Skip to main content

పంటల తీరు - పంటల పద్ధతులు

ఒక నిర్ణీత కాలంలో వివిధ పంటల కింద ఉన్న భూ విస్తీర్ణాన్ని పంటల తీరుగా భావిస్తాం. ముఖ్యంగా వర్షపాతం, భూసారం, శీతోష్ణస్థితి వంటి ప్రకృతి సిద్ధమైన కారకాలు పంటల తీరును నిర్ణయిస్తాయి. వీటితోపాటు సాంకేతికపరమైన అంశాలు కూడా పంటల తీరును నిర్ణయించడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. 1960 వ దశకం మధ్య భాగంలో మేలు రకమైన వంగడాలను ప్రవేశపెట్టిన తర్వాత గోధుమ పంట విస్తీర్ణంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
సాంకేతికపరమైన అంశాల్లో భాగంగా పంటల తీరును నిర్ణయించడంలో మేలు రకమైన వంగడాలతోపాటు, యాంత్రీకరణ, సమాచార లభ్యత, మొక్కల రక్షణ వంటి అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అవస్థాపనా సౌకర్యాల్లో భాగంగా నీటిపారుదల, రవాణా, నిల్వ, వాణిజ్యం, మార్కెటింగ్, Post Harvest Handling, ప్రాసెసింగ్ లాంటి అంశాలు పంటల తీరు నిర్ణయిస్తాయి. సాంఘిక, ఆర్థిక అంశాల్లో భాగంగా భూ యాజమాన్యం, ఆర్థిక వనరుల లభ్యత, కమతాల పరిమాణం, శ్రామిక లభ్యత, కుటుంబాలకు అవసరమైన ఆహారం, ఇంధనం, విత్తం (Finance) వంటి అంశాలు పంటల తీరును నిర్ణయించడంలో తోడ్పడతాయి. సహజ, ఆర్థిక, చారిత్రాత్మక, సాంఘిక అంశాలతోపాటు ప్రభుత్వ విధానం కూడా పంటల తీరును నిర్ణయించడంలో ప్రధాన భూమిక వహిస్తుంది. పన్నులు, సబ్సిడీలు, ఉత్పాదితాల లభ్యత, పరపతి లభ్యతకు సంబంధించి ప్రభుత్వ విధానాలు పంటల తీరును ప్రభావితం చేస్తాయి. స్వాతంత్య్రానికి ముందు కాలంలో వ్యవసాయ రంగం, పంటల తీరులాంటి అంశాల్లో ప్రభుత్వ విధానం పరిధి తక్కువగా ఉండేది. స్వాతంత్య్రానంతరం నీటి పారుదల విస్తరణ, సేకరణ ధర, మద్దతు ధర లాంటి అంశాల్లో వివిధ ప్రభుత్వ విధానాల కారణంగా పంటల తీరును నిర్ణయించడంలో ప్రభుత్వ విధానాల పరిధి పెరిగింది.
 
భారత్‌లో పంటల తీరు
ప్రణాళికల కాలంలో ముఖ్యంగా గత నాలుగు దశాబ్దాల కాలంలో భారత్‌లోని పంటల తీరు లో గణనీయమైన మార్పులు సంభవించాయి. 1960వ దశకంలో నూతన సాంకేతిక విజ్ఞానం కారణంగా దేశ మధ్యభాగం మొత్తం పంట విస్తీర్ణంలో గోధుమ పంట విస్తీర్ణం పెరిగింది. ఇదే కాలంలో ముడి ధాన్యాలు (Coarse grai-ns), పప్పుధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణం తగ్గింది. 1980వ దశకం మధ్య భాగంలో ‘టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ ప్రారంభించిన తర్వాత నూనె గింజల కింద ఉండే భూ విస్తీర్ణం పెరిగింది. 1992-93 నాటికి వంటనూనె గింజల కింద ఉండే భూ విస్తీర్ణం వృద్ధి చెందడంతోపాటు భారత్ వంటనూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. భారత్ తన ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, పంట సమతౌల్యత లక్ష్యాన్ని సాధించడానికి ఇటీవల కాలంలో ఉద్యానవన పంటల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించింది.
