Skip to main content

ఐఐఎంల్లో ..ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు-ఎంపిక విధానం

ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ లేదా ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్.. ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీ-స్కూల్స్ అందిస్తున్న.. ఈ కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతోంది! ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతలతోనే ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏలో చేరుతున్నారు.
ప్రస్తుతం పని చేస్తున్న విభాగంలో మరింతగా రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు ఈ ప్రోగ్రామ్ దోహదపడుతోంది. ప్రధానంగా ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఐఐఎంలు(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్) అందించే ఎగ్జిక్యూటివ్ ఎంబీఏకు మంచి డిమాండ్ నెలకొంది. 2020 విద్యా సంవత్సరానికి ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీస్కూల్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ/ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏతో ప్రయోజనాలు, ప్రవేశార్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం...

బ్యాచిలర్ డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగం వచ్చింది. అయిదారేళ్లు ఇట్టే గడిచిపోయాయి. సంస్థలో మరింతగా ఎదగాలంటే.. సరికొత్త స్కిల్స్‌తోపాటు, నిర్వ హణ నైపుణ్యాలను సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇలా డిగ్రీతోనే ఉద్యోగంలో చేరిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్‌లో.. డిగ్రీ స్థాయి కోర్సుతో ఉన్నత స్థానాలు అందుకోవడం కష్టమే? అనే ఆందోళన మొదలవుతోంది. ఇలాంటి వారికి ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లు ఉపయుక్తం.

ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ :
ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ పీజీ.. పేరులోనే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం, లక్ష్యం కనిపిస్తోంది. అప్పటికే ఆయా రంగాల్లో పని చేస్తూ, పని అనుభవం సొంతం చేసుకొని.. కొత్త నైపుణ్యాల ద్వారా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే వారికి చక్కగా సరిపోయే ప్రోగ్రామ్... ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. ఒక్క మాటలో చెప్పాలంటే.. మిడ్ కెరీర్‌లో మెరవాలనుకునే ఉద్యోగులకు ఊతమిచ్చేలా దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్ నిర్వహిస్తున్న ప్రోగ్రామ్.. ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ పీజీ.

అనుభవం తప్పనిసరి :
ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరాలనుకునే వారికి పని అనుభవం తప్పనిసరి. ఐఐఎంలు అందించే ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం రెండేళ్లు, గరిష్టంగా అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. సాధారణంగా ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్ కాల వ్యవధి ఏడాదిగా ఉంటోంది. ఐఐఎం- అహ్మదాబాద్, లక్నో, కోజికోడ్, కోల్‌కత వంటి క్యాంపస్‌ల్లో మాత్రం పలు ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ వ్యవధి రెండేళ్లు. రెండేళ్ల వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు అధిక శాతం పార్ట్‌టైమ్ విధానంలోనే నిర్వహిస్తున్నారు.

లేటెస్ట్ స్కిల్స్ :
ప్రస్తుతం ఐఐఎం క్యాంపస్‌లు వివిధ రకాల ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాయి. వీటిల్లో సంప్రదాయ మేనేజ్‌మెంట్ కోర్సులు మొదలు.. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ స్కిల్స్‌ను అందించే ప్రోగ్రామ్‌ల్లో సైతం ప్రవేశం కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐఎం-బెంగళూరునే పరిగణనలోకి తీసుకుంటే.. ఇటీవల కాలంలో మేనేజ్‌మెంట్ రంగంలో ఎంతో కీలకంగా మారిన బిజినెస్ అనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇలాంటి వాటితోపాటు ఐఐఎం క్యాంపస్‌ల్లో ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ప్రోగ్రామ్‌ల్లోనూ చేరే వీలుంది.

రెసిడెన్షియల్.. పార్ట్‌టైమ్ :
కార్పొరేట్ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఐఐఎంలు రెండు రకాలుగా ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. అవి.. రెసిడెన్షియల్, పార్ట్ టైమ్. రెసిడెన్షియల్ విధానంలో కోర్సు వ్యవధి ఆసాంతం క్యాంపస్‌లోనే ఉండాలి. పార్ట్ టైమ్ విధానంలో... వీకెండ్ క్లాసెస్, ట్రైమిస్టర్ లేదా సెమిస్టర్ విధానంలో ఒకటి లేదా రెండు వారాలు మాత్రం క్యాంపస్‌లో క్లాస్ రూమ్ బోధనకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ-లెక్చర్స్ పేరుతో ఆన్‌లైన్ విధానంలో బోధన సదుపాయం సైతం అందుబాటులో ఉంది.

జీమ్యాట్ లేదా జీఆర్‌ఈ స్కోర్ :
ఐఐఎంలు అందించే ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. జీమ్యాట్ లేదా జీఆర్‌ఈ స్కోర్ తప్పనిసరి. ఈ స్కోర్లు ఉన్న అభ్యర్థుల దరఖాస్తులనే అడ్మిషన్స్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. గత మూడు లేదా నాలుగేళ్ల జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్ల ఆధారంగానూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తాము గతంలో సాధించిన స్కోర్స్‌లో బెస్ట్ స్కోర్‌ను పేర్కొంటూ.. దరఖాస్తు చేసుకోవాలి.

