Skip to main content

ప్రణాళికా వ్యూహాలు

వ్యూహం అనే విస్తృత భావనలో అభివృద్ధి ప్రణాళికకు సంబంధించిన విధానపర చర్యలు ఇమిడి ఉంటాయి. భారతదేశంలో ప్రణాళికలకు సంబంధించిన వ్యూహాల్లో పేదరికం, అల్పాభివృద్ధి లాంటి సమస్యల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. పరిమాణం, పెట్టుబడుల పంపిణీ ప్రక్రియ, వనరుల సమీకరణ, ప్రభుత్వ రంగ పాత్ర తదితర అంశాలకు చెందిన విధానాలను ప్రణాళికల్లో అవలంబించారు.
భారత్‌లో ఆర్థిక ప్రణాళికల వ్యూహాన్ని ప్రభావితం చేసిన అంశాలు
1) మహలనోబిస్ వృద్ధి నమూనా
2) భారీ పరిశ్రమల వ్యూహం
3) ఉపాధి లక్ష్యం
4) సామాజిక లక్ష్యాలు; వృద్ధి,అసంతులిత వృద్ధి మధ్య వ్యూహం.

మొదటి పంచవర్ష ప్రణాళిక
విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, సాంఘిక పరిస్థితులను మెరుగుపరచడం లాంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యూహాన్ని ఖరారు చేశారు.

రెండో పంచవర్ష ప్రణాళిక
రెండో పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమల అభివృద్ధి, ప్రజలకు సాంఘిక సేవల కల్పనపై దృష్టి సారించారు. ప్రొఫెసర్ పి.సి. మహలనోబిస్ రష్యా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రెండో ప్రణాళికకు అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించారు.
రెండో ప్రణాళికలో అవలంబించిన వ్యూహంలోని ముఖ్యాంశాలు:
  • మహలనోబిస్ ప్రకారం.. భారీ పరిశ్రమల్లో పెట్టుబడి పెంపు, సేవలపై వ్యయం పెంపు, కొనుగోలు శక్తి పెంపు ద్వారా నూతన డిమాండ్‌ను సృష్టించడం; చిన్న తరహా, గృహ పరిశ్రమల్లో పెట్టుబడి, ఉత్పత్తిని అధికం చేయడం ద్వారా నూతన డిమాండ్‌కు అనుగుణంగా వినియోగ వస్తువుల సరఫరా పెంచడం లాంటివి అభివృద్ధి వ్యూహంలో ప్రధాన అంశాలు.
  • మహలనోబిస్ పెట్టుబడి వ్యూహంలో ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యమిచ్చారు.
  • నెహ్రూ - మహలనోబిస్ అభివృద్ధి నమూనా రెండో ప్రణాళిక రూపకల్పన సమయంలో వెలువడింది. ఇందులో అభివృద్ధికి సంబంధించి దీర్ఘ కాలిక లక్ష్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అధిక పెట్టుబడి రేటు సాధన కోసం పొదుపు రేటును పెంచడం, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వడం, నూతన పరిశ్రమల రక్షణకు ‘రక్షిత విధానం’ అవలంబించడం, దిగుమతుల ప్రత్యామ్నాయీకరణ, లక్షిత వర్గాల ప్రజలకు అవకాశాలను విస్తృతం చేయడం లాంటి అంశాలకు నెహ్రూ - మహలనోబిస్ అభివృద్ధి నమూనాలో ప్రాధాన్యం ఇచ్చారు.
  • ఆధునిక యంత్రాలు, విద్యుచ్ఛక్తిని ఉపయోగించి వినియోగ వస్తువులు రూపొందించే కుటీర, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి నెహ్రూ - మహలనోబిస్ నమూనాలో తగిన ప్రోత్సాహం ఇచ్చారు.