 
స్వాతంత్య్రానంతరం పంటల తీరులో సంభవించిన మార్పులు
 1.
మొత్తం పంట విస్తీర్ణంలో ఆహార పంటలైన తృణ ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్ల వాటా 3/4 వంతు ఉంటుంది. ఆహార ధాన్యాల కింద ఉన్న మొత్తం భూవిస్తీర్ణంలో తృణ ధాన్యాల కింద ఉన్న విస్తీర్ణం ఎక్కువ.
1950-51లో ఆహార ధాన్యాల కింద ఉన్న మొత్తం భూ విస్తీర్ణం 97.3 మి.హెక్టార్లు కాగా ఈ మొత్తంలో 80.4% తృణ ధాన్యాల కింద ఉండటాన్ని గమనించవచ్చు. 2012-13లో ఆహార ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణం 120.2 మి.హె.కాగా ఈ మొత్తంలో తృణ ధాన్యాల కింద ఉన్న విస్తీర్ణం 96.7 మి.హె. స్వాతంత్య్రానంతరం 1950-51, 2012-13లో మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న భూవిస్తీర్ణంలో పప్పుధాన్యాల పంట కింద ఉన్న విస్తీర్ణం 19 నుంచి 20% మాత్రమే.
 2. భారత్‌లో ఆహార పంటల్లో వరి చాలా ముఖ్యమైంది. 1950-51లో 30.8 మి.హె. లలో వరిని పండించారు. మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణంలో వరి పంట కింద ఉన్న విస్తీర్ణం 1950-51లో 31.6%. 2012-13లో 42.4 మి.హె. విస్తీర్ణంలో వరి పంట కింద ఉన్న విస్తీర్ణం 35.3%. దీన్ని బట్టి మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణంలో వరిపంట కింద ఉన్న విస్తీర్ణం 1/3 వంతుగా పేర్కొనవచ్చు. ఇటీవలి కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వరి పంట కింద ఉన్న భూ విస్తీర్ణంలో పెరుగుదలను గమనించవచ్చు. ప్రత్యేక వరి ఉత్పత్తి కార్యక్రమాలు, వరి ఉత్పత్తిలో ప్రవేశపెట్టిన సాంకేతిక విజ్ఞానం కారణంగా వరి దిగుబడిలో దేశవ్యాప్తంగా పెరుగుదల సంభవించింది.
 3. స్వాతంత్య్రానంతరం ముడి ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణంలో తగ్గుదలను గమనించవచ్చు. జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న పంటల కింద ఉన్న భూ విస్తీర్ణం మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న విస్తీర్ణంలో 1950-51లో 28.6% నుంచి 2012-13లో 20.5%నికి తగ్గింది. లాభదాయకత తక్కువగా ఉండటం, పరిమిత డిమాండ్, ఉత్పాదితాల ధరల్లో పెరుగుదల కారణంగా ఈ పంటల కింద ఉన్న భూ విస్తీర్ణంలో తగ్గుదల ఏర్పడింది. మరోవైపు బియ్యం, గోధుమల నుంచి ముడి ధాన్యాలు పోటీని ఎదుర్కొంటున్న కారణంగా ఆయా పంటలకు డిమాండ్ తగ్గింది. అంతేకాకుండా భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముడి ధాన్యాల ధరల కంటే బియ్యం, గోధుమ ధరలు తక్కువగా ఉండటం కూడా ఆయా పంటల కింద ఉన్న భూ విస్తీర్ణం తగ్గడానికి కారణమైంది.
