Skip to main content

APPSC: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే.. తొలిసారి హాజరు ఇలా..

సాక్షి, అమరాతి: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు చేసింది.
APPSC
గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే.. తొలిసారి హాజరు ఇలా..

జూన్‌ 3 నుంచి 10 వరకు ఈ పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్, సభ్యులు సలాంబాబు, సుధీర్‌తో కలిసి మే 31న ఆయన మీడియాతో మాట్లాడారు. 111 గ్రూప్‌–1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటికి ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి 27న ఫలితాలను వెల్లడించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులకు రెండో దశ అయిన మెయిన్స్‌ను జూన్‌ 3 నుంచి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సవాంగ్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 1,26,449 మంది దరఖాస్తు చేసుకోగా 87,718 మంది హాజరయ్యారని తెలిపారు. వారిలో 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు. వీరికి రాష్ట్రంలో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్వోలను పరీక్షల కోఆర్డినేటర్లుగా నియమించామన్నారు. అభ్యర్థులను పరీక్ష తేదీల్లో ఉదయం 8.30 నుంచి 9.45 గంటల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పెన్, పేపర్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. భాషా పేపర్లు తప్ప మిగిలినవి తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటాయన్నారు. 

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ |టీఎస్‌పీఎస్సీ

తొలిసారి బయోమెట్రిక్, ఫేషియల్‌ రికగ్నిషన్‌ 

వాస్తవానికి మెయిన్స్‌ పరీక్షలు ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉన్నా ఆ సమయంలో సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలు ఉన్న నేపథ్యంలో జూన్‌కు వాయిదా వేసినట్టు సవాంగ్‌ వెల్లడించారు. మెయిన్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్, ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా నమోదు చేస్తామన్నారు. గతంలో ఈ విధానం లేదని.. ఏపీపీఎస్సీ చరిత్రలో తొలిసారిగా దీన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ట్యాంపరింగ్, కాపీయింగ్‌కు అవకాశం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి కదలిక, శబ్దాన్ని గుర్తించేలా అందులో ఏర్పాట్లు ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలను ఏపీపీఎస్సీ కేంద్ర కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానించామని తెలిపారు. మెయిన్స్‌ పూర్తయిన వెంటనే జూలై రెండో వారానికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేస్తామన్నారు. ఆగస్టులో ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పారు. ఆగస్టు 15 కల్లా గ్రూప్‌–1 భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కాగా, సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

త్వరలో 1,962 పోస్టుల భర్తీకి చర్యలు 

అతి త్వరలో 1,962 పోస్టులకు సంబంధించి 18 నోటిఫికేషన్లు రానున్నాయని సవాంగ్‌ తెలిపారు. త్వరలోనే గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ రానుందని వెల్లడించారు. ఏపీపీఎస్సీ 2019–23 మధ్య 57 నోటిఫికేషన్ల ద్వారా 5,705 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టి.. ఇప్పటిదాకా 4,594 పోస్టులను భర్తీ చేసిందన్నారు. మిగిలిన పోస్టుల భర్తీ వివిధ స్థాయిల్లో ఉన్నట్టు వివరించారు. గతంలో ఇచ్చిన ఆరు నోటిఫికేషన్లపై కోర్టు కేసులు ఉన్నందున భర్తీ ఆలస్యమవుతోందని తెలిపారు. మరో ఏడు నోటిఫికేషన్ల పోస్టులకు పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే మరో 9 నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడించాల్సి ఉందన్నారు. సరైన కారణం లేకుండా కొందరు పరీక్షలపై కోర్టులను ఆశ్రయిస్తున్నారని.. దీంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోందని చెప్పారు. ఈసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అందువల్లే ఈసారి గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఇచ్చిన మూడు నెలల్లోనే ప్రిలిమ్స్‌ నిర్వహించి 19 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని తెలిపారు. 

పరీక్షల షెడ్యూల్‌ ఇదీ..

జూన్‌ 3 – తెలుగు
జూన్‌ 5 – ఇంగ్లిష్‌ (అర్హత పేపర్లు)
జూన్‌ 6 – పేపర్‌–1 (జనరల్‌ ఎస్సే) 
జూన్‌ 7 – పేపర్‌–2 (హిస్టరీ అండ్‌ కల్చర్, భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీ)
జూన్‌ 8 – పేపర్‌–3 (పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్, లా అండ్‌ ఎథిక్స్‌)
జూన్‌ 9 – పేపర్‌–4 (భారత్, ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌) 
జూన్‌ 10 – పేపర్‌–5 (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం అంశాలు)

Published date : 01 Jun 2023 03:51PM

Photo Stories