మలి దశలో జీడీ, ఇంటర్వ్యూ..
ఐఐఎంలు అందించే ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ పీజీలో ప్రవేశాల కోసం ఏటా రెండు రౌండ్లలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తొలి రౌండ్ ప్రక్రియ ఆగస్ట్/సెప్టెంబర్‌ల్లో.. రెండో రౌండ్ అక్టోబర్/నవంబర్‌ల్లో ఉంటుంది. తొలుత అకడమిక్ సర్టిఫికెట్లు, జీఆర్‌ఈ, జీమ్యాట్ స్కోర్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. మలిదశలో ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

వెయిటేజీ విధానం :
ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లకు ఎంపిక ప్రక్రియలో.. అకడమిక్ ప్రొఫైల్, జీఆర్‌ఈ/జీమ్యాట్ స్కోర్, పని అనుభవం వ్యవధి, జీడీ/ఆర్‌ఏటీ, పర్సనల్ ఇంటర్వ్యూలకు వేర్వేరుగా వెయిటేజీ ఉంటుంది. ఈ వెయిటేజీ ఒక్కో ఐఐఎంలో ఒక్కో విధంగా ఉంటోంది. అధిక శాతం ఐఐఎంల్లో పని అనుభవానికే ఎక్కువ వెయిటేజీ లభిస్తోంది. ఆ తర్వాత జీడీ/ఆర్‌ఏటీ, పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభకు ప్రాధాన్యం ఉంటుంది. ఇలా ఆయా అంశాలకు మొత్తం వంద మార్కులకు వెయిటేజీని నిర్ధారించి.. టాప్‌లో నిలిచిన అభ్యర్థులకు ప్రవేశం ఖరారవుతుంది.

షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ :
వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఐఐఎంలు కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ పేరుతో షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. పదిహేను రోజుల నుంచి రెండు నెలల వ్యవధిలో ఉండే ఈ ప్రోగ్రామ్‌ల్లోనూ ప్రవేశం పొందే వీలుంది. నిర్దిష్టంగా ఒక విభాగంలో లేటెస్ట్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌ల ముఖ్య ఉద్దేశం. ఎక్కువ సమయం వెచ్చించలేని వారికి ఇవి ఉపయుక్తం.

ఫీజులు ఎక్కువే కానీ..
ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌ల ఫీజులు ఎక్కువే అని చెప్పొచ్చు. ఏడాది వ్యవధిలోని పీజీ ప్రోగ్రామ్‌లకు ట్యూషన్ ఫీజు రూ.11 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉంటోంది. అయితే ఈ ప్రోగ్రామ్‌లకు ఎంపికైన వారికి బ్యాంకు రుణాలు, స్పాన్సర్‌షిప్స్, స్కాలర్‌షిప్స్ లభించే అవకాశముంది. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సదుపాయం సైతం అందుబాటులో ఉంది. పని అనుభవంతో ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్ పూర్తిచేసుకుంటే.. ఆకర్షణీయ పే ప్యాకేజీ అందుతోంది. కనిష్టంగా రూ.17 లక్షలు, గరిష్టంగా రూ.30 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తోంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :
వచ్చే విద్యా సంవత్సరానికి (2020-21) సంబంధించి ఐఐఎంల్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్‌కు ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆయా ఐఐఎంల వెబ్‌సైట్లను వీక్షించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్ లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు పరీక్షల్లో ఏదో ఒక పరీక్షకు హాజరవుతున్నట్లు, అదే విధంగా తుది దశ ఎంపిక సమయానికి సదరు స్కోర్ కార్డ్‌ను అందించేలా సిద్ధమైతే సరిపోతుంది.

ఎగ్జిక్యూటివ్ ఎంబీఏతో ప్రయోజనాలు..
  • వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు.
  • పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం పొందొచ్చు.
  • ఏడాది వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకునే వెసులుబాటు
  • కంపెనీల నుంచి ఆకర్షణీయమైన వేతనాలతో ఆఫర్లు
నైపుణ్యాలకు చక్కటి మార్గం..
వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ తమ స్కిల్స్ పెంచుకునేందుకు ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్‌లు చక్కటి మార్గంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండేళ్ల ప్రోగ్రామ్‌తో పోల్చితే.. ఏడాది వ్యవధిలో ఉండే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ల్లో లెర్నింగ్ స్కోప్ తక్కువనే అభిప్రాయం సరికాదు. ఏడాది వ్యవధిలోనే అన్ని రకాల నైపుణ్యాలు అందించేలా ఐఐఎంల కరిక్యులం ఉంటుంది.
-ప్రొఫెసర్ పాటిబండ్ల మురళి, ఐఐఎం-బెంగళూరు.
Published date : 10 Oct 2019 12:26PM

Photo Stories