 4. 1950-51లో నూనె గింజల కింద ఉన్న విస్తీర్ణం 10.7 మి.హె.కాగా, 1985-86లో 19.మి.హె.కు పెరిగింది. 1980వ దశకం ముందు కాలంలో వంటనూనెకు సంబంధించి స్వదేశీ డిమాండ్‌ను తీర్చే క్రమంలో భారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడింది. వంటనూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే క్రమంలో భారత్ 1980వ దశకంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.1985-86లో ‘జాతీయ నూనె గింజల అభివృద్ధి ప్రాజెక్టు, 1986, మేలో టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్‌సీడ్‌‌స (Technology mission on oilseads), 1987-88లో ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ థ్రస్ట్ ప్రోగ్రా మ్ (Oil seads Production Thrust Programme)ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాల అమలు కారణంగా నూనె గింజల పంట కింద ఉన్న భూ విస్తీర్ణంలో పెరుగుదల ఏర్పడింది.1998-99లో నూనె గింజల కింద ఉన్న విస్తీర్ణం 26.2 మి.హె.కు పెరిగింది. తర్వాత కాలంలో పంట విస్తీర్ణంలో తగ్గుదల ఏర్పడినప్పటికీ 2012-13లో నూనె గింజల పంట విస్తీర్ణం 26.5 మి.హె.కు పెరగడాన్ని గమనించవచ్చు.
 5. భారత్‌లో రెండో ముఖ్యమైన ఆహార ధాన్య పంట గోధుమ. 1950-51లో మొత్తం ఆహార ధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణంలో గోధుమ విస్తీర్ణం 10% మాత్రమే. తర్వాత కాలంలో హరిత విప్లవం కారణంగా గోధుమ పంట విస్తీర్ణంలో పెరుగుదల సంభవించింది. 2012-13లో 29.7 మి.హె.లలో గోధుమను పండించగా మొత్తం ఆహార ధాన్యాల విస్తీర్ణంలో గోధుమ విస్తీర్ణం వాటా 24.7%గా నమోదైంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో గోధుమ పంట కింద ఉన్న విస్తీర్ణంలో పెరుగుదల ఏర్పడింది. మద్దతు ధరలు అధికంగా ఉండటం, నూతన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ లభ్యత వంటి అంశాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో గోధుమ పంట కింద ఉన్న భూ విస్తీర్ణంలో పెరుగుదల ఏర్పడింది.
 6. వాణిజ్య పంటల్లో భాగంగా చెరకు పంట కింద ఉన్న భూ విస్తీర్ణం 1950-51లో 1.7 మి.హె.కాగా, 1985-86 నాటికి 2.8 మి.హె.కు, 2012-13 నాటికి 5.1 మి.హె. కు పెరిగింది. పత్తి పంట కింద ఉన్న భూ విస్తీర్ణం 1950-51లో 5.9 మి.హె. కాగా, 2012-13లో 12 మి.హె.కు వృద్ధి చెందిం ది. ఇదేకాలానికి సంబంధించి జనుము, గోగునార కింద ఉన్న భూ విస్తీర్ణం 0.6 మి.హె. నుంచి 0.9 మి.హె.కు పెరిగింది.
