Skip to main content

ఐఐఎంల్లో ఫీజుల వివ రాలు...

ఐఐఎంలో.. మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం లభిస్తే.. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది! భవిష్యత్తులో కార్పొరేట్ లీడర్లుగా ఎదగడానికి.. తొలి అడుగు పడిందనే సంతోషం! కోర్సు పూర్తికాగానే కంపెనీలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాయనే సంబరం!
అయితే, ఐఐఎంలు ఏటేటా పెంచుతున్న ఫీజులు.. విద్యార్థులకు భారంగా పరిణమిస్తున్నాయి! గత మూడు, నాలుగేళ్లుగా విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్న ఐఐఎంలు.. 2018-20 బ్యాచ్‌కు కూడా ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐఐఎంలలో ఫీజుల వివరాలు.. విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం...

జాతీయ స్థాయిలో నిర్వహించే అత్యంత క్లిష్టమైన ‘క్యాట్’లో ప్రతిభ చూపి.. ఐఐఎంల్లో కాలు పెట్టనున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా ఫీజులు భారం తప్పట్లేదు. దాదాపు అన్ని ఐఐఎంలు 2018-20 మేనేజ్‌మెంట్ పీజీ బ్యాచ్‌కు సంబంధించి ఫీజులు పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఐఐఎంలో అవకాశం లభించిందనే ఆనందం ఆవిరవుతోంది. ఆయా ఐఐఎంలు మాత్రం విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌్కలో లభించే వేతనాలు, ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులను ప్రస్తావిస్తూ ఫీజుల పెంపును సమర్థించుకుంటున్నాయి.

5 నుంచి 17 శాతం మేర..
ఐఐఎంల్లో ఈ ఏడాది ఫీజుల పెంపు భారీ స్థాయిలోనే కనిపిస్తోంది. టాప్ ఐఐఎంగా పేర్కొనే ఐఐఎం అహ్మదాబాద్ మొదలు.. కొత్త ఐఐఎంల వరకు.. అన్ని ఐఐఎంల్లో ఫీజుల భారం పెరిగింది. అయిదు నుంచి 17 శాతం మేరకు ఫీజులు పెరగనున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోల్‌కత వంటి క్యాంపస్‌ల్లో రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకోవాలంటే.. రూ.20 లక్షలకు పైగా.. కేవలం ట్యూషన్ ఫీజుకే చెల్లించాల్సిన పరిస్థితి. వీటికి అదనంగా ఇతర ఖర్చులు(నివాస వ్యయం, వ్యక్తిగత ఖర్చులు) కలుపుకుంటే.. రూ.25 లక్షలకుపైగా ఖర్చుచేస్తే కానీ కోర్సు పూర్తికాదు.

నాలుగేళ్లుగా పెంపు బాటలోనే..
ఐఐఎంలు గత నాలుగేళ్లుగా ఫీజుల పెంపు బాటలోనే పయనిస్తున్నాయి. 2015 నుంచి ప్రతి ఏటా సగటున రూ.లక్షన్నర మేరకు ఫీజులు పెంచుతున్నాయి. దాంతో ఐఐఎంల్లో సీటు దక్కించుకోవడం ఒక ఎత్తయితే.. అక్కడి ఫీజులు భరించడం విద్యార్థులకు భారంగా పరిణమిస్తోంది. ఐఐఎం-రాంచీ, రోహ్‌తక్ వంటి కొత్త క్యాంపస్‌లలో సైతం 2018-20 బ్యాచ్‌కు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు ఫీజు పెరిగింది. జమ్ము, సంబల్‌పూర్, సిర్మౌర్, అమృత్‌సర్, విశాఖపట్నం వంటి పలు కొత్త ఐఐఎంల్లో మాత్రమే ఫీజు రూ.10లక్షల దగ్గర్లో ఉంది.

స్వయం ప్రతిపత్తే కారణమా!
ఐఐఎంలు భారీగా ఫీజులను పెంచడానికి ఇటీవల ఆమోదం పొందిన ఐఐఎం-బిల్లు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ బిల్లు ప్రకారం-అన్ని విషయాల్లో ఐఐఎంలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. దీంతో ఐఐఎంలు ఎలాంటి సంశయం లేకుండా ఫీజులు పెంచుతున్నట్లు భావిస్తున్నారు. ఐఐఎం వర్గాల వాదన మాత్రం భిన్నంగా ఉంది. నిపుణులైన ఫ్యాకల్టీని నియమించుకునేందుకు భారీ వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని.. అంతేకాకుండా మౌలికవసతుల కల్పనకు సైతం భారీగా వ్యయం చేయాల్సి వస్తోందని... వీటన్నింటి కారణంగా ఫీజుల పెంపు తప్పనిసరైందని పేర్కొంటున్నాయి.

