Skip to main content

ఏపీపీఎస్సీ గ్రూప్ –1 అప్పీళ్లను తొలుత సింగిల్ జడ్జికి నివేదించండి: హైకోర్టు

సాక్షి, అమరావతి: గ్రూప్–1 డిజిటల్ మూల్యాంకనంపై వివాదం నేపథ్యంలో ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
ఆగస్టు 9న సింగిల్‌ జడ్జి ముందు రిట్‌ పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో తొలుత అక్కడ వాదనలు వినిపించాలని సర్వీస్‌ కమిషన్‌తో పాటు ఇంటర్వ్యూ లకు ఎంపికైన అభ్యర్థులకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తరువాత అవసరాన్ని బట్టి ఈ అప్పీళ్లపై విచారణ జరుపుతామని తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. ప్రధాన న్యా యమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమా ర్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

చ‌ద‌వండి: ఏపీ ఎడ్ సెట్‌– 2021 నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 21న పరీక్ష.. 

చ‌ద‌వండి: 40 ఎకరాల్లో.. పశ్చిమ డెల్టాలో ఫిషరీస్ వర్సిటీ 

చ‌ద‌వండి: 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు 

మూల్యాంకనం కాదు.. స్కానింగ్‌ మాత్రమే
గ్రూప్‌–1 ప్రధాన పరీక్షకు సంబంధించి సమాధాన పత్రాలను డిజిటల్‌ పద్ధతిలో మూల్యాంకనం చేసే బాధ్యతలను థర్డ్‌పార్టీకి అప్పగించడం తగదంటూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. దీనిపై సర్వీస్‌ కమిషన్, ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లపై ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. సమాధాన పత్రాల మూల్యాంకన బాధ్యతలను థర్డ్‌ పార్టీకి అప్పగించలేదని, కేవలం స్కానింగ్‌ చేసి మూల్యాంకనం చేసే ప్రొఫెసర్లకు పంపే బాధ్యతను మాత్రమే టీసీఎస్‌కు అప్పగించామని కమిషన్‌ తరఫు న్యాయవాది ఆర్‌వీ మల్లికార్జునరావు తెలిపారు. సింగిల్‌ జడ్జి ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోకుండా పిటిషనర్లు కోరిన విధంగా ఉత్తర్వులిచ్చారన్నారు. ఫలితాలను ప్రకటించబోమని, ఇంటర్వ్యూల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరారు. ఈ అంశాలను తొలుత ఆగస్టు 9న సింగిల్‌ జడ్జికి నివేదించాలని, అవసరాన్ని బట్టి అప్పీళ్లపై విచారణ నిర్వహిస్తామని పేర్కొంటూ ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.
Published date : 24 Jul 2021 03:26PM

Photo Stories