 
పంట పద్ధతులు
బహుళ పంటలను భారత వ్యవసాయ రంగం ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు. భారత్‌లోని మొత్తం పంట విస్తీర్ణంలో వర్షాభావ వ్యవసాయం విస్తీర్ణం 92.8 మి.హె. (65 శాతం). వర్షాభావ, మెట్ట ప్రాంతాలలో ఒకే పంట కింద ఎక్కువ విస్తీర్ణం ఉన్నప్పుడు అధిక నష్ట భయాలు ఏర్పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో అనేక బహుళ పంట పద్ధతులు ప్రాచుర్యం పొందాయి. దేశంలోని సాంఘిక - ఆర్థిక వాతావరణం నేపథ్యంలో అనేక మిలియన్‌ల రైతు కుటుంబాల్లో ఆహార భద్రత పెంపు ముఖ్యాంశంగా నిలిచింది. దేశంలో 56.15 మిలియన్ ఉపాంత కమతాలు (ఒక హెక్టార్‌లోపు), 17.92 మి. చిన్న కమతాలు (1 నుంచి 2 హె), 13.25 మిలియన్ సెమీ మీడియం (2 నుంచి 4 హె) కమతాలు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పంట ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. కమతాల పరిమాణం తక్కువగా ఉన్న స్థితి కారణంగా వ్యవసాయ రంగం వ్యాపార కార్యకలాపంగా కాకుండా జీవనాధార వ్యవసాయంగా మిగిలిపోయింది. ప్రస్తుతం దేశంలో 250 రెండు పంటల పద్ధతులు అమల్లో ఉన్నట్లు అంచనా. భారత్‌లో అధిక నీటి పారుదల వసతి కలిగిన పంటలుగా వరుసక్రమంలో చెరకు, గోధుమ, బార్లీ, ఆవాలు, వరి, పొగాకు, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ నిలిచాయి. రాష్ట్రాలవారీగా నీటిపారుదల వసతి గల పంట విస్తీర్ణాన్ని పరిశీలించినప్పుడు పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా.. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లు తదుపరి స్థానాలను దక్కించుకున్నాయి. అంచనా వేసిన 250 రెండు పంటల పద్ధతుల్లో ముఖ్యంగా 30 దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో అమల్లో ఉన్నాయి. వీటిలో వరి - గోధుమ, వరి - వరి, వరి - వేరుశెనగ, పత్తి - వేరుశెనగ, పత్తి - గోధుమ, వరి- మినుములు, పెసలు, ఉలవలు, కందులు, వరి- జొన్న, వరి-చెరకు, చెరకు-గోధుమ, పత్తి -మినుములు/పెసలు/ ఉలవలు/కందులు, సోయాబిన్ - గోధుమ అతి ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు.
విస్తీర్ణం పరంగా నీటి పారుదల వసతి గల ముఖ్యమైన పంటలను పరిశీలించినప్పుడు చెరకు పండించే మొత్తం విస్తీర్ణంలో 87.9% విస్తీర్ణం నీటిపారుదల వసతి కలిగి ఉంది. తర్వాత గోధుమ 84.3%, బార్లీ 60.8%, ఆవాలు సంబంధితమైనవి 57.5%, వరి 46.8%, పొగాకు 41.2%, పత్తి 33.2%, ముడి శెనగలు 21.9%, మొక్కజొన్న 21.8%, వేరుశెనగ 19.2% విస్తీర్ణంలో నీటి పారుదల వసతి కలిగి ఉన్నాయి.
 
ముఖ్యమైన పంట పద్ధతులకు సంబంధించి ప్రత్యేకాంశాలు
వరి - గోధుమ:
దేశవ్యాప్తంగా వరి - గోధుమ పంట పద్ధతి ఎక్కువగా అమల్లో ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పద్ధతి ప్రాధాన్యం పొందింది. ఈ రాష్ట్రాల్లో 10.5 మి.హె. భూమి వరి-గోధుమ కింద ఉంది. గత కొనేళ్లుగా ఈ పద్ధతికి సంబంధించి దేశవ్యాప్తంగా వృద్ధి అధికంగా ఉన్నప్పటికీ ఈ పంటల ఉత్పాదకతలో స్తంభన ఏర్పడింది. భవిష్యత్తులోనూ ఉత్పాదకతలో వృద్ధి తక్కువగా ఉండే సూచనలున్నాయి. భూగర్భజలాలు క్షీణించడం, తూర్పు, మధ్య భారతదేశాల్లో ఎరువుల వాడకం తక్కువగా ఉండటం; వ్యాధులు, చీడపీడలు పెరగడం, వాయవ్య మైదాన ప్రాంతాల్లో ఉత్పాదితాల వినియోగ సామర్థ్యం తక్కువగా ఉండటం లాంటి అంశాలు వరి - గోధుమ ఉత్పాదకత తగ్గడానికి కారణాలవుతున్నాయి.
