Skip to main content

అదనపు కోర్సులు...కెరీర్‌కు హంగులు

కోర్సు ఏదైనా అంతిమ లక్ష్యం.. ఉద్యోగం. నేటి టెక్నాలజీ యుగంలో, కార్పొరేట్ పోటీ ప్రపంచంలో.. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ చదువులతో ఉద్యోగాలకు ఎంపికవడం కాస్త కష్టంగానే ఉంది. డిగ్రీ తర్వాత పీజీ కోర్సుల్లో చేరి, విజయవంతంగా పూర్తిచేసినా.. చదువుకు తగ్గ కొలువు దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే డిగ్రీతోపాటే జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను పూర్తిచేయడం ద్వారా డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగ వేటలో మిగతా వారికంటే ఒకడుగు ముందు ఉండొచ్చు. తాజాగా డిగ్రీలో చేరిన విద్యార్థులు ఇటు తరగతులకు హాజరవుతూనే.. అటు జాబ్ మార్కెట్‌లో ముందు నిలిచేలా పలు అదనపు (వాల్యూ యాడెడ్) కోర్సులు పూర్తిచేసు కోవాలనేది నిపుణుల సూచన. దీనికి అందుబాటులో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం...
కామర్స్.. కలిసొచ్చే కోర్సులు
జాబ్ మార్కెట్ అవసరాలు మారుతున్నాయి. కామర్స్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు మెరుగవుతున్నాయి. బీకాం, బీబీఏ, బీబీఎం లాంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులు.. తమ కోర్ సబ్జెక్టులకు సంబంధించిన అదనపు(వాల్యూయాడెడ్) కోర్సులు పూర్తిచేస్తే కలిసొస్తుంది. ఇంటర్ అర్హతతో కొన్ని సర్టిఫికేషన్లు ఉన్నాయి. అవి..
  • మ్యూచువల్ ఫండ్ విభాగంలో ఇంటర్ అర్హతతో కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. పూర్తివివరాలకు https://www.amfiindia.com వెబ్‌సైట్ చూడొచ్చు.
  • ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) ఇంటర్ అర్హతతో పలు సర్టిఫికేషన్లు అందిస్తుంది. ఈ కోర్సులు చేయడం వల్ల ఇన్సూరెన్స్ రంగంలో స్థిరపడవచ్చు. మరిన్ని వివరాలు https://www.insuranceinstituteofindia.com వెబ్‌సైట్ నుంచి పొందొచ్చు.
  • నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సైతం కొన్ని కోర్సులు అందిస్తోంది. స్టాక్ మార్కెట్లకు సంబంధించిన ఎన్‌ఎస్‌ఈ అకాడమీస్ సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్సియల్ మార్కెట్స్(ఎన్‌సీఎఫ్‌ఎం) కెరీర్‌లో ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలను https://www.nseindia.com/-education/content/about_ncfm.htm వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన సీఎఫ్‌ఏ, ఏసీసీఏలు పలు కోర్సులు అందిస్తున్నాయి. వివరాలు https://www.cfainstitute.org, https://www.accaglobal.com/uk/en.htm సైట్లల్లో లభిస్తాయి.
  • విభాగాల వారీగా కూడా కామర్స్ విద్యార్థులకు అవకాశాలకు కొదవ లేదు. ఫైనాన్స్ విభాగంలో ఎన్‌ఎస్‌ఈ కోర్సులతోపాటు ఫోరెక్స్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, మార్కెట్ ఆపరేషన్స్, బ్యాంకింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాములు ఉన్నాయి. హెచ్‌ఆర్ విభాగంలో ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ల నిర్వహణ (ఉదాహరణకు ఎస్‌ఏపీ), ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సాఫ్ట్‌స్కిల్స్ ట్రైనింగ్, రిక్రూట్‌మెంట్ స్కిల్స్ మొదలైన వాటిని డిగ్రీ చదువుతూనే శిక్షణ పొందొచ్చు. మార్కెటింగ్‌లోనూ కామర్స్ గ్రాడ్యుయేట్లు మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈ-కామర్స్‌లకు సంబంధించిన షార్ట్‌టర్మ్ కోర్సులు చేస్తే ఉద్యో గావకాశాలు మెండు.

