Skip to main content

Cyber Security: మహిళలే లక్ష్యం... సైబర్‌ సేఫ్టీ పాయింట్స్‌ ఇవే

డిజిటల్‌ ప్రపంచం ఎక్కువగా మాట్లాడే వాటిలో సైబర్‌ స్టాకింగ్‌ ఒకటి. దీంట్లో మహిళలు, పిల్లలనే లక్ష్యంగా చేసుకుని వేధింపులు ఉంటాయి.
Online Safety awareness
Online Safety awareness

స్టాకింగ్‌
ఇది ఆన్‌లైన్‌ ముప్పు అని చెప్పవచ్చు. అవతలి వ్యక్తితో మనకు ప్రత్యక్ష సంబంధం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఆఫ్‌లైన్‌ స్టాకింగ్‌ కంటే సైబర్‌ స్టాకింగ్‌ నేరాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే నేరస్థుడిని కనుక్కోవడం అంత సులభం కాదు. దీంట్లో అధికంగా టీనేజర్లు బాధితులవుతున్నారు. మహిళలపై ట్రోల్‌ల సంఖ్య పెరిగింది. కరోనా కాలం ఆన్‌లైన్‌ హింస, లైంగిక వేధింపుల గురించి ఒక కొత్త ఆందోళనలను లేవనెత్తింది. కోవిడ్‌ –19 తర్వాత ప్రపంచం ఆన్‌లైన్‌ వైపు వేగంగా కదులుతున్నందున, స్త్రీవాద దృక్పథం మారాల్సి ఉంది.  

పరువు నష్టం
తమ తమ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలను వ్యక్తీకరించడానికి ప్రజలకు ఒక వేదిక ఇంటర్నెట్‌. దీని ద్వారా కలిగించే పరువు నష్టం మరో వ్యక్తి ప్రతిష్టకు కలిగే గాయం. ఇది ఇంటర్నెట్‌ సహాయంతో ఏ వ్యక్తికైనా వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచురించడాన్ని సూచిస్తుంది. ఇప్పటికే సైబర్‌ పరువు నష్టంపై అనేక కేసులు ఉన్నాయి. ఇది ఎక్కువగా ఫేస్‌బుక్, గూగుల్‌ లేదా ఏదైనా ఇతర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ లేదా మెయిల్‌ వెబ్‌సైట్‌ లో ఒకరి ఐడీ హ్యాక్‌ చేయడం ద్వారా ఉంటుంది. అలాగే, ఒక వ్యక్తి తాలూకు పూర్తి సమాచారంతో మరో నకిలీ ఖాతాను సృష్టించడం ద్వారా కూడా జరుగుతుంది.  

ఫొటో మార్ఫింగ్‌
మార్ఫింగ్‌ అనేది అసలు ఫొటోలను మార్పిడి చేయడం. హ్యాకర్‌ మీ ఫొటోలను ఉపయోగించి, దానిని మార్ఫ్‌ చేసి, దుర్వినియోగం చేయడం సులభం. మార్ఫింగ్‌ చేయకుండా మీరు ఎవ్వరినీ ఆపలేరు. మీ ఫొటోలు పబ్లిక్‌గా ఉంటే, వ్యక్తులు వాటిని సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. వాటిని మార్ఫ్‌ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. తమ లైంగిక ఊహలను సంతృప్తి పరుచుకోవడానికి పోర్న్‌ సైట్‌లలో వాటిని ఉపయోగిస్తుంటారు. ఎవరైనా మీ ఫోటో తీసి వాటిని అలా ఉపయోగించినా మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. 

ఇ–మెయిల్‌ స్పూఫింగ్‌
ఒకదాని నుంచి పంపించినట్టు ఇ–మెయిల్‌ను సూచిస్తుంది. కానీ అది మరొక దగ్గర నుండి పంపించినదై ఉంటుంది. ఈ సాంకేతికతను ఉపయోగించే ఇ–మెయిల్స్‌ తరచూ కొన్ని మెసేజ్‌లు, పంక్తులు, లోగోలను కలిగి ఉంటాయి. ఇ–మెయిల్‌ స్పూఫింగ్‌ అనేది ఫిషింగ్, స్పామ్‌ ప్రచారాలలో ఉపయోగించే ఒక ముఖ్యమైన వ్యూహం. అంటే లాటరీ వచ్చిందనో, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్స్‌.. అనో వీటిని ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటప్పుడు అవి సరైన మెయిల్స్‌ అని గుర్తించినప్పుడే వాటిని ఓపెన్‌ చేయడం మంచిది.  

సైబర్‌ సేఫ్టీ పాయింట్స్‌

పాస్‌వర్డ్‌లను షేర్‌ చేయద్దు
బ్యాంక్‌ ఖాతా అయితే ఎవరికి వారు తమ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకుంటారు. లేదా ఎవరికీ చెప్పకుండా ఒక చోట రాసి పెట్టుకుంటారు. అలాగే, మీ డిజిటల్‌ పాస్‌వర్డ్‌ను ఎంత నమ్మకమున్న స్నేహితుడు లేదా భాగస్వామితోనైనా షేర్‌ చేయకూడదు. దీనికి సంబంధిం చిన భయం మంచిదే. స్నేహితులు ఉద్దేశపూర్వకంగా మీకు హాని కలిగించకపోయినా, వారు అనుకోకుండా ఎవరికైనా మీ పాస్‌వర్డ్‌ను చెప్పవచ్చు. కొన్నిసార్లు మీ పాస్‌వర్డ్‌ మారకముందే సంబంధాలు మారిపోతుంటాయి. మీ విచక్షణను ఉపయోగించండి, ఆ పాస్‌వర్డ్‌లను ప్రైవేట్‌గా, సంక్లిష్టంగా ఉంచండి.