మూడో పంచవర్ష ప్రణాళిక

మూడో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాల మధ్య ఇంటర్‌డిపెండెన్స్ (పరస్పర ఆధారం) వృద్ధి చేయడంపై దృష్టి సారించారు. జాతీయ, ప్రాంతీయ అభివృద్ధి, స్వదేశీ, బహిర్గత ఆధారాల నుంచి వనరుల సమీకరణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళికలో సాంకేతిక ప్రగతికి చర్యలు తీసుకోవడం, అధిక ఉత్పాదకత సాధించడం, జనాభా నియంత్రణ, ఉపాధి, సామాజిక మార్పు అంశాలపై దృష్టి కేంద్రీకరించారు.

వార్షిక ప్రణాళికలు
వార్షిక ప్రణాళికల కాలం(1966-69)లో.. మూడో పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థలో సంభవించిన అనిశ్చిత పరిస్థితులను నివారించడంపై దృష్టి సారించారు. దీంతోపాటు ఏ విధమైన అదనపు ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తకుండా సహేతుక వృద్ధి రేటు సాధనకు ప్రాధాన్యం ఇచ్చారు. అవస్థాపితా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం, ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి కేంద్రీకరించారు. విద్య, కుటుంబ నియంత్రణ, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించి వివిధ సాంఘిక సేవా పథకాలను ప్రవేశపెట్టారు.

నాలుగో పంచవర్ష ప్రణాళిక
నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో (1969-74) వార్షిక ప్రణాళికల్లో అవలంబించిన వ్యూహాన్ని కొనసాగించారు. చిన్న రైతులకు ప్రోత్సాహం కల్పించేవిధంగా వ్యవసాయం, నీటి పారుదల అభివృద్ధికి సంబంధించిన వ్యూహాలను అమలు చేశారు. ఆధునిక పరిశ్రమలను అభివృద్ధి చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే క్రమంలో.. చిన్న, పెద్ద తరహా పారిశ్రామిక యూనిట్ల వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎగుమతులను పెంచడం, దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు క్రమంగా విదేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించడానికి ఈ ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చారు. సమతౌల్య ఆర్థికవృద్ధిని దృష్టిలో ఉంచుకొని సుస్థిరత, స్వయం సమృద్ధి సాధనకు ఈ ప్రణాళికలో పెద్దపీట వేశారు.

అయిదో పంచవర్ష ప్రణాళిక
పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వయం సాధనను దృష్టిలో ఉంచుకొని 5వ పంచవర్ష ప్రణాళిక వ్యూహాన్ని రూపొందించారు. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడినిచ్చే వంగడాల వాడకం, బహుళ పంటల కార్యక్రమం ద్వారా ఉత్పత్తి పెంపునకు ప్రాధాన్యం ఇచ్చారు. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో భాగంగా వినియోగ వస్తువులు, వ్యవసాయాధారిత పరిశ్రమల విస్తరణ, ప్రోత్సాహం లాంటివాటిపై దృష్టి సారించారు.

ఆరో పంచవర్ష ప్రణాళిక
ఆరో పంచవర్ష ప్రణాళిక వ్యూహంలో నిరుద్యోగ సమస్య, అల్ప ఉద్యోగిత, పేదరికాన్ని అట్టడుగు స్థాయికి తగ్గించడం లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడుల వృద్ధిని వేగవంతం చేయడం ద్వారా అవస్థాపనా సౌకర్యాల పెంపు, ఉత్పత్తి, ఎగుమతుల వృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. ఆయా లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ప్రజలకు కనీస అవసరాల కల్పన, గ్రామీణ, అసంఘటిత రంగాల్లో ఉపాధి అవకాశాల పెంపునకు ప్రాధాన్యం ఇస్తూ వ్యూహాన్ని సిద్ధం చేశారు.

ఏడో పంచవర్ష ప్రణాళిక
మానవ వనరుల అభివృద్ధి, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఏడో పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవడం ద్వారా దేశంలో పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతల తగ్గింపునకు కృషి చేసే దిశగా అవసరమైన అభివృద్ధి వ్యూహాన్ని అవలంబించారు.

ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక
ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992-97)లో మానవాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళికలో ఉపాధి అవకాశాల విస్తరణకు అవలంబించిన వ్యూహాలు, విధానాలు, కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి..
  1. వేగవంతమైన, అన్ని ప్రాంతాలకు విస్తరించిన వ్యవసాయ రంగ అభివృద్ధి.
  2. వ్యవసాయాధారిత, అనుబంధ కార్యకలాపాలైన డెయిరీ, ఫిషరీలకు సంబంధించి అవస్థాపనా సౌకర్యాలు, మార్కెటింగ్ సౌకర్యాల అభివృద్ధి.
  3. గ్రామీణ ప్రాంతాల్లో తయారీ కార్యకలాపాల అభివృద్ధి.
  4. చిన్న తరహా, తయారీ రంగ వికేంద్రీకరణపై దృష్టి సారించడం.
  5. ఆరోగ్య, విద్యా సౌకర్యాలను పటిష్టపరచడం.
  6. సేవా, ఇన్‌ఫార్మల్ రంగాల కార్యకలాపాల్లో వేగవంతమైన వృద్ధి.
  7. ఉపాధి వృద్ధి పెంపులో భాగంగా నియంత్రణ విధానాన్ని సరళీకరించడం.
  8. అవస్థాపనా సౌకర్యాలు, గృహ వసతి కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం.

తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక
తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక (1997-2002) వ్యూహంలో భాగంగా.. వ్యవసాయ ఉత్పత్తి పెంపు ద్వారా సాంవత్సరిక వృద్ధి రేటు పెంపు, వనరుల సమీకరణలో స్వయం సాధన (సెల్ఫ్ రిలయన్స్), గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో మార్పులను తీసుకురావడం ద్వారా గ్రామీణ పేదరిక తీవ్రత తగ్గింపు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని మధ్య తరహా, భారీ పరిశ్రమల్లో సామర్థ్యం, పోటీతత్వం పెంపునకు తగిన చర్యలను విస్తరించడం, ఫార్మల్, ఇన్‌ఫార్మల్ రంగాల్లోని గ్రామీణ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మానవాభివృద్ధిని మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
 
పదో పంచవర్ష ప్రణాళిక
పదో పంచవర్ష ప్రణాళిక వ్యూహంలో.. ప్రైవేట్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. వృద్ధి పెంపునకు వ్యూహాలు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న విధానపరమైన సవాళ్లను అధిగమించడంపై దృష్టి సారించారు. ప్రభుత్వ రంగ పెట్టుబడుల్లో మూలధనం - ఉత్పత్తి నిష్పత్తికి ప్రాధాన్యం ఇవ్వడానికి బదులుగా ప్రైవేట్ రంగంలో అధికవృద్ధి వ్యూహాన్ని అమలు చేశారు.
 
పదకొండో పంచవర్ష ప్రణాళిక
పదకొండో పంచవర్ష ప్రణాళికలో (2007-2012) పేదరికం తగ్గించడం, ఉపాధి అవకాశాల కల్పన, లింగ సంబంధిత తేడాలు నివారించడం, అక్షరాస్యత పెంచడం, వ్యవసాయ రంగంలో 4 శాతం వార్షిక వృద్ధి సాధించడం ధ్యేయంగా విశాల దృక్పథంతో కూడిన సమ్మిళిత వృద్ధి వ్యూహాన్ని అమలు చేశారు. 
 
పన్నెండో పంచవర్ష ప్రణాళిక
పన్నెండో పంచవర్ష ప్రణాళిక వ్యూహంలో (2012-2017) వ్యవసాయ రంగంలో అధిక ప్రగతి సాధించడం, ఉపాధి కల్పన (ముఖ్యంగా తయారీ రంగంలో) వేగవంతం చేయడం, విద్య, ఆరోగ్యం, శిక్షణా నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి పటిష్ట చర్యలు తీసుకోవడం, పేదల అభ్యున్నతికి ప్రత్యేకంగా ఉద్దేశించిన పథకాలను సమర్థంగా అమలు చేయడం, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికలు, లక్షిత వర్గాల ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం లాంటి విధానాలపై దృష్టి సారించారు. వేగవంతమైన, సుస్థిర, అధిక సమ్మిళిత వృద్ధికి ఈ ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చారు.
Published date : 09 Mar 2016 04:55PM

Photo Stories