వరి - వరి: ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలోని నీటిపారుదల వసతి గల భూముల్లో వరి-వరి పంటల పద్ధతి ప్రాధాన్యం పొందింది. ఆయా రాష్ట్రాల్లో 6 మి. హెక్టార్ల భూమిని ఈ విధానంలో సాగు చేస్తున్నారు. భూసారం క్షీణించడం, సూక్ష్మపోషకాహార లోటు, నైట్రోజన్ వినియోగ సామర్థ్యం తక్కువగా ఉండటం, న్యూట్రిమెంట్స్ వినియోగంలో అసమతౌల్యం, శ్రామికుల కొరత వంటి అంశాలు ఈ పంటల పద్ధతి ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నాయి. కేరళలో ఈ పద్ధతి కింద భూ విస్తీర్ణం తగ్గుతుంది. ఇదే సమయంలో అధిక లాభదాయకత, తక్కువ శ్రమ సాంద్రతతో కూడిన తోట పంటల కింద ఉండే భూవిస్తీర్ణం పెరుగుతుంది. అసోంలో వరి-వరి పంట పద్ధతిలో ఉత్పాదకత తగ్గడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, న్యూట్రిమెంట్‌ల వినియోగం తక్కువగా ఉండటంతోపాటు భూ సార క్షీణతను కారణాలుగా పేర్కొనవచ్చు.
చెరకు- గోధుమ: 3.4 మి.హె. భూమిలో చెరకు పంట సాగులో ఉంది. ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్‌లోని మొత్తం పంట విస్తీర్ణంలో 68% చెరకు సాగు కింద ఉంది. ఈ పద్ధతి అసోంలోని జోర్హాట్, సిబ్ షాగర్, సోనిత్‌పూర్, మహారాష్ర్టలోని అహ్మద్‌నగర్, కొల్హాపూర్, కర్ణాటకలోని బెల్గాం జిల్లాల్లో ప్రాధాన్యత పొందింది. చెరకు, గోధుమకు సంబంధించి ఆలస్యంగా నాటడం, న్యూట్రియంట్స్ వినియోగం సరిపోయినంతగా లేకపోవడం, చెరకుకు సంబంధించి నైట్రోజన్ వినియోగ సామర్థ్యం తక్కువగా ఉండటం లాంటి అంశాలను చెరకు- గోధుమ పంటల పద్ధతి ఎదుర్కొంటున్న సమస్యలుగా పేర్కొనవచ్చు.
పత్తి - గోధుమ: ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని ఒండ్రు నేలల్లో పత్తిని విస్తారంగా పండిస్తున్నారు. మరోవైపు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని నల్లరేగడి నేలల్లో పత్తి ముఖ్యమైన పంట. పత్తికి సంబంధించి స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాల లభ్యత అధికంగా ఉన్న కారణంగా పత్తి - గోధుమ పంటల పద్ధతి ఉత్తర భారతదేశంలో ప్రాధాన్యత పొందింది. ఈ వ్యవస్థ కింద ఉన్న విస్తీర్ణంలో పత్తి వాటా 70 నుంచి 80%గా ఉంటుంది. దేశ మధ్య ప్రాంతంలో నీటిపారుదల వసతి గల ప్రాంతాల్లో పత్తి-గోధుమ పంటల పద్ధతి అమలులో ఉంది. పత్తి దిగుబడి వచ్చిన వెంటనే గోధుమ నాటడానికి ఆలస్యం జరగడం, పత్తికి సంబంధించి నైట్రోజన్ వినియోగ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల మొత్తం ఉత్పాదకత లోపించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోకపోవడంలాంటి అంశాలను పత్తి-గోధుమ పంటల పద్ధతి ఎదుర్కొంటున్న సమస్యలుగా పేర్కొనవచ్చు.
Published date : 03 Aug 2016 04:16PM

Photo Stories