ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూల నిలిపివేత ఉత్తర్వులపై అప్పీళ్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ఇంటర్యూలతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)తో పాటు ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు.
ఈ అప్పీళ్లు గురువారం సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది ఆర్వీ మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వల్ల 365 మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇంటర్వ్యూలతో పాటు తదుపరి చర్యలకు అనుమతినిస్తూ, ఎంపిక కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందన్న ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు కె.లక్ష్మీనర్సింహ, బి.రచనారెడ్డిలు స్పందిస్తూ, మరికొందరు అభ్యర్థులు కూడా అప్పీళ్లు దాఖలు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాలను కూడా ఆ అప్పీళ్లతో కలిపి విచారించాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను జూలై 22కి వాయిదా వేసింది.
Published date : 16 Jul 2021 03:34PM