ఆర్థిక ప్రోత్సాహకాలు.. ఇవే:
ఐఐఎంల్లో ఫీజులు పెరుగుతుంటే.. విద్యార్థులు సహజంగానే ఆర్థిక ప్రోత్సాహకాల గురించి అన్వేషిస్తారు. ఈ విషయంలో ఐఐఎంలు కొంత భరోసా ఇస్తున్నప్పటికీ... మరీ ఆశించిన స్థాయిలో లేవని చెప్పొచ్చు.
  • ప్రస్తుతం పలు ఐఐఎంలలో విద్యార్థులకు నీడ్ బేస్డ్, మెరిట్ బేస్డ్ అసిస్టెన్స్ లభిస్తోంది. కుటుంబ వార్షికాదాయం నిర్దేశిత మొత్తంలో ఉన్న వారికి ఆయా క్యాంపస్‌లు ట్యూషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వడం లేదా నెలవారీ స్టయిఫండ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి.
  • ఐఐఎం అహ్మదాబాద్‌లో.. కుటుంబ వార్షికాదాయ ఆధారిత ట్యూషన్ ఫీజు మినహాయింపు పథకం అమలవుతోంది. కుటుంబ వార్షికాదాయం రూ.ఆరు లక్షలలోపు ఉన్న విద్యార్థులకు పూర్తి స్థాయి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తోంది.
  • ఐఐఎం-అహ్మదాబాద్ నీడ్ బేస్డ్ స్పెషల్ స్కాలర్‌షిప్స్ పేరుతో కుటుంబ వార్షికాదాయం రూ. రెండు లక్షలలోపు ఉన్న విద్యార్థులకు కూడా పూర్తి స్థాయి ట్యూషన్ ఫీజు మినహాయింపు పథకాన్ని అమలు చేస్తోంది.
  • వీటికితోడు ఇండస్ట్రీ స్కాలర్‌షిప్స్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్స్ పేరిట రూ. 2,200 స్టయిఫండ్ లభిస్తోంది.
  • ఐఐఎం-బెంగళూరులో ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్, ఉదయ్‌నాయక్ స్కాలర్‌షిప్, టి.థామస్ స్కాలర్‌షిప్, ఓపీ జెమ్స్ స్కాలర్‌షిప్, రాజేశ్ కౌశిక్ మెమోరియల్ స్కాలర్‌షిప్, ఆక్వెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ స్కాలర్‌షిప్స్, కాగ్నిజెంట్ సంస్థ బిఇజార్డ్ స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎంపికైన వారికి కనిష్టంగా రూ.1.25 లక్షలు, గరిష్టంగా రూ.3 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందుతోంది.
  • ఐఐఎం-లక్నోలో.. కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షలలోపు ఉన్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తోంది. ఈ మినహాయింపును అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 15 శాతం మందికే అందిస్తోంది.
  • హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్, సిటి బ్యాంక్, రతన్ టాటా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు కూడా స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. ఈ స్కాలర్‌షిప్ మొత్తాలు రూ.ఆరు వేల నుంచి రూ. పది లక్షల వరకు ఉంటున్నాయి.
  • ఐఐఎంలో సీటు పొందిన విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ఆర్థిక ప్రోత్సాహకం.. ఇండస్ట్రీ స్పాన్సర్డ్ అసిస్టెన్స్. ముఖ్యంగా పని అనుభవం ఆధారంగా నిర్వహించే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఇవి లభిస్తున్నాయి. సదరు అభ్యర్థులకు అప్పటికే పని చేస్తున్న సంస్థ ఆర్థిక సహకారం అందిస్తుంది. అయితే కోర్సు పూర్తి చేసుకున్నాక తమ సంస్థలోనే పని చేసే విధంగా ముందుగానే ఒప్పందం చేసుకుంటుంది. ఇప్పుడు పలు కార్పొరేట్ సంస్థలు, ఎంఎన్‌సీలలో ఈ విధానం అమలవుతోంది.

బ్యాంకు రుణాలు :

ఐఐఎంల ఫీజుల పరంగా విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రధాన మార్గం.. బ్యాంకు రుణాలు. ఐఐఎంలకు ఎంపికైన విద్యార్థులకు బ్యాంకులు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయి.

ప్రయివేటు స్కాలర్‌షిప్స్
1. ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్
2. ఆక్వెన్ స్కాలర్‌షిప్
3. ఒ.పి.జెమ్స్ స్కాలర్‌షిప్
4. సిటి బ్యాంక్ స్కాలర్‌షిప్ ఎయిడ్
5. నెస్లె ఇండియా స్కాలర్‌షిప్స్
6. ఏపీజే ట్రస్ట్
7. భారతి ఫౌండేషన్

ఐఐఎంలు.. గత నాలుగేళ్లుగా ఫీజుల పెంపు తీరు :
క్యాంపస్

సంవత్సరాల వారీగా ఫీజు

2015 2016 2017 2018
అహ్మదాబాద్ 18.5 19.5 21 22
బెంగళూరు 17 18.7 19.5 21
కోల్‌కత 16.3 19 20 21
కోజికోడ్ 15 15.26 16.7 17.5
ఇండోర్ 13 13 14 16
లక్నో 10.8 14 16 14.16
త్రిచీ 10.1 11.6 12 14
రాంచీ 10.5 12.5 13.8 14
షిల్లాంగ్ - 13 13 12.68
ఉదయ్‌పూర్ 9.3 11 12.6 12.6
కాశీపూర్ - 9 12.5 12.5
రోహ్‌తక్ 9 10.5 12.2 12.3
రాయ్‌పూర్ - 9.97 9.97 12
నాగ్‌పూర్ - 9.7 11 11
బోధ్‌గయ - 10 10 11
అమృత్‌సర్ - 8.5 9 10.5
విశాఖపట్నం - - 10.5 10.5
జమ్ము - 10.34 10.5 10.5
సిర్మౌర్ - 10.5 10.34 10.34
సంబల్‌పూర్ - - - 10
Published date : 25 Apr 2018 03:54PM

Photo Stories