Skip to main content

భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు

  • భారతదేశం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్న సమాఖ్య రాజ్యం.
  • దేశాభివృద్ధి, దేశ సమైక్యతకు మూలాధారం సంతులన ప్రాంతీయాభివృద్ధి.
  • ప్రణాళికా రూపకర్తలు పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాల్లో సంతులన ప్రాంతీయాభివృద్ధిని పొందుపరిచారు.
  • సమాఖ్య దేశాల్లో కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెంది, మరికొన్ని వెనుకబడి ఉన్నట్లే, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి.
  • రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య సంతులనం లోపించటాన్ని ప్రాంతీయ అసమానతలుగా వ్యవహరిస్తారు.
  • ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నప్పటికీ సమ అభివృద్ధిని సాధించలేకపోయాయి.

ప్రాంతీయ అసమానతలు-కొలమానాలు
  • తలసరి ఆదాయం, పేదరిక రేఖకు దిగువన ఉన్న జనాభా, వ్యవసాయం, పరిశ్రమలు, శ్రామిక నిష్పత్తి, అవస్థాపనా సౌకర్యాలు ఆధారంగా రాష్ట్రాలను అభివృద్ధి చెందిన, వెనుకబడిన రాష్ట్రాలుగా విభజించారు.
  • అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ వంటివి ఉన్నాయి.
  • మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలు.
  • 2001 జనాభా లెక్కల ప్రకారం ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో 48 శాతం జనాభా, వెనుకబడిన రాష్ట్రాల్లో 42 శాతం జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.
  • ప్రాంతీయ అసమానతలకు అనేక కారణాలున్నా, అన్నిటిలో ముఖ్యమైనవి భౌగోళిక అంశాలు. భౌగోళికంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాలు.. ఇతర ప్రాంతాలతో సంఘటితమై ఉండకపోవడం.
    ఉదా: హిమాలయ పర్వత సరిహద్దు ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, ఉత్తర, తూర్పు పర్వత ప్రాంతాలు; అండమాన్, నికోబార్ దీవుల వెనుకబాటుకు సహజసిద్ధ భౌగోళిక అంశాలు కారణం.

చారిత్రక అంశాలు
  • అవస్థాపన, మార్కెటింగ్, వాణిజ్యం పరంగా అనుకూలంగా ఉన్న బాంబే, కలకత్తా, మద్రాసు తదితర సముద్ర తీరాల్లో ఆంగ్లేయ వ్యవస్థాపకులు పెట్టుబడులు పెట్టడంతో ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు, అవస్థాపన అభివృద్ధి జరిగింది.
  • బ్రిటిష్ వారు పెట్టుబడుల్లో చూపిన ప్రాంతీయ వివక్ష కారణంగా మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలు అభివృద్ధి చెందగా, ఇతర రాష్ట్రాలు వెనుకబడ్డాయి.
  • నీటిపారుదల సౌకర్యాల విస్తరణ, తోటల పెంపకం, వాణిజ్య పెట్టుబడులు, అవస్థాపన అభివృద్ధిలో ప్రాంతాలకు సమాన ప్రాతినిథ్యం లభించకపోవడంతో ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి.

సహజ వనరులు
సహజ వనరులు అన్ని ప్రాంతాల్లో లభించవు. అవి లభించే ప్రాంతాల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. ప్రాంతీయాభివృద్ధిపై వాతావరణ ప్రభావం కూడా ఉంటుంది.

హరిత విప్లవం
  • నీటి వనరులు పుష్కలంగా లభించే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన హరిత విప్లవం.. అప్పటికే మెరుగ్గా ఉన్న అక్కడి రైతుల ఆర్థికస్థితిగతుల్ని మెరుగుపరచి, మరింత ధనవంతులుగా చేసింది.
  • అధిక భాగం నీటి వసతి లేని భూములు, కరువు ప్రాంతాలు, అనుత్పాదక కమతాలు, వ్యవసాయేతర వృత్తులు.. హరిత విప్లవం పరిధిలోకి రాకపోవడంతో ప్రాంతీయ, ఆర్థిక అసమానతలు పెరిగాయి.
  • సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి కార్యక్రమం (ఐఏడీపీ) వంటి కార్యక్రమాలను పరిమిత ప్రాంతాల్లో అమలు చేయడంతో సంతులన ప్రాంతీయాభివృద్ధి సాధ్యపడలేదు.

