డైటీషియన్ కోర్పు పూర్తి చేస్తే రూ.30 వేల ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు..!
మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల సమతుల్యత పాటించక పోవడం, సమయానికి తినకపోవడం వల్ల బీపీ, షుగర్, ఎసిడిటీ వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వారి ఆహారపు అలవాట్లను గమనించి.. శాస్త్రీయ పద్ధతిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏఏ సమయాల్లో తీసుకోవాలో సలహా ఇచ్చే నిపుణులే డైటీషియన్లు.
అర్హతలు..
డైటీషియన్‌గా మారాలనుకునే అభ్యర్థులు.. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసిన తర్వాత బీఎస్సీ హోంసైన్స్ లేదా బీఏ హోంసైన్స్‌లో చేరాలి. ఈ డిగ్రీ పూర్తిచేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రీషన్‌ను స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు. దేశంలోని పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు హోంసైన్స్‌లో బీఎస్సీ, ఎం ఎస్సీ వంటి కోర్సులను అందిస్తున్నాయి.
కోర్సును అందిస్తున్న సంస్థలు..
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(హైదరాబాద్), పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ పుణే, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోంఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వంటి విద్యాసంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.
అవకాశాలు..
ప్రస్తుత ఆధునిక సమాజంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువ. అధిక బరువు, బరువులేమి సమస్యలను ఎదుర్కొంటున్న వారు డైటీషియన్ల సలహాలు తీసుకుంటున్నారు. చిన్నపాటి క్లినిక్స్ నుంచి బడా కార్పొరేట్ హాస్పిటల్స్ వరకూ.. డైటీషియన్ల అవసరం తప్పనిసరిగా మారింది. రీసెర్చ్ ల్యాబ్స్, జిమ్స్, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్, హెల్త్‌కేర్ సెంటర్స్ వంటి వాటిలో డైటీషియన్ల సేవల అవసరం పెరుగుతోంది. దాంతో ఆయా విభాగాల్లో వీరు అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
వేతనాలు..
డిగ్రీ స్థాయి కోర్సు పూర్తిచేసి డైటీషియన్‌గా కెరీర్ ప్రారంభించే వారికి ప్రారంభంలో రూ.20వేల నుంచి రూ.30వేల వరకూ వేతనం లభిస్తోంది. అనుభవం, పనితీరు, నైపుణ్యం ఆధారంగా జీతం పెరుగుతుంది.
ఇంకా చదవండి : part 1: చక్కటి అవకాశాల వేదిక నర్సింగ్.. ఈ హెల్త్‌కేర్ రంగ కోర్సు గురించి తెలుసుకోండిలా..