Skip to main content

ఆధునిక నైపుణ్యాలు అందించేలా.. ఐఐటీలు, ఐఐఎంల్లో కొత్త కోర్సులు.. !

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. సంక్షిప్తంగా ఐఐటీలు! దేశంలో టెక్నికల్, ఇంజనీరింగ్‌ విద్యలో పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లు! ఐఐటీల నుంచి పట్టా పొందితే.. ఉజ్వల కెరీర్‌ ఖాయమనే అభిప్రాయం.

ఈ ఇన్‌స్టిట్యూట్‌లు జాబ్‌ మార్కెట్‌ అవసరాలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. విద్యార్థులు రియల్‌ టైమ్‌ స్కిల్స్‌ను అందుకునేలా బీటెక్, ఎంటెక్‌ స్థాయిలో నూతన ప్రోగ్రామ్స్‌ను రూపొందిస్తున్నాయి. అలాగే మేనేజ్‌మెంట్‌ విద్యకు పేరుగాంచిన ఐఐఎంలు సైతం ఆధునిక కోర్సుల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐఐటీలు, ఐఐఎంల్లో కొత్త కోర్సులపై ప్రత్యేక కథనం.. 

ఐఐటీలు విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు అందించేలా కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. తొలితరం ఐఐటీలుగా పేరొందిన ఐఐటీ–ఢిల్లీ, కాన్పూర్, ముంబై మొదలు న్యూ జనరేషన్‌ ఐఐటీలుగా పేర్కొనే..ఐఐటీ–హైదరాబాద్, మండి వంటి క్యాంపస్‌ల వరకూ.. దాదాపు అన్ని ఐఐటీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. వీటిల్లో కోర్‌ టెక్నికల్‌ కోర్సులతోపాటు సామాజిక ప్రగతికి దోహదపడే ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, హెల్త్‌కేర్‌ టెక్నాలజీ వంటివి కూడా ఉండటం విశేషం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు నూతన సాంకేతిక నైపుణ్యాలతోపాటు సామాజిక అవగాహన పెంపొందించడమే ఐఐటీల కొత్త కోర్సుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌..

టెక్నికల్‌ విద్యార్థులకు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌ పెరిగేలా కోర్సులు, కరిక్యులం ఉండాలి. అప్పుడే విద్యార్థుల్లో ఆల్‌ రౌండ్‌ ప్రతిభ సాధ్యమవుతుందనేది నిపుణుల వాదన. అందుకు తగ్గట్టుగానే ఐఐటీలు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌కు ప్రాధాన్యమిచ్చేలా కొత్త కోర్సులను రూపొందిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు కోర్‌ సబ్జెక్ట్‌లతోపాటు దానికి సంబంధించిన ఇతర మైనర్‌ సబ్జెక్ట్‌లు, విభాగాలపైనా అవగాహన లభిస్తుంది.

బీటెక్‌ స్థాయిలోనే..

ఐఐటీలు ఎక్కువగా బీటెక్‌ స్థాయిలోనే కొత్త ప్రోగ్రామ్‌లను తెస్తున్నాయి. ఇది భావి ఇంజనీర్లకు మేలు చేసే నిర్ణయంగా పేర్కొనొచ్చు. ఉదాహరణకు ఐఐటీ ముంబై.. హెల్త్‌కేర్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో నాలుగేళ్ల బీటెక్‌ ప్రోగ్రామ్‌ను అందించనుంది. 

అదే విధంగా ఐఐటీ–కాన్పూర్‌ సైతం స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటాసైన్స్‌లో బీటెక్‌ కోర్సును కొత్తగా ప్రవేశపెట్టనుంది. 

 

డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు..

ఐఐటీల్లో అందించనున్న కొత్త ప్రోగ్రామ్‌ల్లో డ్యూయల్‌ డిగ్రీ కోర్సులైన బీటెక్‌+ఎంటెక్‌ కూడా ఉన్నాయి. దీంతో ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే వీటిల్లో చేరిన విద్యార్థులు.. అయిదేళ్ల వ్యవధిలోనే ఎంటెక్‌ పట్టా అందుకోవచ్చు. బీటెక్,ఎంటెక్‌ కోర్సులను వేర్వేరుగా అభ్యసిస్తే ఆరేళ్లు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లతో అయిదేళ్లలోనే ఎంటెక్‌ సర్టిఫికెట్‌ చేతికందుతుంది. అలా ఒక ఏడాది ఆదా అవుతుంది. 