మీ వెబ్‌క్యామ్‌ని కనెక్ట్‌ చేసి ఉంచద్దు
మీ వెబ్‌ కెమెరాను ఆన్‌ చేసి, మీకు తెలియకుండానే మీ కదలికలను చాకచక్యంగా రికార్డ్‌ చేయగల అనేక యాప్‌లు ప్రస్తుతం ఉన్నాయి. ఉపయోగంలో లేనప్పుడు మీ కెమెరా లెన్‌ ్సను మూసి ఉంచండి లేదా పూర్తిగా ఏదైనా కవర్‌తో కప్పి ఉంచండి.

అవసరానికి మించి షేర్‌ చేయద్దు
సంబంధాలలో మంచి, చెడు రెండూ ఉంటాయి. అత్యుత్తమ వ్యక్తులు కూడా ఒకోసారి మరోవైపుకు మారచ్చు. అందుకే మీరు షేర్‌ చేసిన మీ సన్నిహిత సందేశాలు, ఫొటోలు, సమాచారం వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా షేర్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

ఆన్‌ లైన్‌ పరిచయస్తులను ఒంటరిగా కలవవద్దు
ఆన్‌లైన్‌ వ్యక్తులను బయట కలిసే ముందు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తెలియజేయండి. మీరు రద్దీగా ఉండే అంటే కాఫీ షాప్‌ లేదా మాల్‌లో సదరు వ్యక్తిని కలుసుకోవడానికి నిర్ణయించుకోవడం శ్రేయస్కరం.

అవసరమైనంత వరకే..
అనుమానం లేని మహిళలతో స్నేహం చేయడానికి సోషల్‌ మీడియా సైట్‌లను బ్రౌజ్‌ చేస్తున్న వారిలో చెడ్డవారు అనేకం ఉన్నారు. అందుకని.. మీ ఆచూకీ, జీవనశైలి గురించిన వివరాలను పోస్ట్‌ చేయడంలో జాగ్రత్తగా ఉండండి. స్టాకర్‌లు ఒక సాధారణ ఫోటోగ్రాఫ్‌ లేదా స్టేటస్‌ అప్‌డేట్‌తో మిమ్మల్ని చేరుకోవడానికి మార్గాలను కనుక్కోగలరు. మీ కెమెరాలో జియోట్యాగింగ్‌ని స్విచాఫ్‌ చేయండి. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి. 

ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌
ఈ ప్రక్రియ కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కానీ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి సిస్టమ్‌ అప్‌డేట్‌ చాలా ముఖ్యమైనది. ఇది భద్రతా అప్‌డేట్‌లు, ప్యాచ్‌లు తాజా బెదిరింపులను దూరంగా ఉంచుతుంది. 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌తో పరికరాలు భద్రం
భద్రతా వ్యవస్థ లేకుండా మొబైల్‌ ఫోన్‌ లేదా టాబ్లెట్‌ కలిగి ఉండటం అనేది తలుపులు తెరిచి ఇంట్లో కూర్చున్నట్లే. ఆండ్రాయిడ్, మ్యాక్‌ పరికరాలకు రెండూ హానికరమైన సాఫ్ట్‌వేర్‌ దాడికి ఉపకరణాలు. ఇవి మీ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకోగలవు కాబట్టి మీ అన్ని పరికరాలలో ‘నార్టన్‌ సెక్యూరిటీ’ వంటి భద్రతా వ్యవస్థను ఇన్‌ స్టాల్‌ చేయండి.

ఫైన్‌ ప్రింట్‌
ఏదైనా సేవ, రహస్యానికి సంబంధించిన సమాచారం, సేవా నిబంధనలను అర్థం చేసుకోండి. కొన్ని వెబ్‌సైట్‌లు మీ సమాచారాన్ని ఎవరికైనా ఇచ్చేయవచ్చు. లేదా అమ్మచ్చు, అద్దెకు తీసుకోవచ్చు. ఇది పెద్ద సమస్యగా మీకే తిరిగి రావచ్చు, మీరు నిబంధనలు షరతులకు అంగీకరించినందున చట్టం మిమ్మల్ని రక్షించలేకపోవచ్చు.

‘ఉచితం’ అంటూ ఏదీ లేదు
ఫ్రీ గేమ్‌లు, ఆఫర్లు, డీల్‌లు మొదలైనవిగా కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి. అవి వైరస్‌లు, స్పైవేర్, హానికరమైన సాఫ్ట్‌వేర్‌లతో చిక్కుకుపోయి ఉండవచ్చు. ఇవి మీ పరికరంలోకి ప్రవేశించి, మీ మొత్తం డేటాను పొందగలవు.

వద్దనుకున్న వారు బ్లాక్‌
అవసరం లేని వ్యక్తులను జాబితా నుండి అన్‌ ఫ్రెండ్‌ చేయండి లేదా బ్లాక్‌ చేయండి. మీ స్నేహితుల జాబితాలో ఎవరు ఉండాలో మీరు ఎంచుకోవచ్చు. భద్రత విషయానికి వస్తే ఆనఖలైన్, ఆఫ్‌లైన్‌ రెండింటిలోనూ సరైన జ్ఞానం, రక్షణ మొదటి వరుసలో ఉండాలి. మీ రక్షణలో మీ ప్రవృత్తులే కీలక పాత్ర పోషిస్తాయని గ్రహించండి. 

ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, 
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Published date : 02 Sep 2022 04:17PM

Photo Stories