినరీ అప్రోచ్‌ను పెంచడతోపాటు కెరీర్ పరంగానూ లాభిస్తుంది. సివిల్స్, గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు కావాల్సిన సంసిద్ధత లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే.. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సోషల్ సెన్సైస్‌పై అవగాహన తప్పనిసరి. సైన్స్ గ్రూపులకు చెందిన విద్యార్థులు ఆయా అంశాల్లో ఇబ్బందిపడుతుంటారు. దాంతో ఆయా సబ్జెక్టుల కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటుంటారు. ఇక నుంచి బకెట్ విధానంలో డిగ్రీలోనే సదరు సబ్జెక్టులను చదివే అవకాశం లభించడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. 

 

 కొత్త కాంబినేషన్స్..

 ఈ సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సుల్లో కొత్త కాంబినేషన్లను ప్రవేశపెట్టారు. సైన్స్ నేపథ్యం కలిగిన విద్యార్థులకు డైరీ సైన్స్, జువాలజీ, కెమిస్ట్రీ; బోటనీ, కెమిస్ట్రీ, క్రాప్ ప్రొడక్షన్ కాంబినేషన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్ స్థాయిలో ఆయా సబ్జెక్టుల్లో ఒకేషనల్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఇది ఉపయోగపడనుంది. బీఏ మ్యాథమెటిక్స్‌ను ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్/జర్నలిజం/సైకాలజీ కాంబినేషన్స్‌లో అందించనున్నారు. అలాగే బీఎస్సీ సెరికల్చర్, బీఎస్సీ ఫిషరీస్ కోర్సు ప్రస్తుతం రెండు కళాశాలల్లో ఉండగా.. అదనంగా మరో నాలుగు కాలేజీల్లో వీటిని ప్రవేశపెట్టారు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా 27 ప్రభుత్వ కళాశాలల్లో బీకాం ట్యాక్సేషన్ కోర్సును, జమ్మికుంట ప్రభుత్వ కళాశాలలో మాత్రమే ఉన్న బీఏ ఆఫీస్ మేనేజ్‌మెంట్ కోర్సును 20కి పైగా కళాశాలల్లో అందుబాటులోకి తెచ్చారు. 

రెండు కొత్త కోర్సులు ప్రారంభం..

 రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్ కోర్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టగా.. 24 క ళాశాలల్లో బీకాం బిజినెస్ అనలిటిక్స్ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ జాబితాలో హైదరాబాద్‌లోని గవర్న్‌మెంట్ సిటీ కాలేజ్, బేగంపేటలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖైరతాబాద్ డిగ్రీ కళాశాల, కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ గవర్న్‌మెంట్ డిగ్రీ కళాశాల తదితరాలు ఉన్నాయి. ఈ కోర్సుల సిలబస్‌ను ఇండస్ట్రీ సహకారంతో రూపొందించారు. ప్రతి కోర్సులో 60 సీట్ల చొప్పున(కాలేజీకి) ప్రవేశాలు కల్పిస్తారు. 

 

 అనూహ్య స్పందన..

 దోస్త్‌కు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటి వరకు లక్షా ఇరవై వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ సంవత్సరం నుంచి డిగ్రీలో పలు కొత్త కోర్సులు, కాంబినేషన్లు, బకెట్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. కొవిడ్-19 నేపథ్యంలో ఆయా కోర్సులు అమలుపై ఎలాంటి సందేహం అవసరం లేదు.

 - ప్రొ.ఆర్.లింబాద్రి, కన్వీనర్, దోస్త్

Published date : 07 Sep 2020 04:38PM

Photo Stories