ప్రభుత్వ విధానం
  • 1951 తర్వాత ప్రభుత్వం పరిశ్రమల క్రమబద్ధీకరణ, నియంత్రణ చట్టం వంటి వాటిని అమలు చేసి, పారిశ్రామికీకరణ ద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించవచ్చని భావించింది. కానీ, ప్రణాళికల్లో దీనికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రణాళికా వ్యయం కేటాయింపుల్లోనూ వెనుకబడిన ప్రాంతాలకు సరైన ప్రాతినిథ్యం ఇవ్వలేదు.
  • అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అధిక పెట్టుబడులు పెట్టడం, వెనుకబడిన రాష్ట్రాలకు పెట్టుబడులను మళ్లించకపోవడం, ఉన్న పెట్టుబడులను అభిలషణీయంగా ఉపయోగించ లేకపోవడం వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగాయి.

కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడి
  • కేంద్ర ప్రభుత్వం భారీ పరిశ్రమల స్థాపనకు ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్ వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది.
  • రూర్కెలా, భిలాయ్ తదితర ప్రాంతాల్లో ఇనుము, ఉక్కు పరిశ్రమల స్థాపన, వాటి అనుబంధ పరిశ్రమలు, అవస్థాపన వంటివి పటిష్టమైన ప్రాంతీయాభివృద్ధికి తోడ్పడతాయని భావించారు. కానీ, మూలధన సాంద్రితమైన ఈ పరిశ్రమలు ఈ దిశగా ఆశించిన ఫలితాలు సాధించలేదు.

ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర
  • స్వాతంత్య్రానంతరం పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు పారిశ్రామికాభివృద్ధికి తీవ్రంగా కృషి చేశాయి.
  • ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ రాయితీలు, ప్రోత్సాహకాలను అందించే విధానాలను ప్రభుత్వాలు అమలు చేశాయి.
  • మిగిలిన రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, అంతర్గత పోటీలు, ఓట్లను ఆకర్షించే ప్రజాకర్షణ విధానాలు, అధికారం చేజిక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలు రాష్ట్రాభివృద్ధికి నిరోధకంగా మారి, ప్రాంతీయ అసమానతలను పెంచాయి.

పాలనా వ్యవస్థ
సుస్థిర ప్రభుత్వం, పటిష్ట పాలనా వ్యవస్థ, అధికారుల శ్రద్ధ, శాంతిభద్రతలు వంటివి ప్రాంతీయాభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.

సంస్కరణల తర్వాత పెట్టుబడులు
  • ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత భారీ పరిశ్రమల స్థాపనకు అవరోధాలు తగ్గడంతో పారిశ్రామిక కుటుంబాలు, విదేశీ సంస్థలు, బహుళజాతి కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులు అవస్థాపనా లభ్యత దృష్ట్యా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఉండటంతో సంస్కరణల ఫలాలు వెనుకబడిన ప్రాంతాలకు అందలేదు.

సంతులన ప్రాంతీయాభివృద్ధి లక్ష్యాలు
సంతులిత ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి:
వివిధ ప్రాంతాల్లో లభించే వనరులను గుర్తించి, వాటి వినియోగానికి తగిన ప్రణాళికలు రూపొందించాలి. వనరుల వృథాను నివారించి, సమగ్ర సంతులిత ఆర్థికాభివృద్ధి సాధించి, దేశ సౌభాగ్యానికి పరిపూర్ణత చేకూర్చాలి.

అభిలషణీయ పారిశ్రామిక సంచలనం: సహజ వనరులు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి. సముచిత పారిశ్రామిక సంతులనం ద్వారా అవకాశాలు, అభివృద్ధి ఫలాల పంపిణీలో సమానత్వం పెంపొందించాలి.

వనరుల పరిరక్షణ
  • పరిశ్రమలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల ఆ ప్రాంతాల్లో లభించే వనరులు, ముడిపదార్థాల వాడకంపై ఒత్తిడి పెరుగుతుంది.
  • పరిమిత పరిమాణంలో లభించే పునరుత్పన్నం కాని వనరుల అధిక వాడకం వల్ల అవి అంతరించే ప్రమాదం ఉంది.
  • శీఘ్రగతిన వనరుల లభ్యతలో ఏర్పడే కొరత వల్ల పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది.
  • పర్యావరణ కాలుష్యంలో సంతులనం లోపించి, సమస్యలు ఏర్పడతాయి.
  • అన్ని ప్రాంతాల్లో లభించే వివిధ వనరులను అభిలషణీయంగా ఉపయోగించడం వల్ల వనరుల పరిరక్షణ, పర్యావరణ సంతులనం కాపాడటం.

ఉపాధి కల్పనా న్యాయం
సంతులన ప్రాంతీయాభివృద్ధి ద్వారా అన్ని ప్రాంతాల శ్రామికులకు ఉపాధి కల్పనలో సమాన న్యాయం చేకూర్చి, ఆందోళనలు, తిరుగుబాట్లు లేకుండా జాతి సమైక్యతను కాపాడటం.