 

ఆన్‌లైన్‌ కోర్సులు..

ఐఐటీ విద్యను  ఎక్కువ మందికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పలు ఐఐటీలు ఆన్‌లైన్‌ కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. ఐఐటీ–రూర్కీ.. సర్టిఫికేషన్‌ ఇన్‌ డేటాసైన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌; ఐఐటీ–చెన్నై.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నాలెడ్జ్‌ రిప్రజెంటేషన్‌ అండ్‌ రీజనింగ్‌; ఐఐటీ–హైదరాబాద్‌.. విజువల్‌ డిజైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. అదే విధంగా దేశంలోని దాదాపు అన్ని ఐఐటీలు ఆన్‌లైన్‌ విధానంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డిజైన్‌ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 

 

‘కొత్త’ బాట..

  • ఐఐటీలు గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి.
  • కొంతకాలం క్రితమే ఐఐటీ–ముంబై.. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌+ మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ పేరుతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. 
  • ఐఐటీ–గాంధీనగర్, ఐఐటీ కాన్పూర్‌లు.. కాగ్నిటివ్‌ సైన్స్‌లో పీజీ, డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి.
  • ఐఐటీ రూర్కీ.. హైస్పీడ్‌ రైల్వే ఇంజనీరింగ్‌లో బీటెక్‌ డిగ్రీని అందిస్తోంది. అదే విధంగా ఐఐటీ–ఖరగ్‌పూర్‌.. రైల్వే ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ డిగ్రీని ప్రారంభించింది. 
  • ఐఐటీ–హైదరాబాద్‌ ఆన్‌లైన్‌ విధానంలో ఓపెన్‌ కోర్స్‌ వర్క్‌ రూపంలో బిజినెస్‌ డేటా అనలిటిక్స్‌లో ఆన్‌లైన్‌ శిక్షణకు రూపకల్పన చేసింది. అంతేకాకుండా ఎంటెక్‌ స్థాయిలో డేటాసైన్స్‌ కోర్సును అందిస్తోంది. 

 

ఈ ఏడాది కొత్త కోర్సులివే..

  • ఈ విద్యా సంవత్సరం(2021–22) నుంచి ఐఐటీల్లో అందుబాటులోకి రానున్న కొత్త ప్రోగ్రామ్‌ల వివరాలు.. 
  • ఐఐటీ–కాన్పూర్‌.. సైబర్‌ సెక్యూరిటీలో బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ; ఎంటెక్, ఎంఎస్‌ బై రీసెర్చ్‌ కోర్సులు; స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటా సైన్స్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్, బీఎస్‌+ఎంఎస్‌ కోర్సులు. 
  • ఐఐటీ–రూర్కీలో.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్‌ స్పెషలైజేషన్లలో ఎంటెక్, మూడేళ్ల ఎంటెక్‌–వీఎల్‌ఎస్‌ఐ కోర్సు. 
  • ఐఐటీ–ఢిల్లీలో.. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో బీటెక్, సైబర్‌ సెక్యూరిటీలో ఎంటెక్‌ స్థాయిలో ఇంటర్‌డిసిప్లినరీ కోర్సు.
  • ఐఐటీ–ముంబైలో.. హెల్త్‌కేర్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో బీటెక్, బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ.
  • ఐఐటీ–ఇండోర్‌లో.. ఎంటెక్‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ టెక్నాలజీ అండ్‌ స్పేస్‌ ఇంజనీరింగ్, స్పేస్‌ సైన్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌. 
  • ఐఐటీ–చెన్నైలో.. సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్, క్వాంటమ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో అయిదేళ్ల బీటెక్‌+ఎంటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, ఎంటెక్‌లో సైబర్‌ – ఫిజికల్‌ సిస్టమ్స్‌.
  • ఐఐటీ–హైదరాబాద్‌లో.. ఎంటెక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ స్పెషలైజేషన్‌.

ఇంకా చదవండి : part 2 : ఐఐటీల్లో ప్రారంభించిన కొత్త కోర్సుల్లో ప్రవేశం పొదండిలా..

Published date : 24 Jun 2021 01:40PM

Photo Stories