బీఎస్సీ విద్యార్థులకు...
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ)లో సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. బీఎస్సీ కంప్యూటర్స్ విద్యార్థులు అకడమిక్‌గా రాణిస్తూనే ప్రాక్టికల్ లెర్నింగ్‌కు వీలున్న సర్టిఫికేషన్స్ చేయొచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో వెబ్ డెవలప్‌మెంట్ కోర్సులు, నెట్‌వర్కింగ్-సెక్యూరిటీ కోర్సులు, డేటాబేస్ కోర్సులు, వెబ్‌డిజైన్ కోర్సులకు డిమాండ్ ఎక్కువ. సర్టిఫికేషన్స్‌లలో సిస్కో సర్టిఫికేషన్లు, సన్ సర్టిఫికేషన్లు, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్లు, క్లౌడ్ సర్టిఫికేషన్లు మొదలైనవి చేయడం ద్వారా జాబ్ మార్కెట్‌లో మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

బీఏ విద్యార్థులకు...
బీఏ విద్యార్థులకు సమాజంపై ఎంతో అవగాహన ఉంటుంది. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, లాంగ్వేజెస్ తదితర సబ్జెక్టులపై ఈ విద్యార్థులకు ఉన్న పరిజ్ఞానం దృష్ట్యా... వీరు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షల్లో రాణించడానికి అవకాశాలెక్కువ. అంతేకాకుండా బీఏ విద్యార్థులూ మార్కెటింగ్, మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ సంబంధిత కోర్సుల్లోనూ చేరొచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు తమ అభిరుచులకు సంబంధించిన సర్టిఫికేషన్స్ చేయడం మేలనేది నిపుణుల సలహా. ఫోటోగ్రఫీ, యోగా, యానిమేషన్, అడ్వర్టైజ్‌మెంట్స్, వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్, డీటీపీ లాంటి అభిరుచులు ఉంటే.. సంబంధిత సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు చేయడం లాభిస్తుంది.

కోర్సు ఏదైనా .. కావాలి స్కిల్స్
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రస్తుతం జాబ్ మార్కెట్ స్వరూపమే మారిపోతోంది. విషయ పరిజ్ఞానంతోపాటు మరెన్నో స్కిల్స్ ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్క్, ఇంగ్లిష్ నైపుణ్యం, అర్థమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ స్కిల్స్ ఇతర నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు కృషిచేయాలి. కాలేజీలో చేరిన మొదటి రోజునుంచే ఆయా స్కిల్స్‌ను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి. ఎంఎన్‌సీలు, ఇతర కంపెనీలు ఉద్యోగుల ఎంపికలో అభ్యర్థుల దృక్పథాన్ని ప్రధానంగా పరీక్షిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు డిగ్రీలో చేరినప్పటి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం, బేసిక్ ఇంటర్నెట్ వినియోగం, సెర్చింగ్ స్కిల్స్ అలవర్చుకోవాలి. ఎంఎస్ ఎక్సెల్‌లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, ఫిల్టరింగ్ అండ్ డేటాసార్టింగ్, మాక్రోస్, పివోట్ టేబుల్, వి-లుకప్, హెచ్-లుకప్ తదితర ఆప్షన్లను క్షుణ్నంగా తెలుసుకోవాలి. అన్నింటి కంటే ప్రధానంగా టైపింగ్ నేర్చుకోవాలి.

ఆన్‌లైన్కోర్సులు...
ఎన్‌పీటీఈఎల్
(https://onlinecourses.nptel.ac.in/)
స్వయం (https://swayam.gov.in/)
కోర్సెరా (https://www.coursera.org)
యుడెమీ (https://www.udemy.com)
ఉడాసిటీ (https://www.udacity.com)
ఎడెక్స్ (https://www.edx.org)
పై వెబ్‌సైట్లు ఉపయుక్తంగా ఉంటాయి. వీటిలో ఉచితంగా, నామమాత్రపు ఫీజుతో సర్టిఫికేషన్లు చేయొచ్చు.

అదనపు అర్హతలు ముఖ్యం:
డిగ్రీ విద్యార్థులు.. వారు చేస్తున్న కోర్సులోని సబ్జెక్టుకు సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించొచ్చు. లేదా అదనపు అర్హతలు, నైపుణ్యాలపై దృష్టిసారించడం ద్వారా ఇతర కెరీర్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. సబ్జెక్టు వైపు వెళ్లాలనుకుంటే.. ఉదాహరణకు కామర్స్ విద్యార్థి ఫైనాన్సియల్ ప్లానింగ్ లేదా ఫిన్‌టెక్ కోర్సుల్లో సర్టిఫికేషన్ చేయొచ్చు. జనరల్ కోర్సుల్లో భాగంగా న్యూమరికల్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్, కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవాలి. వీటిపై పట్టు సాధిస్తే డిగ్రీలో ఉండగానే బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, గ్రూప్స్, సివిల్స్ ఉద్యోగ సాధనకు దోహదపడుతుంది. ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం పొందేందుకు కూడా ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయి.
- శ్రీనాథ్‌రాజు, ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్.
Published date : 02 Aug 2018 05:33PM

Photo Stories