సాంఘిక లక్ష్యాలు
  • పారిశ్రామిక కేంద్రాల్లో ఏర్పడే బ్యాక్ వాష్ ప్రభావాల వల్ల గృహాలు, తాగునీరు, రవాణా సౌకర్యాల కొరత, రద్దీ, మురికివాడలు, కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • ఉపాధి అవకాశాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చే ప్రజల జీవనశైలి దెబ్బతినడం, ఒత్తిడి పెరగడం, నైతిక విలువలు దిగజారడం వంటి సమస్యలను సంతులన ప్రాంతీయాభివృద్ధి ద్వారా నివారించడం.

ప్రాంతీయ అసమానతలు- కేంద్రం చర్యలు
  • మొదటి ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను చర్చించలేదు.
  • 2, 3 ప్రణాళికలు.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మౌలిక పరిశ్రమల స్థాపన ఒక్కటే మార్గమని భావించాయి.
  • మొదటి మూడు ప్రణాళికల్లో పారిశ్రామిక రంగంలో జరిగిన మార్పులను గమనించి, 1968లో జాతీయాభివృద్ధి మండలి.. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించేందుకు సూచికలను ఎంపిక చేసింది.
  • పారిశ్రామిక అభివృద్ధి ప్రాధాన్యతను గుర్తించి, 1951 లో పరిశ్రమల అభివృద్ధి, నియంత్రణ చట్టం రూపొందించింది.
  • 1967లో ఎస్.దత్ అధ్యక్షతన ఇండస్ట్రియల్ లెసైన్సింగ్ పాలసీ ఎంక్వయిరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది పారిశ్రామిక లెసైన్సింగ్ విధానాల అమలును సమీక్షించింది.
  • జాతీయాభివృద్ధి మండలి(ఎన్‌డీసీ)..1968లో పాండే, వాంఛూ కమిషన్‌లను ఏర్పాటు చేసింది. పాండే కమిషన్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, గోవా, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలను వెనుకబడిన రాష్ట్రాలుగా గుర్తించింది.
  • పాండే కమిషన్ సూచనల మేరకు వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు తగిన సూచనలు చేసేందుకు వాంఛూ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
  • 4వ ప్రణాళికలో వెనుకబడిన ప్రాంతాలను భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వెనుకబడిన ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలుగా వర్గీకరించారు.
  • 5వ ప్రణాళికా కాలంలో కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం, ఆయకట్టు ప్రాంతాల అభివృద్ధి పథకం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం వంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు.
  • 1975లో ఏర్పాటైన పి.సి.నాయక్ కమిటీ సూచనలకు అనుగుణంగా 1976, మే 7న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అథారిటీ అనే జాతీయ స్థాయి సంస్థ ఏర్పడింది.
  • 6వ ప్రణాళిక గ్రామీణాభివృద్ధి, ఉద్యోగిత కల్పన, సమగ్ర ప్రాంతీయాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. వివిధ పథకాల పనితీరులో అవసరమైన మార్పులు సూచించేందుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు.
  • మానవాభివృద్ధిని ప్రభావితం చేసే విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, విద్యుత్ వంటి అంశాలపై దృష్టిసారించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించడం సాధ్యమవుతుందని 7వ ప్రణాళిక పేర్కొంది.
  • అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ అసమానతలున్నాయని, 80వ దశకంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, అవి కొనసాగుతున్నాయని 8వ ప్రణాళిక పేర్కొంది.
  • ఆర్థికాభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా అందించడానికి, ప్రాంతీయ అసమానతలు ఏర్పడకుండా నివారించడానికి ప్రణాళికాబద్ద కృషి తప్పనిసరి అని 9వ ప్రణాళిక పేర్కొంది.
  • పదో ప్రణాళిక కాలంలో అర్థవంతమైన ఫలితాలు సాధించేందుకు జాతీయ సమాన అభివృద్ధి ప్రణాళిక పథకాన్ని ప్రవేశపెట్టారు.
  • రాష్ట్రాల వృద్ధిలో వ్యత్యాసాలు ఉన్నాయని, ఈ మధ్యకాలంలో అవి కొంత తగ్గుతున్నట్లు 11వ ప్రణాళిక పేర్కొంది. వెనుకబడిన రాష్ట్రాల్లో విద్య, వైద్యం, సాంఘిక అవస్థాపనా సౌకర్యాలు మెరుగవుతున్నాయని అభిప్రాయపడింది.
Published date : 22 Jan 2016 12:10PM

Photo Stories