ఐటీ కొలువుల్లో అధిక శాతం కోడింగ్ ప్రొఫైల్స్‌లోనే..
ప్రస్తుతం ఐటీ కొలువుల పరంగా అత్యధిక శాతం కొలువులు కోడింగ్ ప్రొఫైల్‌లోనే ఉంటున్నాయి. పలు రిక్రూటింగ్, స్టాఫింగ్ సంస్థల అంచనా ప్రకారం-ఐటీ సంస్థల కొలువుల్లో దాదాపు 80శాతం మేర కోడింగ్ ప్రొఫైల్స్‌లోనే నియామకాలు జరుగుతున్నాయి. వీరికి ఇచ్చే వేతనాలు కూడా లక్షల్లో ఉంటున్నాయి. ఇండీడ్ సర్వే ప్రకారం-ఐటీ కొలువుల్లో అత్యంత డిమాండింగ్ స్కిల్‌గా కోడింగ్ నిలిచింది.
ఆ లాంగ్వేజెస్ ఆదరువుగా..
- కోడింగ్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి ముందుగా ఆయా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పైథాన్, జావా, ఆర్, పీహెచ్‌పీ, స్విప్ట్ వంటివి టాప్‌లో నిలుస్తున్నాయి.
- పైథాన్: ఇటీవల కాలంలో ఎక్కువగా వినియోగంలోకి వస్తున్న ప్రోగ్రామింగ్ /కోడింగ్ లాంగ్వేజ్ ఇది. పలు జాబ్ సెర్చ్ పోర్టల్స్ అంచనాల ప్రకారం-ఇది అంతర్జాతీయ స్థాయిలో టాప్-3 స్కిల్స్ జాబితాలో నిలుస్తోంది. ఈ లాంగ్వేజ్ నేర్చుకున్న వారికి డెవలపర్స్, డిజైనర్స్‌గా రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వేతనం లభిస్తోంది.
- జావా: ఎన్నో ఏళ్లుగా ఆదరణ పొందుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. బిగ్‌డేటా అప్లికేషన్స్, డెస్క్‌టాప్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ రూపకల్పనలో అత్యంత కీలకంగా నిలుస్తోంది. అందుకే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ దిగ్గజ సంస్థలు.. జావా స్కిల్స్ ఉన్న వారికి ఆఫర్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ఈ స్కిల్స్ ఉన్న వారికి జావా ఈఈ డెవలపర్, జావా డెవలపర్, జావా ఆండ్రాయిడ్ డెవలపర్ వంటి హోదాల్లో కొలువులు లభిస్తున్నాయి. సగటు వేతనం రూ.4లక్షల నుంచి రూ.9లక్షల వరకు ఉంటోంది.
- ఆర్: స్టాటిస్టికల్ అనాలిసిస్ కోణంలో మరో ప్రధానమైన లాంగ్వేజ్..ఆర్. డేటాసైన్స్, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, స్టాటిస్టికల్ కంప్యూటింగ్, గ్రాఫిక్స్ విభాగాల్లో ఆర్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్ నెలకొంది. సగటున రూ.5లక్షల వార్షిక వేతనంతో కొలువు సొంతం చేసుకునే వీలుంది.
- పీహెచ్‌పీ: ఇది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రస్తుతం పీహెచ్‌పీ డెవలపర్స్‌కు డిమాండ్ బాగానే ఉంది. ఎంతో కాలంగా ఇది ఎవర్‌గ్రీన్‌గా స్కిల్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా వెబ్‌సైట్స్ రూపకల్పనలో ఇప్పటికీ ఎక్కువ మంది వినియోగించే లాంగ్వేజ్ పీహెచ్‌పీనే. పీహెచ్‌పీ నైపుణ్యాలున్న వారికి కొలువులు ఖాయమని చెప్పొచ్చు. సగటున రూ.ఆరు లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.
- స్విఫ్ట్: ఓపెన్ సోర్స్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్‌గా యాపిల్ సంస్థ రూపొందించిన లాంగ్వేజ్..స్విఫ్ట్. దీన్ని ఇప్పుడు కంపెనీల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ లాంగ్వేజ్ నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి స్విఫ్ట్ డెవలపర్స్‌గా కొలువు లభిస్తుంది. సగటున రూ.8 లక్షల వార్షిక వేతనం అందుకునే వీలుంది.
- వీటితో పాటు హెచ్‌టీఎంఎల్, సీ++, ఎస్‌క్యూఎల్ వంటి లాంగ్వేజెస్ కూడా కొలువుల సాధనలో డిమాండ్ నెలకొన్న విభాగాలుగా చెప్పొచ్చు.
సర్టిఫికేషన్ కోర్సులు..
కోడింగ్ నైపుణ్యాలకు రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోంది. దాంతో వీటిని నేర్చుకునే మార్గాలపై యువత అన్వేషణ సాగిస్తోంది. ప్రస్తుతం పలు ఆన్‌లైన్ /ఆఫ్‌లైన్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జావా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్, ఐబీఎం, జెట్ కింగ్ వంటి సంస్థలు కోడింగ్ నైపుణ్యాల సమ్మిళితంగా ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి.
ఇంకా చదవండి: part 3: ద్వితీయ, తృతీయ శ్రేణి కాలేజ్‌ల విద్యార్థులకు అనుకూలంగా.. వీటిని ఆన్‌లైన్‌లోనూ నేర్చుకోవచ్చు..